🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 96 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము -26 🌻
కాబట్టి, ఈ బుద్ధి, బుద్ధికి పైనున్నటువంటి చిత్తము, చిత్తము పైన ఉన్న అహంకారము ఇవన్నీ కూడా ఒక దాని మీద ఒకటి నిర్మాణము చేయబడినటువంటి సూక్ష్మ వ్యవస్థ. ఇది ఒక్కొక్క దానిని, ఒక్కొక్క దానిని మనం అధ్యయనం చేస్తూ, దానిని చక్కగా విచారిస్తూ, చిత్తములో ఉన్నటువంటి వాసనా బలం, అహంలో ఉన్నటువంటి కర్తృత్వాభిమానం, భోక్తృత్వాభిమానం కలిసి పని చేసి, బుద్ధిని ‘బుద్ధి కర్మాను సారిణి’ అయ్యేటట్లుగా చేస్తుంది.
ఈ సూక్ష్మమైనటువంటి బుద్ధిని నడిపేటటువంటిది, అంత కంటే సూక్ష్మమైనటువంటి కర్మబలం, కర్మఫలం - అది త్రిగుణాత్మకమైనటువంటిది. కాబట్టి, చక్కగా మూడు గుణాలను విచారణ చేయ్. వాసనా త్రయాన్ని విచారణ చేయ్. శరీర త్రయాన్ని విచారణ చేయ్. దేహత్రయాన్ని విచారణ చేయ్. అవస్థా త్రయాన్ని విచారణ చేయ్. గుణ త్రయాన్ని విచారణ చేయ్. చక్కగా ఈ మూడు మూడుగా ఉన్నటువంటి కాలత్రయాన్ని విచారణ చేయ్.
ఈ రకంగా త్రివృత్ కరణము అంటారు. ఈ త్రివృత్‌కరణము అనేటటువంటిది బ్రహ్మవిద్య అనే పుస్తకములో విస్తారముగా చర్చించబడింది. కాబట్టి, ఈ త్రివృత్ కరణము చాలా ముఖ్యమైనటువంటిది. ఎన్ని, వీలైనన్ని త్రిపుటులని మనం బాగా అధ్యయనం చేయాలి. ధ్యానము, ధ్యాస, ధ్యేయము. జ్ఞానము జ్ఞాత జ్ఞేయము. ఇలా ప్రతీదీ త్రిపుటిలోనే ఉన్నది.
సమస్త సృష్టి కూడా, త్రిపుటి లోనే ఉంది. శక్తి త్రయము - ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. అట్లాగే, త్రిమూర్తులు - బ్రహ్మ, విష్ణువు, రుద్రులు. ఇలా ఆది దైవతంలో కూడా త్రిమూర్తులున్నారు. అలాగే తాపత్రయం. ఆధ్యాత్మికం, ఆదిదైవికం, ఆదిభౌతికం. ఈ రకంగా అనేక రకాలైనటువంటి ఋణత్రయం - దైవ ఋణం, ఋషి ఋణం(శాస్త్ర ఋణం), పిత్రు ఋణం.
ఈ రకంగా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి, ఒక్కొక్కటి చక్కగా విచారణ చేస్తూ, ఈ బుద్ధి బలాన్ని పెంచుకునేటటువంటి సమర్థతని మానవుడు పొందాలి. విచారణ బలం చేత మాత్రమే, మానవుడు బుద్ధి బలాన్ని పొందుతున్నాడు. మిగిలిన వన్నీ సహకార ధర్మములు. అంటే, ఏమిటి? ఏమండీ, ఎప్పుడు పొద్దున్నుంచి రాత్రి దాకా విచారణ ఒక్కటే చేస్తూ, ఆహారాన్ని వదిలేస్తే సరిపోతుందా? తప్పు నాయనా! ఒక సర్కస్‌లో సింహాన్ని లోబరచుకోవాలి.
మనలో ఉన్నటువంటి క్రూరమృగాన్ని లోబరచుకోవాలి. నాలో ఉన్నటువంటి సాధుమృగాన్ని లోబరచుకోవాలి. అర్థమైందా? అండీ! భయపడితేనేమో, సాధు జంతువు. భయపెడితేనేమో క్రూర జంతువు. వీళ్ళు ఇద్దరూ ఉన్నారు, మనలోపల. అన్నీ జంతువుల లక్షణాలని సమర్థవంతముగా కలిగిన వాడు మానవుడు ఒక్కడే కాబట్టి, అన్ని జంతువుల కంటే, రాజు వలె వ్యవహరించాలి.
కాబట్టి, ఆయా జ్ఞానములన్నీ నీకున్నాయి. ఆ సమర్థతలన్నీ నీకున్నాయ్. ఆయా బలహీనతలు కూడా నీకున్నాయ్. కాబట్టి, నువ్వు వాటిని చక్కగా వినియోగించుకోగలిగేటటువంటి బుద్ధి బలాన్ని సముపార్జించాలి. ఇది ఒకదానికంటే ఒకటి సూక్ష్మమైనటువంటిది. ఆ సూక్ష్మమైనటువంటి దానిని సూక్ష్మంగా పట్టుకోవాలి. స్థూలంగా పట్టుకుందామంటే జరిగేపని కాదు.
దీనికి ఉదాహరణ ఎలా చెబుతారు అంటే, బియ్యాన్ని బాగు చేయడం వుంది. సరాసరి ఒడ్లు తెచ్చి వండుకుంటామా? ఒడ్లు తెచ్చి వండుకోవడానికి పనికిరావు. పొలంలో ఒడ్లని తూర్పారపట్టాం, మొట్టమొదట. అక్కడంతా బాగుచేశాము. ఎంత బాగు చేసినా ఒడ్లల్లో ఇంకా మట్టి బెడ్డలు, రాళ్ళు అన్నీ ఉన్నాయి.
మళ్ళా తీసుకు వచ్చి జల్లించాము. జల్లించిన తరువాత వాటిని ఆరబోశాము. ఆరబోసిన తరువాత వాటిని మిల్లుకు పట్టించాము. మిల్లుకి పట్టించిన తరువాత కూడా వాటిల్లో ఇంకా మిగిలి ఉంది. మళ్ళా జల్లెడ పట్టాము. మళ్ళా జల్లెడ పట్టాక, మళ్ళా మిల్లుకు పట్టాము, మళ్ళా జల్లెడ పట్టాము. ఇట్లా మిల్లు పట్ట, జల్లెడ పట్ట ... ఈ రకంగా వాటిని బాగు చేయగా, బాగు చేయగా బియ్యం వచ్చినాయి.
బియ్యం వచ్చాక ఇంట్లో సరాసరి బియ్యాన్ని వండేస్తున్నామా? మళ్ళా వాటిని కడిగాం. కడిగిన తరువాత వాటిల్లో ఉన్నటువంటి మాలిన్యం అంతా పోయింది. ఇంకా ఏమైనా ఉన్నాయేమోనని గాలించాము. ఇసుక లాంటి పదార్థం ఏమైనా ఉందేమో తెలుసుకోవాలంటే, ఏం చేయాలి? గాలించాలి. బియ్యాన్ని గాలించాలి. గాలించకుండా వండేస్తే, అన్నం తినలేము.
ఈ రకంగా తినే అన్నానికే ఇంత జాగ్రత్త తీసుకుంటున్నామే, మరి అట్లాంటిది వివేకం గురించి, విజ్ఞానం గురించి, ఆత్మ గురించి, బ్రహ్మం గురించి, పరమాత్మ గురించి, ముక్తి గురించి, మోక్షం గురించి, మోహము నుండి బయట పడుట... ఈ బుద్ధికి కలిగినటువంటి ప్రత్యేకమైన బలహీనత ఏమిటంటే, ఎంత నిర్ణయం చేయగలిగేటటువంటి శక్తి దీంట్లో ఉందో, అంతగా మోహానికి లొంగేటటువంటి లక్షణం ఉంది దీంట్లో. దానికి బలమూ అదే, బలహీనత కూడా అదే!-. - విద్యా సాగర్ స్వామి
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/10/30/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
Blogs, Websites:
https://incarnation14.wordpress.com/2020/11/04/spiritual-blogs-websites/
07 Nov 2020
No comments:
Post a Comment