భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 169


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 169 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. కణ్వమహర్షి - 4 🌻

19. మన మనస్సులకు ఒక ప్రసన్నత, ఒక శాంతిని పొందటానికి, కర్తవ్యం తెలుసుకోవటానికి ఋషులచరిత్రలు తెలుసుకోవటం మనకు అవసరం. మనది ఎంత గొప్ప చరిత్ర అంటే, ప్రపంచంలో ఇహము, పరము రెండూ చెప్పినటువంటి సంస్కృతి మనది.

20. ఐహికమైన సంస్కృతి ఎంత గొప్పదైనప్పటికీ, దానికి పర్యవసానం నాశనమే. లౌకికమైన సమస్తసుఖాలు – ఈ విమాననిర్మాణం లాంటివన్నీ ఎంత చేసినప్పటికీ – ఆ అనుభవం అంతాకూడా ఉన్న నాలుగురోజులే కదా అనుభవించేది!

21. మృత్యువు తరువాత ఎక్కడికి పోవాలి? ఎందుకు వెళ్ళాలి? అక్కడ ఎలా ఉంటుంది? తాను ఏ స్థితిలో ఉంటాడు? అక్కడికి వెళ్ళాలంటే అక్కడ ఉన్నప్పుడు ఏం చెయ్యాలి? ఇటువంటి పారలౌకికమైన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పి, ఆముష్మిక మార్గం చూపించింది మన ఆర్యసంస్కృతి. అలాగని ఐహిక మార్గంలో ఏ లోటూ చేయలేదు. దరిద్య్రంతో బ్రతకమనలేదు. సమస్త భోగములు చెప్పింది.

22. సంగీత నాట్యములు దగ్గరనుంచి అన్ని కళలను, రసములను మనకు అందించింది; మనను అష్టైశ్వర్యాలతో తులతూగమని, ఉత్తమమైన ఆనందాన్ని పొందమని చెబుతూ – “ఇదంతా నశ్వరము. నశించేది. నీవు ఆలోచించ వలసిన విషయము వేరే ఉంది” అని పరాన్నికూడా చెప్పినటువంటిది మన భారతీయసంస్కృతి.

23. రెండూ ఏకకాలంలో చెప్పిన సంస్కృతి సృష్టిలో మరొకటి ఎక్కడా లేదు. దానికి గుర్తించి, దాని మహత్తు గ్రహించకపోతే మనకు భవిష్యత్తే లేదు. వచ్చిన రాజకీయ స్వాతంత్య్రం, సాంస్కృతికస్వాతంత్య్రం కాదు. ఆ దాస్యం ఇంకా మనలను వీడలేదు. ఆ దశలోనే ఉన్నాం ఇంకా మనం.

24. కేవల రాజకీయస్వాతంత్య్రం మనకు క్షేమకరంకాదు. ఎప్పటికైనా వేషము, భాష, ఐశ్వర్యము, ఏదో విమానాలు, కార్లు, రోడ్లు అవన్నీ మంచివే. వాటివలన మనకు అపకారం ఏమీలేదుకాని, అవన్నీ జడపదార్థాలు. అవన్నీ మన ఆలోచనలను, జీవనవిధానాన్ని, జీవితగమ్యాన్ని నిర్దేశించరాదు.

25. మనం అటువంటి భౌతికమైన నాగరికత, సిరిసంపదల వల్ల పాడుకాకుండా ఉండి మన సంస్కృతిని నిలబెట్టుకుంటేనే మనకు శ్రేయస్సు, మనకు తర్వాతి తరాలకు భవిష్యత్తు. అంటే, మన మూలము, మన చరిత్ర, మన సంస్కృతి అయినటువంటి ఋషులచరిత్రలు మనం తెలుసుకుంటే మన కర్తవ్యం బోధపడుతుంది.

26. ఈ ఋషులందరూ ఎవరు? వీళ్ళందరూ మనకు తండ్రులు. ఎన్ని జన్మలలోనో – ఎన్ని గోత్రాలలోనో పుట్టాము. కాబట్టి వీళ్ళందరూ మనకు తండ్రులే కదా! వాళ్ళ స్మృతి మనకు అవశ్యం శరణ్యం. అందుకే వాళ్ళచరిత మనం స్మరణచేసుకోవాలి.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


26 Nov 2020

No comments:

Post a Comment