శ్రీ శివ మహా పురాణము - 261

🌹 . శ్రీ శివ మహా పురాణము - 261 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

61. అధ్యాయము - 16

🌻.విష్ణువు, బ్రహ్మ శివుని స్తుతించుట - 3
🌻

హే పద్మసంభవా! ఆయనను స్మరించుచూ నేను వివాహము లేకుండగనైననూ ఉండగలను. కావున, కర్మలలో నన్ను సదా అనుసరించి ఉండగలిగే భార్యను నాకు నీవు చూపెట్టుము (43). హే బ్రహ్మన్‌! ఆ విషయములో మరియొక షరతు గలదు. వినుము. ఆమె నా మాటయందు విశ్వాసమును కోల్పోయిన నాడు ఆమెను నేను త్యజించెదను (44).

హే ప్రభో! ఆమె సతియను పేర దక్షుని కుమార్తెగా జన్మించినది. ఆమె యందు నీవు కోరిన లక్షణములు గలవు. ఆమె నీకు భార్యయై హితమును చేయగలదు (49). హే దేవదేవా! దృఢవ్రతయగు ఆమె నీ కొరకై తపస్సును చేయుచున్నది. మహాతేజశ్శాలినియగు ఆ సతీదేవి నిన్ను భర్తగా పొందగోరుచున్నది (50).

హే మహేశ్వరా! నీవు దయచేసి ఆమెకు వరమునిచ్చుటకు వేంచేయుము. ఆమె కోరిన వరమునిచ్చి, ఆమెను ప్రీతితో వివాహమాడుము (51). హే శంకరా! ఇది విష్ణువు యొక్క, నా యొక్క మరియు దేవతల యొక్క అభీష్టము. నీవు కృపాదృష్టితో మా కోర్కెను పూర్తి చేయుము. మేము వివాహమహోత్సవమును ఆదరముతో తిలకించెదము (52).

ఇది గొప్ప మంగళమై ముల్లోకములకు సుఖమునీయగలదు. అందరికీ అన్ని దుఃఖములు నశించుననుటలో సంశయము లేదు (53). నేను చెప్పగా మిగిలిన మాటలను మధుసూదనుడగు అచ్యుతుడు, లీలచే రుద్రాకృతిని దాల్చిన పరమశివుడవగు నీకు చెప్పగలడు. నీవు భక్తవత్సలుడవు గదా! (54).

విష్ణువు ఇట్లు పలికెను -

దేవ దేవా!మహాదేవా! కరుణామూర్తీ! శంకరా! బ్రహ్మ చెప్పిన మాటలన్నియూ నేను చెప్పినట్లుగనే స్వీకరింపుము. దానిలో సంశయము లేదు (55). ఓ మహేశ్వరా! నీవు నాపై దయవుంచి అటులనే చేయుము. ఆమెను వివాహమాడి, ముల్లోకములను కృపాదృష్టితో సనాథులను చేయుము (56).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! బుద్ధిశాలియగు విష్ణు భగవానుడు ఇట్లు పలికి ఊరకుండెను. భక్త వత్సలుడగు ఆ శివ ప్రభువు మేము చేసిన స్తోత్రమును విని చిరునవ్వు నవ్వెను (57). అపుడు మేమిద్దరము భార్యలతో, మునులతో మరియు దేవతలతో గూడి శివుని ఆజ్ఞను పొంది మాకు ఇష్టమైన స్థానములకు మిక్కిలి ఆనందముతో చేరుకుంటిమి (58).

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్రసంహితలో రెండవది యగు సతీఖండమునందు విష్ణుబ్రహ్మకృత శివప్రార్థనమనే పదునారవ అధ్యాయము ముగిసినది (16).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


01 Nov 2020

No comments:

Post a Comment