రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
65. అధ్యాయము - 20
🌻. సతి కైలాసమునకు పయనమగుట - 3 🌻
ఈ లోకమునందు ఏ మానవుడైతే చైత్ర శుక్ల త్రయోదశీ, ఉత్తరా నక్షత్ర యుక్త ఆదివారము లయందు నిన్ను భక్తితో దర్శించునో (38), వాని పాపములు ఆ క్షణమునందే వినాశమును పొందుగాక! ఓ హరా! వానికి పుణ్యము విస్తారముగా వర్థిల్లి, రోగములు పూర్తిగా నశించుగాక! (39).
ఏ దురదృష్ట వంతురాలగు స్త్రీ వంధ్య గాని, అంధురాలు గాని, కురూపిగాని అయి ఉండునో, ఆమె కూడా నీ దర్శనమాత్రము చేతనే నిశ్చయముగా దోషములు లేనిది అగును (40). ఈ నా మాటలను విని శివుడు తన మనస్సులో మిక్కిలి ఆనందించి, ప్రసన్నమగు మనస్సుతో 'తథాస్తు' అని పలికెను (41).
శివుడిట్లు పలికెను -
ఓ బ్రహ్మా! నీ మాటచే సర్వలోకములకు హితమును చేయుటకై నేను నా పత్ని యగు సతీ దేవితో గూడి ఆ వేదియందు స్థిరముగా నుండగలను (42).
బ్రహ్మ ఇట్లు పలికెను -
భగవాన్ వృషభధ్వజుడు అచట ఇట్లు పలికి, భార్యతో గూడి వేది మధ్య యందున్న వాడై, తన అంశముతో మూర్తిని నిర్మించి అచటనే నివసించి యుండెను (43). తరువాత తనవారి యందు ప్రేమ కలిగిన శంకర పరమేశ్వరుడు దక్షుని పిలిపించెను. ఆయన తన భార్యయగు సతీదేవితో గూడి బయలు దేరనిచ్చగించెను (44).
ఆ సమయములో పండితుడగు దక్షుడు వినయముతో వంగి దోసిలి యొగ్గి నమస్కరించి వృషభ ధ్వజుని ఆనందముతో స్తుతించెను (45). అపుడు విష్ణువు మొదలగు దేవతలు, మునులు, మరియు గణములు శివునకు నమస్కిరించి, అనేక భంగుల స్తుతించి, ఆనందముతో జయజయ ధ్వానములను చేసిరి (46).
శంభుడు దక్షుని ఆజ్ఞను పొంది, సతీదేవిని ఆనందముతో వృషభముపై కూర్చుండ బెట్టి, తాను కూడా దానిపై అధిష్టించి, ఆ ప్రభువు హిమవత్పర్వతముపై నున్న తన ఆశ్రమమునకు బయలుదేరెను (47). అపుడు అందమైన దంతములు, సుందరమగు చిరునవ్వు గల ఆ సతీదేవి వృషభముపై శంకరుని ప్రక్కన చంద్రునితో మచ్చవలె ప్రకాశించెను (48).
విష్ణువు మొదలగు దేవతలు, మరీచి మొదలగు ఋషులు, దక్షుడు మొదలగు వారందరు మోహితులైరి. మిగిలిన జనులు కదలకుండ నుండిరి (49). కొందరు వాద్యములను వాయించుచూ, మరి కొందరు ఆనందముతో మంగళకరము, శుద్ధము అగు శివుని కీర్తిని గానము చేయుచూ, శివుని వెనుక వెళ్లిరి (50).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
19 Nov 2020
No comments:
Post a Comment