🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. విశ్వామిత్రమహర్షి - 3 🌻
13. లోకానుగ్రహం కోసం యాగంకాని, లేకపోతే బ్రహ్మర్షికి యాగం ఏమిటి? ఎందుకు చేస్తాడు? ఈ యజ్ఞాలు జ్ఞానమా? యజ్ఞం జ్ఞానం కాదు. కర్మకు అజ్ఞానానికి ముడి. యజ్ఞ కర్మంతా కూడా జ్ఞానదాయకం అనుకోరాదు. లోకంలో కొన్నికొన్ని కోరికలు నెరవేర్చుకోవడానికి, కొన్ని దుష్టశక్తుల నాశనం కోసమని యజ్ఞం చేయబడుతుంది.
14. యజ్ఞాన్ని లౌకికంగా, భూలోకంలో మనకు యోగక్షేమాలు కోరి చేయవలసిందే తప్ప, దానివలన జ్ఞానం రాదు. ఇకాడ ఒక రహస్యం కూడా ఉంది. యజ్ఞం పదిమందితో సాధ్యమయ్యే సామూహిక కర్మ. అందువల్ల ఎవరికీ అది జ్ఞానప్రదం కాదు.
15. కాని తపస్సు వ్యక్తిది. అది వ్యక్తికి అనంతశక్తిని, ముక్తిని కూడా ఇవ్వగలదు. మరి విశ్వామిత్రుడు జ్ఞానకర్మ కాని కర్మను ఎందుకు చేస్తాడు అంటే, లోకక్షేమం కోసమనే చేసాడాయన. లోకక్షేమం కోసమని విష్ణువును తీసుకొచ్చి తన తపస్సు, అస్తబలం ఆయన కిచ్చాడు. ఆయన సన్నిఢిలో యజ్ఞం చేసాడు. రాక్షససంహారానికి హేతువయ్యాడు. అంతటి మహాత్ముడు. విశ్వానికి మిత్రుడాయన.
16. తపస్సంపన్నులు చేసే ప్రతి పనికి ఒక కార్యకారణ సంబంధం ఉండాలి కాని, అకారణంగా తపస్సులోంచి ఏ వస్తువునూ సృష్టించకూడదు. జ్ఞాని ఆ పనిని ఎన్నడూ చెయ్యడు. ఒక కారణం ఉండాలి. కారణంలోచి కార్యం పుట్టాలి.
17. ఆశీర్వచనం అనేది అనేక రకాలుగా ఉంటుంది. కోరిక కోసమని ఒకడడుగుతాడు. అతడికి పుణ్యం ఉండదు, తపస్సు ధార పోయవలసిన అవసరం వస్తుంది. సంకల్పబలం అనేది ఒకటుంది. తపస్సుతో సంబంధం లేనటువంటి అమోఘమయిన సంకల్పం.
18. బ్రహ్మ తపస్సు ధారపోసి సృష్టించటం లేదు. సంకల్ప బలం చేత సృష్టిస్తున్నాడు. సంకల్పంలోంచి సమస్తమూ, భూతములన్నీ పుడుతున్నాయి. బ్రహ్మకెటువంటి శక్తి ఉన్నదో బ్రహ్మజ్ఞానికి ఆ సంకల్పమందు ఆ శక్తి ఉంటుంది. అది అతని వాక్కు.
19. ఎందుచేతనంటే, సత్యభావనయందే ఉండటేంచేత భావన సత్యమవుతుంది. తపస్సుతో నిమిత్తంలేదు. తపస్సు దేహంతో, మనస్సుతో, ఇంద్రియములతో, చిత్తంతో ఆచరించబడి, లభించే ఒక శక్తి. ఒక ధనం అది. తపస్సుని వ్యయం చెయ్యకుండా సత్యసంకల్పులు సంకల్ప బలం మాత్రంచేత ఏది భావన చేసినా అది సత్యమవుతుంది.
20. అంటే ఎప్పుడూ సత్యం చెప్పగా, తరువాత చెప్పింది సత్యమవటం మొదలవుతుంది. ఇది సత్యంయొక్క శక్తి. ఎన్నడూ అనృతం లేకుండా త్రికరణశుద్ధిగా ఎవరైతే సత్యం చెప్పుతూ ఉంటాడో, సత్యధర్మదీక్ష ఎవరికైతే ఉంటుందో అతడు ఏది చెప్పినా సత్యమవుతుంది.
21. ఏది చెప్పినా సత్యంకావటానికి తపస్సు కారణంకాదు. సత్యధర్మమే, సత్య వ్రతమే కారణం. ఇది తపోధనం కాదు. అతడి యందు పుట్టినటువంటి ఒక విభూతి, ఒక లక్షణం, ఐశ్వర్యం. అది అతడి హృదయమందు పుట్టిన, అతడి మనస్సుయందు పుట్టిన ఒక ఐశ్వర్యం కాబట్టి, సత్యానికి అంత శక్తి ఉంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
15 Dec 2020
No comments:
Post a Comment