శ్రీ శివ మహా పురాణము - 296
🌹 . శ్రీ శివ మహా పురాణము - 296 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
71. అధ్యాయము - 26
🌻. దక్షుని విరోధము - 4 🌻
సదాశివుడిట్లు పలికెను -
నందీ! మహాప్రాజ్ఞా! నా మాటను వినుము. నీవు కోపమును పొందుట తగదు. నేను శపింపబడితినని నీవు భ్రమపడి బ్రాహ్మణులను వృథాగా శపించితివి (43). వేదములు మంత్రాక్షరములతో, సూక్తములతో నిండియుండును. సర్వప్రాణులు ఆత్మ సూక్తము నందు ప్రతిష్ఠితమై యుండును (44).
కావున ఆత్మ ప్రతిపాదకమగు వేదమును పఠించు విద్వాంసులను నీవు కోపావిష్టుడవై ఏనాడూ శపించవలదు. ఎవరైననూ ఎంతటి మానసిక క్షోభకలిగిననూ ఎప్పుడైననూ వేదములను శపించరాదు (45). నేనిపుడు శాపమును పొందలేదు. నీవు తత్త్వమును ఎరుంగుము. సనకాది మహాత్ములకు జ్ఞానమును బోధించిన మహాధీశాలివి. నీవు. శాంతుడవు కమ్ము (46).
యజ్ఞము నేనే. యజ్ఞమును చేయు యజమానిని నేనే. యజ్ఞములోని అంగములన్నియూ నేనే. యజ్ఞము నా స్వరూపమే. నాకు యజ్ఞమునందు అభిరుచి మెండు. పైగా, యజ్ఞ బాహ్యుడను కూడ నేనే (47). నీవెవరివి? వీరెవరు?ఇతడెవరు? తత్త్వ దృష్ట్యా సర్వము నేనే. ఈ సత్యము నెరింగి విమర్శించినచో, నీవు బ్రాహ్మణులను శపించుట వ్యర్థమే గదా? (48) ఓ నందీ! నీవు మహా బుద్ధిశాలివి. నీవు క్రోధాదులను వీడి, తత్త్వజ్ఞానముచే ప్రపంచ రచనను బాధించి (మిథ్యయని యెరింగి,), జ్ఞానివై స్వస్వరూపమునందు ప్రతిష్ఠతుడవు కమ్ము (49).
బ్రహ్మ ఇట్లు పలికెను -
శంభుడు ఈ విధముగా నందికేశ్వరునకు బోధించగా, ఆతడు వివేక నిష్ఠుడై, క్రోధమును వీడి శాంతుడాయెను (50). శివుడు ఆతనికి , తన గణములకు నచ్చజెప్పెను. శివునకు నంది ప్రాణప్రియుడు. ఆయన ఆనందముతో, తన గణములతో గూడి తన ధామకు వెళ్లెను (51). క్రోధావేశము గల దక్షుడు శివద్రోహమే లక్ష్యము గా గలవాడై, ఆ బ్రాహ్మణులతో కలిసి తన స్థానమునకు వెళ్లెను (52). తాను రుద్రుని శపించిన ఘట్టమును గుర్తుచేసుకొని మిక్కిలి కోపమును చెందుచున్న మూడ బుద్ధియగు ఆ దక్షుడు శ్రద్ధను వీడి శివపూజకులను నిందించుటయే తన ధ్యేయముగా పెట్టుకొనెను (53).
దుర్బుద్ధియగు దక్షుడు శంభు పరమాత్మయొక్క ఆ మాటలను వినెను. అయిననూ వాని బుద్ధి ఎంత దుష్టమో గదా! వత్సా! నేనా వృత్తాంతమును చెప్పెదను వినుము.
శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్రసంహితయందు రెండవదియగు సతీ ఖండములో శివుని తో దక్షుని విరోధమనే ఇరువది ఆరవ అధ్యాయము ముగిసినది (26).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
15 Dec 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment