37. గీతోపనిషత్తు - చీకటి , వెలుగు - సంయమమనగా ఇంద్రియములు మనస్సునందు, మనస్సు బుద్ధి యందు, బుద్ధి నేను అను ప్రజ్ఞ యందు ఇమిడి యుండుట





🌹 37. గీతోపనిషత్తు - చీకటి , వెలుగు - సంయమమనగా ఇంద్రియములు మనస్సునందు, మనస్సు బుద్ధి యందు, బుద్ధి నేను అను ప్రజ్ఞ యందు ఇమిడి యుండుట. అట్టివాడు “జాగర్తి”గ నుండును. అనగా మేలుకొని ఉండును. 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 69 📚


యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి |
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః || 69

మునులకు, యోగులకు ఈ జగత్తున కనబడునది సామాన్యులకు కనపడదు. సామాన్యులకు గోచరించినది సంయమ ముగల యోగులకు గోచరించదు. యోగులకు, మునులకు విశ్వ మంతయు వ్యాపించి ఉన్న ఒకే ఒక చైతన్యము గోచరించును.

ఆ మహాచైతన్యమే పెక్కు విధములుగా ఎట్లు నర్తించుచున్నదో గోచరించును. వైవిధ్యము గల ఆ నర్తనము యొక్క వైభవమును దర్శించుచు వారానందింతురు. వారియందు స్వ-పర భేదములు గాని, సంఘము నందలి స్థితిగతులు గాని, జీవులయందలి భేదములు గాని భాసింపవు.

ఉదాహరణకు ఒక మనిషి ఎట్టి విలువైన వస్త్రములు ధరించెనో, ఎటువంటి ఆభరణములు ధరించెనో, అతని రూపురేఖ లెట్లున్నవో యోగి గమనించడు. ఎదురుగా నిలబడిన జీవమును, జీవచైతన్యమును మాత్రమే దర్శించును. జాతి మత కుల లింగ భేదములు గోచరింపవు.

సమాన్యులకు జాతి మత కుల లింగ భేదములు గోచరించును, ఆకారములు, వాని వికారములు గోచరించును. వస్త్రాభరణములు యొక్క విలువ గోచరించును. ఎదుటివారి తప్పులు గోచరించును.

సంఘమున గల ఇంద్రియార్థములు గోచరించును. మరెన్నెన్నో చిల్లర విషయములు గోచరించును. కాని యోగులకు గోచరించు జీవచైతన్యము, దాని వెలుగు, వైభవములు సామాన్యులకు గోచరించవు.

పై విధముగ యోగులకు గోచరించునవి జీవులకు గోచరించకుండుట యోగుల పగలు, జీవులు రాత్రియని భగవంతుడు చమత్కారముగ తెలిపినాడు. అట్లే జీవులు చూచు లౌకిక విషయములు యోగుల దృష్టిని ఆకర్షించవు. గనుక జీవుల పగలు యోగులకు రాత్రి అనికూడ తెలిపినాడు.

మునులు, యోగులు, ఆత్మ సంయమము చెందిన వారిని, దర్శన జ్ఞానము కలిగివారిని, సతతము మననము నందుండు వానిని కూడ భగవానుడు ఈ శ్లోకమున తెలియజెప్పినాడు.

సంయమమనగా ఇంద్రియములు మనస్సునందు, మనస్సు బుద్ధి యందు, బుద్ధి నేను అను ప్రజ్ఞ యందు ఇమిడి యుండుట. అట్టివాడు “జాగర్తి”గ నుండును. అనగా మేలుకొని ఉండును.

“పశ్యతః' అనగా సమస్తమునందు మేలుకొని యున్న దానిని మెలకువతో దర్శించు చుండును. 'ముని' అనగా దర్శించిన దానిని అదే సమయమున మననము చేయుచుండును. అట్టివాని దృష్టికి చీకటి లేదు. అనగా కనపడకుండుట లేదు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


Whatsapp Group
https://chat.whatsapp.com/5LFkJu3UEcQ5Kgx46WRsin

Telegram Group
https://t.me/ChaitanyaVijnanam

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

24 Sep 2020

No comments:

Post a Comment