✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀 26 - 8 . ప్రాణాయామ యజ్ఞము - ప్రాణవాయువు, అపాన వాయువు ఈ రెండింటి సామ్యమే సమాన వాయువు. ఈ సామ్యము చెందినపుడు, శ్వాస, మనసు కరగి సమాన ప్రాణ స్పందనము నిలచును. అపుడు బహిర్ముఖమగు మనసు అంతర్ముఖమై నిలచును. సాధకునకు తాను స్పందనాత్మక చైతన్యమని తెలియును. బాహ్య ప్రనుండి అంతర్ ప్రజ్ఞ మేల్కొనును. 🍀
📚. 4. జ్ఞానయోగము - 29, 30 📚
Part 8
పంచప్రాణములు దేహమున ఈ క్రింది భాగములలో పనిచేయుచున్నవి.
🌷 3. సమాన వాయువు: 🌷
ఉదర వితానమునకు పై భాగమున కనుబొమల వరకు ప్రాణవాయువు పనిచేయు చున్నదని తెలుపబడినది. ఉదర వితానము నుండి క్రింది భాగమంతయు అపాన వాయువు పని చేయు చున్నదని తెలుపబడినది. ఈ రెండింటి సామ్యమే సమాన వాయువు.
అంతియే కాదు- ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన ప్రాణముల సామ్యము కూడ సమాన వాయువే. ప్రాణము, అపానము, సమానము కేంద్రముగ నిర్వర్తింప బడుచున్నవి. ప్రాణాపానములు పరస్పర విరుద్ధమగు శక్తులు. కావున రెండు విధములగు ప్రయోజనములు అవి దేహమున
నిర్వర్తించుచున్నవి.
ఈ వైరుధ్యము శత్రుత్వము కాదు, మిత్రత్వమే. ఒకటి బాగుండిన రెండవది బాగుండును. ఒకదాని నొకటి బలపరచుకొనును. ఒకటి బలహీనపడిన రెండవది కూడ బలహీనపడును.
బాగుగ శ్వాస పీల్చినచో బాగుగ వదల వచ్చును. అట్లే బాగుగ వదలినచో బాగుగ పీల్చవచ్చును. ఈ రెంటిని సామ్యపరచుటనే ఒకదాని యందొకటి హోమము చేయుటగ భగవద్గీతా శ్లోకములు (29, 30) తెలుపుచున్నవి.
ముందు తెలిపిన ప్రాణా యామ యజ్ఞము ద్వారా ఈ రెండును సమాన వాయువు నందు సామ్యము చెందినపుడు, శ్వాస, మనసు కరగి సమాన ప్రాణ స్పందనము నిలచును. అపుడు బహిర్ముఖమగు మనసు అంతర్ముఖమై నిలచును. సాధకునకు తాను స్పందనాత్మక చైతన్యమని తెలియును. బాహ్య ప్రనుండి అంతర్ ప్రజ్ఞ మేల్కొనును.
అంతర్ముఖుడైన జీవునకు బాహ్యమున తనకు గల స్థితి గతులన్నియు తాత్కాలికమే అని తెలియును. తాను హంస స్వరూపుడ నని తెలిసి ద్వయాక్షరి యగు ' సోహం' అను స్పందనముగా తెలియును. ఈ విషయము ముందు పాఠములలో తెలుప బడినది.
అంతర్ముఖుడుగ మేల్కాంచిన జీవునకు బహిర్ముఖముగ తన అస్థిత్వమంతయు తాత్కాలికమే అని ధృవపడి శాశ్వతమగు అస్థిత్వమునకు ప్రయత్నము ఆరంభమగును. ఇది నిజమగు పుట్టుక.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
10 Dec 2020
No comments:
Post a Comment