✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀 2. కర్తవ్యపాలనము -వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహములు నాలుగును అంతర్యామి ఆవాసములు. అవి మనలో అంతర్యామి ప్రజ్ఞగను, అహంకార ప్రజ్ఞగను, బుద్ధిగను, మనస్సుగను యున్నవి. చివరి మూడింటి యందు దైవము నిలచినచో యోగము పరిపూర్ణమగును. 🍀
📚. 4. జ్ఞానయోగము - 2 📚
02. ఏవం పరంపరాప్రాప్త మిమం రాజర్ష యో విదుః |
సకాలేనేహ మహతా యోగో నష్టః పరంతప || 2
పరంపరా ప్రాప్తముగ అందించబడిన నిష్కామ కర్మ యోగమును ఋషులైన రాజులు లేక రాజులైన ఋషులు తెలుసుకొని నిర్వర్తించెదరు. చాలకాలము గడచుటచే దీనిని క్రమముగ పాలకులు, ప్రజలు మరచిరి. తత్కారణముగ యోగము నష్టమైనది. జీవులు సంసారమున తిప్పలు పడుచున్నారు.
శ్రీ కృష్ణుడు తెలిపిన యోగము ప్రాథమికముగ నిష్కామ కర్మయోగము. భూమిజీవులు కామ మాధారముగనే కర్మ చేయుదురు. కామము లేనిచో వారికి కర్మమే లేదనిపించును.
నిజమునకు కర్మలు రెండు విధములు. కామ్యకర్మలు, కర్తవ్య కర్మలు. కర్తవ్యమున కామమునకు చోటు లేదు. కర్తవ్య కర్మలే నిర్వర్తించు వానికి క్రమముగ కామము తప్పును. అపుడింద్రియ జయము కలుగును. ఇంద్రియములను జయింత మన్నను ఎవ్వడునూ జయించలేడు. ఇంద్రియములు దివ్యములు. శరీర రక్షణకై రుద్రుని అనుగ్రహముగ ప్రచేతసులచే నిర్మింపబడినవి.
వానిని కర్తవ్య కర్మలకే వాడినపుడు అవి సహకరించును. జయింప
నవసరము లేదు. జయించు బుద్ధి రాజసము. యోగమునకు
వలసినది సత్వగుణము. సత్వమునకు లొంగనిది సృష్టిలో యేమియును లేదు. కర్తవ్యములను మాత్రమే నిర్వర్తించు జీవునకు సత్వగుణము బలపడును.
తత్కారణముగ ఇంద్రియములు సహకరించును. దీనిని భగవంతుడు కార్యంకర్మ, నియతకర్మ అనినాడు. కర్తవ్యపాలనమే కర్మాచరణముగ జీవితము సాగుట యోగమున ప్రథమ పాఠము. దీనియందు సిద్ధి కలుగని వారికి యోగము లేదు. ఇది నిశ్చయము.
భూమి జీవులు ఫలితముల కొరకే జీవించుచున్నారు. కావున
వారి యోగసాధన అంతయు బూడిదలో పోసిన పన్నీరే యగుచున్నది. యోగమున ప్రవేశించు బుద్ధి కలవారు మొదట జీవితమును కర్తవ్యోన్ముఖముగ నడిపించవలెను. ఇది సాధ్యపడనిచో యోగము నందు జేరుట నిరర్థకము. ప్రస్తుతము ప్రజల మనస్సులయందు ఫలితములు సాధించుటే ఒక మహాయజ్ఞముగ సాగుచున్నది.
విద్య, ఉద్యోగము, వ్యాపారము, రాజకీయము, ఆధ్యాత్మిక ప్రచారము, వైద్య విధానము అన్నిటియందు ఫలితమాశించి పనిచేయుటయే యున్నది. కావున యోగము అదృశ్యమై యున్నది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
01 Nov 2020
No comments:
Post a Comment