🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 131 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. సదవగాహన - 2 🌻
అట్లే తోటి మానవులతో సత్సంబంధములు త్రెంచివేయు అంశములలో జుగుప్స తర్వాత ఎన్నదగినది "ఆత్మన్యూనతా భావము". దీని వలన నరుడు సంతోషమును చంపుకొనును. ఇతరులతో వ్యవహరించునపుడు, ఈ న్యూనతాభావమను రంగుటద్దపు జోడుతో చూచును. అవగాహన వక్రమగును. తన కన్నా అధికులని తాను తలంచువారిపై తిరుగుబాటు చేయ మనస్సు ఉద్రేకించును. ఇతరులలోని ఉన్నత విషయములను గుర్తింప నిరాకరించును.
నిజమునకు, తాను సాధింపదలచిన లక్ష్యము యొక్క స్థాయి కంటే తమ స్థాయి గొప్పదను ఎరుకయే ఈ న్యూనతకు హేతువగుచున్నది. ఆధ్యాత్మిక సాధనా యానపథమున కొంతకాలము ఓటములు తాకక తప్పదు. అంతమాత్రము చేత, సాధకుడు తనను తాను అవమానింపబనిలేదు. నిస్పృహుడు కానక్కరలేదు.
ఇట్టి ఓటములు, వెనుకంజలు తాత్కాలికములు మాత్రమే అని అతడు గుర్తెరుగవలెను. ప్రతి ఓటమి, వెనుకంజ విజయమునకు, ముందంజకు సోపానమే. తప్పుచేసినవాడు ఇక బాగుపడడనుట ప్రకృతి సూత్రము కాదు. ఎవనికయినను బాగుపడుటకును, సరిదిద్దుకొనుటకును ప్రకృతి వీలు కల్పించుచున్నది.
ఏ మానవుడును ఇతరుల కన్నా ఎక్కువగా గాని, తక్కువగా గాని తనను గూర్చి తలంచుట అవివేకము. ప్రతివాడును అమృతపుత్రుడే. మానవుని సహజగుణములు దివ్యములే గాని అసురములు గావు సత్సాంగత్యముతో, సత్కర్మాచరణముతో, సద్గురు స్మరణతో, సమిష్టి జీవనముతో సాధకుడు తన యందు దాగిన దివ్యగుణములను వికసింపజేసికొని, ముందజ వేయగలడు.
.....✍ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment