🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. నారద మహర్షి - 23 🌻
164. కాబట్టి శుద్ధసత్త్వగుణసంపన్నమైనటువంటి వైకుంఠం, ఆ శుద్ధసత్త్వ గుణాన్ని ఆశ్రయించే మహాయోగికికాని చైతన్యవంతంగా దర్సనమివ్వదు. అక్కడ ఉండేటటువంటి ద్వారపాలకులుకూడా విష్ణుస్వరూపులై ఉంటారు.
165. విష్ణుతత్త్వం యొక్క-శుద్ధతత్త్వం ఎటువంటిదంటే, దాని సన్నిధిలో వేరొక రూపంతో ఏ వస్తువూ ఉండజాలదు. అక్కడికివెళ్ళిన ఏజీవుడైనాకూడా విష్ణుస్వరూపంలోనే ఉండటం జరుగుతుంది. అంత సక్తివంతమైన దివ్యధామం అది. అక్కడికి వెళ్ళగానే అందరూ చతుర్భుజులై, విష్ణుస్వరూపులై కనబడుతారు.
166. అహంఅనేది ఎలాగ ఉంటుంది అంటే, “చాలా దూరంలో ఉండేవస్తువుని దుర్భిణిలో చూస్తా. ఎంతో దూరంలో ఉన్న నక్షత్ర మండలాలను చూస్తాము. కాని మన వెనుకాల ఉండే వస్తువును చూడలేము. అహం అనేది చిత్తానికి వెనుక ఉంది. కనుక దాని చూడలేము”.
167. ఆయుర్దాయం ఎక్కువగా ఉన్నా ప్రమాదమే, అందుకని సక్రమంగా ఉండే ఆయుర్దాయాన్నే కోరాలి. అలాకాకపోతే వైరాగ్యప్రవృత్తిలో ఉండే ఆయుర్దాయాన్నే అడగాలి. చాలా మందికి ఆయుర్దాయం అనేది ఒక శిక్షగా ఉంటుంది. ఎంతోమంది చావుకోరుతున్నారు, వాళ్ళకు అది రావటంలేదు. ఎంతోమంది బతుకుదామనే ఆశతో ఉండికూడా చచ్చిపోతున్నారు. అంటే ఆయుర్దాయం సక్రమంగా ఉంటేనే ఉండాలి, లేకపోతే శాపమే..
168. ఈశ్వరతత్త్వం ఈ దేహాత్మభావనయందు కలుగదు. ఒక అసంపూర్ణ ఈశ్వరానుభూతి కలుగుతుంది. దేహాత్మభావన గడిచి మూలాధారంనుంచీ పైకివెళితే, అందులో ఈశ్వరుడిని అనుభవించేటటువంటి నేను అనే వస్తువు వేరుగా ఉంటుంది. ఈ నేను అనే పదానికి అది తెలియదు.
169. అట్టి జ్ఞానం తరువాత స్మృతిపథంలో ఉండటంచేత, కొంత వివేకం కలిగి మనుష్యుడు సక్రమంగా సంచరిచవచ్చుకాని, ఈ చైతన్యంలో ఆ భావం ఉండదు. మరి జ్ఞానుభూతిలోనేమో ఈ శరీరం ఉండదు. ఈ అంతరమే విష్ణుమాయ. విష్ణుమాయ అంటే ఏమిటి? దేహి, దేహిగా ఉన్నంతసేపు ఈశ్వరసత్యం తెలుసుకోలేడు. అసత్యంలో ఉంటే, సత్యం తెలియదు. సత్యంలో ఉంటే, అసత్యం గోచరంకాదు.
170. పుత్రులు లేనపుడు కోరికే ఉంది. దుఃఖంలేదు. మృత్యువు అనేది ఒకనాడు లేని వస్తువు. నేడు అది సంప్రాప్తించిందంటే, ఒక నాడు పోక తప్పదనే అర్థం కదా! శరీరమేలేని కాలం ఒకటుంది. పూర్వజన్మకు, ఈ జన్మకు మధ్యన ఉన్న కాలమది. అసత్ ఎప్పుడూ అసత్తే, సత్ ఎప్పుడూ సత్తే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
01 Nov 2020
No comments:
Post a Comment