✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 57 🌻
ఈషణ త్రయాన్ని త్యజించాలనే టటువంటి గొప్ప సందేశాన్ని ఇందులో ఇస్తున్నారు. ధనేషణ, ధారేషణ, పుత్రేషణ - అనేటటువంటి ఈషణ త్రయాన్ని జయించాలి మానవుడు. సదా మనస్సు ఎప్పుడూ కూడా ఈ ఈషణ త్రయాలచేత ప్రేరేపించబడుతూ ఉంటుంది.
మా అబ్బాయి ఏం చేస్తున్నాడు? మా ఆవిడ ఏం చేస్తుందో, మా ఆయన ఏం చేస్తున్నాడో, మా ధనం అంతా ఏమైపోయిందో, నా ఇల్లు ఏమైపోయిందో, నా వస్తువులు ఏమైపోయినాయో, నా ఉద్యోగం ఏమైపోయిందో, నా సమస్యలు ఏమైపోయందో, నా వారంతా ఏమైపోయారో, నా బంధువులు ఏమైపోయారో, నా అనేటటువంటి వారంతా ఏం చేస్తున్నారో, నా స్నేహితులు ఏమైపోయారో, ఈ రకముగా రక్త సంబంధము ఉన్నవారు, రక్త సంబంధము లేని వారు, మనః సంబంధీకులు, ప్రాణ సంబంధీకులు, శరీర సంబంధీకులు.
ఈ రకంగా అనేక రకాల సంబంధాలతో తాదాత్మ్యత చెంది, ముడిపడి, పాత్రోచితమైనటువంటి మగ్నత చెంది, ఆయా పాత్రలే సత్యమనుకొని, ఆయా పాత్రల యొక్క వ్యవహారమే సత్యమనుకొని, ఆయా ఇంద్రియ వ్యవహారమే సత్యమనుకొని, వారి వారి యందు చరించుట చేత ఏర్పడేటటువంటి సౌఖ్యమునే సత్యముగా భావించి, అశాశ్వతమైన పద్ధతిగా జీవించేటటువంటి జీవభావంతో మానవులు జరామరణ చక్రంలోకి లాగబడుతున్నారు.
ఈ భోగము... భోగము అంటే సుఖదుఃఖముల రెండింటి యొక్క అనుభవము భోగమే. కాబట్టి, ఆ యా సుఖదుఃఖ ద్వంద్వానుభూతి యందు సుఖం లేకపోతే దుఃఖానికి విలువ లేదు, దుఃఖం లేకపోతే సుఖానికి విలువలేదు. కాబట్టి, ఆ యా సంవేదనలు మనఃపూర్వక సంవేదనలు ఇవి. అటువంటి సంవేదనల యందు మనస్సును లగ్నం చేసి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనేటటువంటి దాహము కలిగించేటటువంటి ఈషణత్రయం.
దాహము బాగా పెరిగితే వాటి యందు చింత కలుగుతుంది. ఎంతగా దాహం పెరిగితే, ఇంకా అనుభవించాలనే టటువంటి భావన బలంగా బలపడిపోయి, ఆక్రమించుకునేటటువంటి అంతర్యామిత్వం, అంతరంగ లక్షణాన్ని కలిగినటువంటి వారందరూ, ఆయా అనుభూతుల యందు ఇంకా ప్రపంచాన్ని అలా చూడాలి, ఇంకా ప్రపంచాన్ని ఇలా చూడాలి, ఇంకా అనేక సంబంధాలని ఇలా అనుభవించాలి, ఇంకా అనేక మందిని దర్శించాలి, ఇంకా అనేకమందితో బాంధవ్యాన్ని పెంచుకోవాలి, అనంతంగా విశ్వవ్యాపకంగా 750 కోట్ల మంది మానవులలో నేను గొప్పవాడిని, నేను ప్రతిభాశీలిని అనేటటువంటి గుర్తింపును పొందాలి.
ఈ రకంగా ప్రతి ఒక్క చోట, ఆ యా అభిమానమును బలపరిచేటటువంటి శరీరాభిమానమును, దేహాభిమానమును బలపరచుకుని ప్రత్యగాత్మకు దూరంగా, స్వాత్మస్థితికి దూరంగా చరించేటటువంటి లక్షణమే బంధము. ఎవరైతే స్వాత్మ నిగ్రహం, స్వాత్మ అనుగ్రహం, స్వాత్మ సాక్షాత్కారం, స్వాత్మానుభూతి, ఆత్మనిష్ఠ దీనిని సాధించినటువంటి వారు ఉంటారో, వారందరూ వివేకులు.
ఎవరైతే నాశరహితమైనటువంటి, పరిణామ రహితమైనటువంటి, శాశ్వతమైనటువంటి, మోక్షదాయక మైనటువంటి, జనన మరణ మృత్యురూప సంసారము నుంచి బయట పడవేయ గలిగినటువంటి ఈ ఆత్మదర్శనాన్ని, ఈ ఆత్మోపదేశాన్ని, ఈ ఆత్మవిచారణని, ఈ ఆత్మభావాన్ని, ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని, ఈ ఆత్మానుభూతిని, ఈ ఆత్మనిష్ఠని ఆశ్రయిస్తారో, వారు శాశ్వతమైనటువంటి, ధృవమైనటువంటి, తరగుట, పెరగుట లేనటువంటి, పరిణామ రహితమైనటువంటి, ద్వంద్వానుభూతికి అవకాశమే లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు.
ఎప్పుడైతే నీకంటే అన్యము తోచిందో, ఆ అన్యమైనటువంటి వారు ధనము చేతగానీ, ధారేషణ అంటే భార్య, బిడ్డల చేతగానీ, పుత్రేషణ చేతగానీ, ఈషణాత్రయము చేత సంబంధపడుతున్నటువంటివారై ఉంటారు.
కాబట్టి, ఆ ఈషణాత్రయ సంబంధము నందు మనోవ్యాపారమును లగ్నము చేయుట అవివేకము, అజ్ఞానము, అవిద్య, అధ్వాన్నము. కాబట్టి, అటువంటి సంగత్యాగాన్ని చేయవలసినదిగా కోరుతున్నారు. సర్వసాక్షిత్వాన్ని ఆశ్రయించవలసినదిగా చెబుతున్నారు. ఉపదేశిస్తున్నారు.
అటువంటి సర్వాధారమైనటువంటి, సర్వసాక్షి అయినటువంటి, సర్వవ్యాపకమైనటువంటి, సర్వవిలక్షణమైనటువంటి ఆత్మ స్వరూపాన్ని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో, వాళ్ళు వివేకం పొందినటువంటి వారు. - విద్యా సాగర్ గారు
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
10 Dec 2020
No comments:
Post a Comment