గీతోపనిషత్తు - 70


🌹. గీతోపనిషత్తు - 70 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍀 8. తత్త్వజ్ఞులు - జీవులు తత్త్వజ్ఞు లెట్లగుదురు? భగవంతుని యొక్క అవతారములను, అతడు చేసిన దివ్యమైన కర్మలను యథార్థముగ తెలుసుకొనినచో జీవుడు తత్త్వజ్ఞుడు కాగలడు. ఈ రహస్యము భాగవతమున ఈయబడినది. దైవముయొక్క జన్మ దివ్యము. అనగా అప్రాకృతము. కర్మమును దివ్యమే. అనగా లోకహితార్థము. 🍀

📚. 4. జ్ఞానయోగము - 9 📚


జన్మ కర్మ చ మే దివ్య మేవం యో వేత్తి తత్త్వతః |

త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోలర్జున || 9


“ఏ మానవుడు నా దివ్యమైన జన్మమును, కర్మమును యథార్థముగ తెలుసుకొనుచున్నాడో, అతడు దేహాంతరమున జన్మము నొందక నన్నే పొందుచున్నాడు” అని భగవానుడు అర్జునునకు తెలుపుచున్నాడు.

ఈ శ్లోకమున భగవంతుడొక రహస్యమును తెలుపుచున్నాడు. అది ఏమనగా “తనను తెలిసినవాడు తానే యగుచున్నాడు. బ్రహ్మమును తెలిసినవాడు బ్రహ్మమే యగుచున్నాడు" అని ఉపనిషత్ సారాంశము. ఇచ్చట తెలియుట యనగా సిద్ధాంతపరముగ తెలియుట కాదు. స్వానుభవమున తెలియుట.

అట్లు తెలిసినవారు తత్వజ్ఞులు. తత్వమనగా తత్ + త్వం. అనగా అది నీవే. వేదములలో దైవము పేరు 'తత్'. దైవమే నీవు అనునది జ్ఞానసారము. తత్వజ్ఞుడనగా దైవమే తానుగ నున్నాడని అనుభవ పూర్వకముగ తెలిసినవాడు. “వేత్తి తత్త్వతః" అని ఈ శ్లోకమున తెలియబడినది. అనగా తత్త్వజ్ఞులకు 'తాను' తెలియునని అర్థము.

జీవులు తత్త్వజ్ఞు లెట్లగుదురు? భగవంతుని యొక్క అవతారములను, అతడు చేసిన దివ్యమైన కర్మలను యథార్థముగ తెలుసుకొనినచో జీవుడు తత్త్వజ్ఞుడు కాగలడు. ఈ రహస్యము భాగవతమున ఈయబడినది. దైవముయొక్క జన్మ దివ్యము. అనగా అప్రాకృతము. కర్మమును దివ్యమే. అనగా లోకహితార్థము.

వీని యందు మనస్సు రతిగొన్నచో భ్రమర కీటక న్యాయమున , జీవుడు కూడ లోకహితార్థము జీవించు టారంభించును. అట్లు జీవించుట పరిపూర్ణమగుసరికి అతని స్వభావము దివ్యమగును. పాంచభౌతిక ప్రకృతి అతనిని బంధించదు. తత్కారణముగ దేహబంధ ముండదు. దేహబంధము లేనివారికి మరణము లేదు. కావున జన్మము కూడ లేదు.

తత్త్వజ్ఞునకు దేహము గృహము వంటిది. దేహమున ప్రవేశించుట, మరల నిష్క్రమించుట బంధము కాదు. అజ్ఞానికి అది కారాగృహము. బంధింపబడుట, తాత్కాలికముగ విడుదల కలుగుట, మరల బంధింపబడుట అతనికి స్వభావ వశమున కలుగును. దైవీస్వభావ మేర్పడుచుండగ ప్రకృతి స్వభావము సడలు చుండును.

అట్టి తత్త్వజ్ఞులు కూడ క్రమశః అప్రాకృత శరీరమును పొందుదురు. దానినే దివ్యశరీర మందురు. మైత్రేయాది మహర్షు లట్టివారు. వారికి జనన మరణములు లేవు. దైవమే వారి యందు నిండియుండుట వలన వారి రూపమున దైవమే యుండును. కావున వారు తత్త్వజ్ఞులు.

ఇట్లు దైవస్మరణము అనన్యము కాగా, వారు దైవ స్వరూపులై యున్నారు. కావున దైవముయొక్క దివ్యమగు జన్మ కర్మలయందు మనస్సు లగ్నము చేసినవారు క్రమముగ దైవమే యగుదురని, వారికి ప్రాకృత దేహబంధ ముండదని, భగవానుడు అర్జునునకు ఉపాయమును తెలుపుచున్నాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹



Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/10/30/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/



Blogs, Websites:
https://incarnation14.wordpress.com/2020/11/04/spiritual-blogs-websites/



07 Nov 2020

No comments:

Post a Comment