శ్రీ శివ మహా పురాణము - 293
🌹 . శ్రీ శివ మహా పురాణము - 293 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
71. అధ్యాయము - 26
🌻. దక్షుని విరోధము - 1 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
పూర్వము ప్రయాగలో మహాత్ములగు మహర్షులందరు ఒక్కచోట గూడి, యథావిధిగా యజ్ఞమును చేసిరి (1)అచటకు సిద్ధులు, సనకాది దేవర్షులు, ప్రజాపతులు, దేవతలు, జ్ఞానులు, బ్రహ్మసాక్షాత్కార సంపన్నులు విచ్చేసిరి (2). నేనచటకు పరివార సమేతముగా వచ్చితిని. వేద శాస్త్రములు దివ్యకాంతులీను మూర్తులను ధరించి నాతో కలిసి వచ్చినవి (3). ఉత్సవములో పాల్గొను వారందరితో కూడిన ఆ కలయిక చాల విచిత్రమైనది. అచట అనేక శాస్త్ర విషయములలో జ్ఞానులగు పండితుల చర్చలు జరిగినవి (4).
ఓ మహర్షీ! ముల్లోకములకు హితమును గూర్చు స్వామి, జగత్కారణుడనగు రుద్ర ప్రభువు భవానితో, ప్రమథ గణములతో గూడి అచటకు ఆ సమయములో విచ్చేసెను (5). శివుని చూచి సర్వదేవతలు, సిద్ధులు, మునులు, మరియు నేను ఆ ప్రభువునకు నమస్కరించి భక్తితో స్తుతించితిమి (6).
అందరు ఆనందముతో నిండిన వారై శివుని యాజ్ఞచే తమ తమ స్థానములలో ఉపవిష్టులైరి. ప్రభువు దర్శనముచే సంతసించి, వారు తమ భాగ్యమును కొనియాడిరి (7). ఆ సమయములో ప్రజాపతులలో ముఖ్యుడు, ఆనందముతో నున్నవాడు, గొప్ప తేజశ్శాలి యగు దక్షప్రభువు అనుకోకుండగా అచటకు వచ్చెను (8).
ఆ దక్షుడు నాకు నమస్కరించి నా ఆజ్ఞచే అచట గూర్చుండెను. ఆతడు తానే బ్రహ్మాండమునకు అధిపతిని యను గర్వముతో నుండెను. ఆతడు తత్త్వమును దర్శించలేని బహిర్ముఖుడు (9). దేవతలు, ఋషులు అందరు వినయముతో చేతులు జోడించి, గొప్ప తేజశ్శాలి యగు దక్షుని స్తుతులతో, నమస్కారములతో పూజించిరి (10).
అనేక తీరుల విహరించు ప్రభువు, స్వతంత్రుడు, అద్భుతలీలలను ప్రకటించువాడు మహేశ్వరుడు తన ఆసనమునందున్న వాడై, అతి శయించిన గర్వముతో నున్నదక్షుని అపుడు చూచెను (11). నా కుమారుడగు దక్ష ప్రజాపతి అచట అనంతుడగు శివుని జూచి, అప్రసన్నమగు మనస్సు గలవాడు అయెను. అతడు వెనువెంటనే రుద్రునియందు క్రోధమును పొందెను (12)
మహాగర్విష్ఠి, అజ్ఞాని యగు ఆతడు గొప్ప తేజశ్శాలి యగు రుద్రుని క్రూర దృష్టితో చూచి, అందరు వినునట్లు బిగ్గరగా నిట్లు పలికెను (13). ఈ దేవతలు, రాక్షసులు, బ్రాహ్మణ శ్రేష్ఠులగు ఈ ఋషులు అందరు నన్ను నమస్కరించుచున్నారు. ప్రేత పిశాచములతో చుట్టు వారబడియుండే ఈ రుద్రుడు దుర్జనుని వలె నమస్కారమును చేయని గర్విష్ఠి ఎట్లు అయినాడు?(14).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
10 Dec 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment