📚. ప్రసాద్ భరద్వాజ
🌻. శ్రీ స్వామి వారు కడప నవాబుకు కాలజ్ఞాన బోధ చేయుట - 2 🌻
“కంచికామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుంది. ఈ సంఘటన జరిగిన తర్వాత వందలాదిమంది మృతి చెందుతారు.
ఆవు కడుపులోని దూడ పుట్టకుముందే బయటి ప్రజలకు కన్పిస్తుంది.
పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు పుడతారు.
కృష్ణ, గోదావరుల మధ్య మహాదేవుడను వాడు జన్మించి శైవుడైనా, అన్నిమతాలనూ గౌరవిస్తూ, గుళ్ళూ గోపురాలూ నిర్మిస్తాడు. పేరు ప్రఖ్యాతులు పొందుతాడు. ఊరూరా గ్రామదేవతలు ఊగిసలాడుతారు.
కాశీ, కుంభకోణం, గోకర్ణ క్షేత్రాల మహాత్తులు తగ్గిపోతాయి. కంచి మహత్యం మాత్రం పెరుగుతుంది.
ఆనంద నామ సంవత్సరాలు పదమూడు గడిచేవరకూ, ఈ నిదర్శనాలు కనిపిస్తూంటాయి. పతివ్రతలు పతితలౌతారు. వావీ వరుసలు పాటించరు. ఆచారాలు అన్నీ సమసిపోతాయి.
రాయలవారి సింహాసనం కంపిస్తుంది. రాయలు విజయనగరం పాలించే సమయంలో గజపతులతో పోరు జరుగుతుంది.
శ్రీశైల క్షేత్రాన కల్లు, చేపలు అమ్ముతారు. వేశ్యాగృహాలు వెలుస్తాయి. అనేక రకాల వ్యాధులు ప్రబలుతాయి. మందులకు తగ్గవు. స్త్రీ పురుషులంతా దురాచారులు అవుతారు. స్త్రీలు భర్తలను దూషిస్తారు.
ఢిల్లీ ప్రభువు నశించిపోతాడు.
వైష్ణవ మతం పైకి వస్తుంది. శైవమతం తగ్గిపోతుంది. నిప్పుల వాన కురుస్తుంది. గుండ్లు తేలతాయి. బెండ్లు మునుగుతాయి. చివరికి శివశక్తి అంటూ లేకుండా పోతుంది.
విజయనగరాన కోటలోని రాయల సింహాసనం బయటపడుతుంది. ఇందుకు గుర్తుగా గ్రామాలలోని రాతి విగ్రహాలు ఊగిసలాడుతాయి. అప్పుడు బిజ్జలరాయని కొలువున రాయల సింహాసనం బయటపడుతుంది...'' ఇలా స్వామివారు కడప నవాబుకు కాలజ్ఞానము బోధించి, మంత్రదీక్ష యిచ్చి ఆశీర్వదించారు.
ఆయన అక్కడినుంచి బయలుదేరి పొద్దుటూరు మీదుగా అల్లాటపల్లె చేరారు. అక్కడ వీరభద్రాలయంలో పూజలు చేయించి బయలుదేరారు. సిద్ధయ్య, మిగిలిన శిష్యులు వెంట రాగా నెమ్మదిగా వెళ్తున్నారు.
ఇదే మార్గంలో అరణ్యంలో తొమ్మిదిమంది దొంగలు, దారిన పోయే బాటసారులను కొల్లగొడుతూ, హతమారుస్తూ వుండేవారు. అందువల్ల ఆ మార్గంలో ప్రయాణించేందుకు ఇష్టపడేవారు కాదు. ఆ మార్గంలోనే బ్రహ్మంగారు ప్రయాణించడం మొదలుపెట్టారు.
సిద్ధయ్యతో ఇష్టాగోష్ఠి జరుపుతూ వస్తున్న స్వామివారి బండిని ఆ తొమ్మిది మంది దొంగలు ఆపారు. వారిని చూసి బండితోలే వ్యక్తి భయపడిపోయి, బండిని ఆపేశాడు.
కర్రలు ఎత్తి స్వామివారి పైకి పోయిన దొంగలు స్వామి వారి దృష్టి పడటంతోటే ఎత్తిన చేతులు ఎత్తినట్లే వుండిపోయారు. మాట్లాడదామంటే మాటలు కూడా రావటం ఆగిపోయాయి. అలాగే రాతి మనుషుల్లాగా వుండిపోయారు.
అది చూచి వీరబ్రహ్మంగారు బండి దిగి, వారందరినీ తీసుకురమ్మని సిద్ధయకు చెప్పారు. వెంటనే సిద్ధయ్య అందరినీ నెట్టుకుంటూ స్వామి వారి వద్దకు చేర్చాడు. స్వామివారు దొంగలందరిని స్వయంగా తాకి , వారి చేతులను కిందికి దించారు.
“నన్ను కొట్టి ఈ బండిలో వున్నధనాన్ని తీసుకోండి" అన్నారు.
జవాబు చెబుదామనుకున్నారు గానీ వారికి నోట మాట రాలేదు.
స్వామివారు కొంత విభూతి వారి నోటిలో వేశారు. అయినా వారు శరీరాన్ని కదపలేక పోయారు. పశ్చాత్తాప పడిన దొంగలు స్వామిని ప్రార్థించారు. దాంతో స్వామి వారిని క్షమించి వదిలివేశారు. స్వామివారు అక్కడినుంచి బయలుదేరి, పుష్పగిరి అగ్రహారం చేరారు.
🌻. పుష్పగిరి వాసులకు చెప్పిన కాలజ్ఞానం.... 🌻
నేను శ్రీ వీరభోగవసంతరాయలుగా, కలియుగంలో 5000సంవత్సరంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థం భూమిపై అవతరిస్తాను.
మార్గశిర మాసంలో దక్షిణభాగంలో ధూమకేతువనే నక్షత్రం ఉదయిస్తుంది. మీ అందరికీ కన్పిస్తుంది. క్రోథి నామ సంవత్సరమున, మార్గశిర శుద్ధ పంచమి రోజున పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో శ్రీ వీర భోగ వసంతరాయలుగా వచ్చే సమయంలో దక్షిణాన నక్షత్రము ఒకటి పుడుతుంది. అది జరగబోయే వినాశనానికి సూచన అని గ్రహించాలి''
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
19.Aug.2020
No comments:
Post a Comment