రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
67. అధ్యాయము - 22
🌻. సతీ శివుల విహారము - 2 🌻
ఈశ్వరుడిట్లు పలికెను -
ఓ మనోహరీ! నా ప్రియురాలా! నేను నీ కొరకై ఎచ్చోట ప్రీతితో మకామును నిర్మించెదనో, అచ్చోటకు మేఘములు ఎన్నడూ వెళ్లవు (23). ఓ మనోహరీ! మేఘములు వర్షాకాలమునందైననూ హిమవత్పర్వత సానువుల మధ్యవరకు మాత్రమే సంచరించును (24).
ఓ దేవీ! అటులనే మేఘములు కైలాస పర్వతము వద్ద సాధారణముగా పాదముల వద్ద మాత్రమే ఉండును. అవి ఆపై ఎత్తులోనికి ఏనాడూ వెళ్లలేవు (25). మేఘములు మేరు పర్వతము యొక్క పై భాగమునకు వెళ్లవు. పుష్కరావర్తకాది మేఘములు మేరు పర్వతమును చుట్టియున్న ఖండములలో ఒకటి యగు జంబూఖండము యొక్క మూలము వరకు మాత్రమే వెళ్లును (26).
ఇంతవరకు వర్ణించిన పర్వతములలో నీ మనస్సునకు నివాసార్థమై ఏది అభీష్టమగునో, నాకు దానిని వెను వెంటనే చెప్పుము (27). నీకు హిమవత్పర్వతమునందు యథేచ్ఛా విహారము చేయవలెననే కుతూహలము గలదా? బంగరు రెక్కలు గల పక్షులు గుంపులుగా ఎగురుచుండగా పిల్ల గాలులు అచట వీచు చుండును. మధురమగు శబ్దములను పక్షులు చేయు చుండును. వాటితో కలిసి పాటలను పాడుతూ విహరించవచ్చును (28).
విమానములయందు ఉపవిష్టలైన సిద్ధాంగనలు ఈ పర్వతమునందు మణులు పొదిగిన ప్రదేశములలో స్వేచ్ఛా విహారమును చేయగోరి భూలోకమునకు రావాలని కోరుచుందురు. వారు అచటి ఫలాదులను గోరి విమానములపై వచ్చెదరు (29).
నాగకన్యలు, గిరి కన్యలు, కిన్నర స్త్రీలు అందరు నీకు ఎల్లవేళలా అనుకూలముగా నున్నవారై ఆట పాటలతో నీకు సాహాయ్యము ను చేయగలరు (30). నీ ఈ సాటిలేని రూపమును, మిక్కిలి అందమైన ముఖమును చూచిన స్త్రీలు సర్దుబాటు చేసుకోదగిన తమ దేహముల కాంతిని చూచి, స్వదేహములయందు, రూపముందు సదా అనాదరమును చేయువారై, రెప్పలు వాల్చకుండగా నీ సుందరరూపమునే చూచెదరు (31).
హిమవంతుని భార్య రూపములో గుణములలో ముల్లోకములయందు ప్రసిద్ధిని గాంచినది. ఆమె కూడా నిత్యము నీకు అనుకూలమగు మాటలను పలికి నీ మనస్సునకు ఉల్లాసమును కలిగించగలదు (32).
హిమవంతుడు స్వయముగా నమస్కరించ దగిన సిద్ధులు అచట తమ దర్శనము నిచ్చి ప్రీతిని కల్గించ గలరు. ఆ పర్వతము తన వివిధ గుణములచే ప్రీతిని కల్గించుటయే గాక, నీకు యోగ్యమగు అను శాసనమును కూడ ఈయ గలదు (33). ఓ ప్రియురాలా! విచిత్రములగు కోకిలల ధ్వనులచే ఆనందమును కలుగజేయునట్టియు, ఉద్యానములతో నిండి ఉన్నట్టియు, సర్వదా వసంతకాల శోభలతో ఒప్పు ఆ నగరమును చూడగోరెదవా? (34).
పర్వతరాజమగు హిమాలయమునందు వందలాది పద్మములతో బహుళమగు శీత జలముతో నిండియున్న సరస్సులు అనేకము గలవు (35). కోర్కెలనన్నిటినీ ఇచ్చే పచ్చని కల్పవృక్షములను, పుష్పములను, గుర్రములను, ఏనుగులను, ఆవుల మందలను ఉత్సాహముతో చూడుము (36).
ఓ మహామాయా! అచట క్రూరమృగములు కూడ ప్రశాంతముగనుండును. ఏలయన, ఆ ప్రదేశము మునులతో, యతులతో నిండియుండును (37). అచటి పర్వత సానువులు స్ఫటిక, స్వర్ణ, రజతములచే శోభిల్లును. పర్వతమంతయు మానసము ఇత్యాది సరస్సులతో ప్రకాశించును (38).
అచటి పద్మముల తూడులు బంగరువి. వాటిలో మరియు మొగ్గలలో రత్నములుండును. ఆ పర్వతము శిశుమార మృగములతో, తాబేళ్లతో, మొసళ్లతో, లెక్కలేనన్ని ఏనుగులతో ప్రకాశించును (39). ఓ దేవేశీ! సుందరమగు నీలో త్పలములు, ముత్యములు, సర్వసుగంధ భరితములగు పుష్పములు, కుంకుమలు ఇత్యాదులతో ఆ పర్వతము నిండియున్నది (40).
అచట సరస్సులు పరిమళ భరితములు, స్వచ్ఛములు అగు జలములతో నిండి యుండగా, సరస్తీరములు పచ్చని గడ్డితోను, ఎత్తైన వృక్షములతోను శోభిల్లెను (41).
మహావృక్షములు ఎత్తైన శాఖలయందు నృత్యము చేయు చున్నట్లుండెను. ఆ శాఖలు తమ బీజములను విడుచుచుండును. మన్మథోద్దీపకములగు సారసపక్షులతో, మత్తెక్కిన చక్రవాక పక్షులతో (42), మధురమగు శబ్దమును చేయుచూ ఆనందమును కలిగించే భ్రమరములతో నిండియున్న ఆ పర్వత ప్రదేశములు శబ్దమును చేయుచూ ఆనందమును కలిగించి, కామోద్దీపనమును కలిగించును (43).
ఇంద్ర, కుబేర, యమ, వరుణ ,అగ్ని, నిర్ ఋతి , వాయు, ఈశానుల (44) నగరములతో శోభించు శిఖరములు గలది, దేవతలకు నిలయము, రంభ, శచి, మేనక మొదలగు దేవతా స్త్రీల గణములచే సేవింపబడునది (45),
భూభారమును మోయు పర్వతములన్నింటిలో శ్రేష్ఠమైనది, మిక్కిలి సుందరమైనది అగు మేరు మహాపర్వతము నందు నీవు సంచరించ గోరుచున్నావా? (46) అచట అప్సరః స్త్రీలతో మరియు చెలికత్తెలతో కూడియున్న శచీదేవి నీకు యోగ్యమగు సాహాయ్యమును నిత్యము చేయగలదు (47). లేదా, సత్పురుషులకు ఆశ్రయము, కుబేరుని నగరము సమీపములో నుండి ప్రకాశించునది (48), గంగాజల ప్రవాహముచే పవిత్రమైనది, పున్నమి నాటి చంద్రుని వలె శోభిల్లునది, గుహలయందు సానువుల యందు వేదఘేషతో కూడినట్టిది (49),
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
26 Nov 2020
No comments:
Post a Comment