కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 107


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 107 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మను తెలుసుకొను విధము -37 🌻

సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ।
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః ।। భగవద్గీత 6-29


అటువంటి యోగం చేయవయ్యా! సర్వ భూతముల యొక్క హృదయాంతరాళములోనున్న అంతర్యామి ఆత్మస్వరూపుడను నేనే! ఈ రకమైనటువంటి సమదర్శనం కలిగినటువంటి వాడు, ఎవడైతే ఉన్నాడో వాడు యోగి. కాబట్టి, యోగి అంటే, చాలా విశాలమైనటువంటి అర్థం ఉంది. సర్వవ్యాపకమైనటు వంటి నిర్ణయం ఉంది. అటువంటి యోగస్థితిని మనం పొందాలి. యోగాభ్యాసాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. అభ్యాస యోగానికి ప్రాధానత్య నివ్వాలి.

కాబట్టి నిరంతరాయమానంగా మనం ఏమి చేయాలంటే, బుద్ధిగుహ యందున్నటువంటి స్వస్వరూప జ్ఞాన సాక్షాత్కార సర్వాంతర్యామి అయినటువంటి సర్వజీవుల హృదయాంతరాళము నందు సదా ప్రకాశిస్తు ఉన్నటువంటి ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని ప్రత్యగాత్మ స్థితిని తెలుసుకోవడానికి మానవులందరూ తప్పక ప్రయత్నించాలి. ఈ విధానంలో మాత్రమే ఇది సాధ్యమౌతుందని కూడా నిర్ణయవాక్యం చెబుతున్నారు.

ఈ బోధలో ఎలా చెబుతున్నారంటే యమధర్మరాజుగారు? ఈ విధానంలో మాత్రమే మానవుడు తెలుసుకోగలడు. ఏమండీ, ఇంకేదైనా మార్గం ద్వారా అన్యథా మార్గం ద్వారా ప్రయత్నిస్తే, అది సాధ్యం కాదు. అంటే అర్థం ఏమిటటా?

మానవుడు, భౌతికమైనటువంటి ఆడంబరాలకు లొంగిపోతాడు. అయ్యవారికి, అమ్మవారికి వెండి కవచాలు, సువర్ణ కవచాలు, ఆలయానికి సువర్ణ కలశాలు, సువర్ణ గోపురాలు ఇలా భౌతికపరమైన ఆడంబరాలతో కూడినటువంటి పనులు చేస్తే నాకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందా?

అమ్మవారికి గజమాల సమర్పణ, నిమ్మకాయల మాల సమర్పణ, ఇతరత్రా ఇత్యాది కర్మోపాసనకు సంబంధించి నటువంటి ఇతరత్రా మార్గములు కానీ, లేదా అనేక యోగమార్గములకు సంబంధించినటువంటి నిర్ణయములు కానీ, లేదా అనేక భక్తిమార్గములకు సంబంధించినటువంటి విధులు కానీ, వీటితో సరిపెట్టుకోగలగుతావా? వీటితో ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని సాధించగలుగుతావా? అంటే, నివృత్తి మార్గం ద్వారా మాత్రమే నువ్వు ఆత్మసాక్షాత్కార జ్ఞానం పొందగలుగుతావు.

ఒకదానికంటే మరొకటి సూక్ష్మతరము, సూక్ష్మతమము అయినటువంటి గోళకముల నుంచి ఇంద్రియములు, ఇంద్రియముల నుంచి శబ్దాది తన్మాత్రలు, శబ్దాది తన్మాత్రలనుంచి మనస్సు, మనస్సు నుంచి బుద్ధి, బుద్ధి నుంచి మహతత్త్వము, మహతత్వము నుంచి అవ్యక్తము, అవ్యక్తము నుంచి ప్రత్యగాత్మ.

ఈ క్రమంలో ఎవరైతే నివృత్తి మార్గాన్ని అనుసరించి, ప్రయాణించి, తమ లక్ష్యాన్ని చేరుకుని, స్వస్వరూప సాక్షాత్కార జ్ఞానాన్ని పొందగలుగుతారో, వారు మాత్రమే, ఈ ఒక్క మార్గములో మాత్రమే, ఈ స్వరూప జ్ఞానాన్ని పొందగలుగుతారు. ఈ సత్యాన్ని మానవులందరూ తప్పక గ్రహించాలి.

మరియు ఓ నచికేతా ! ఈ ఇంద్రియములకు అంతరాముగా ఆత్మయున్న ఎడల అందరకు అనుభవములోనికి రావలయునుగాదా! అట్లు అనుభవములోనికి రాకపోవుటకు కారణమేమని నీవు తలంపవచ్చును. వినుము ఈ పురుషుడు సకల ప్రాణులందు గూఢముగా అతిసూక్ష్మముగా యుండుట చేత అందరకు తెలియునట్లు ప్రకాశించుట లేదు.

ఏకాగ్రత కలిగి సూక్ష్మమైన వస్తువులను పరిశీలించు అలవాటు కలిగిన సూక్ష్మ బుద్ధితో సూక్ష్మమైన వస్తువులను చూచుటకు సమర్ధత కలిగిన జ్ఞానులచే చూడబడుచున్నాడు. సామాన్యముగా మనస్సు ఇంద్రియములవైపు తిరిగియుండును. ఇంద్రియములు శబ్దాది విషయములవైపు మరలుచుండును. కనుక మనస్సు కూడా ఇంద్రియములతో గూడి ఇంద్రియాదులయందు సంచరించుచుండును.

ఇట్టి మనస్సు విషయాసక్తమై, సుఖదుఃఖముల ననుభవిన్చుచుండును. ఈ మనస్సు బాహ్యమైన స్థూల పదార్ధములనే చూడగలదు. అంతరముగాయున్న అతి సూక్ష్మముగా యున్న ఆత్మను చూడలేదు. బుద్ధి కూడా ఈ మనస్సునే అనుసరించుచుండును.

మనస్సు ఇంద్రియములను విషయాదుల మీదికి పోనీయక నిగ్రహించినపుడు స్థూల విషయములను వదలి సూక్ష్మ పదార్ధపరిశోధనకు అనువుగా యుండును. అప్పుడు బుద్ధి కూడా సూక్ష్మవస్తు పరిశోధనకు అనుకూలముగా యుండును. దీనిని ఆగ్ర్యమ బుద్ధి అందురు. అట్టి సూక్ష్మబుద్ధి కలవారే ఆత్మ దర్శనము చేసుకొనగలరు. - విద్యా సాగర్ స్వామి

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


19 Nov 2020

No comments:

Post a Comment