గీతోపనిషత్తు -162
🌹. గీతోపనిషత్తు -162 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 8
🍀 8 - 4. యోగ కారకములు - 3. విజితేంద్రియః : ఇంద్రియములను బాగుగ నియమించ గలుగువాడు మరియు నిగ్రహానుగ్రహము కలవాడు మాత్రమే యోగి కాగలడని భగవానుడు పలుకుచున్నాడు. నిత్య జీవితమును జ్ఞాన మాధారముగ నిర్వర్తించుటకు పూర్ణ ప్రయత్నము గావింపవలెను. ఇంద్రియములు క్రమముగ వశమగునే కాని, వాటిని వశము చేసుకొనుటకు తీవ్రమగు దీక్షలు పట్టరాదు. ఇట్టి కార్యములకు బలము జ్ఞానము నుండి లభించును. 🍀
జ్ఞానవిజ్ఞాన తృప్తాత్మా కూటస్థా విజితేంద్రియః |
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మ కాంచనః || 8
3. విజితేంద్రియః :
ఇంద్రియములను బాగుగ నియమించ గలుగువాడు మరియు నిగ్రహానుగ్రహము కలవాడు మాత్రమే యోగి కాగలడని భగవానుడు పలుకుచున్నాడు. యోగసాధకునకు ఇంద్రియములు సహకరించుటయే గాని, ఇంద్రియములకు లోబడుట జరుగదు.
ఇంద్రియార్థముల వైపు పరుగిడు మనసు జ్ఞాన విజ్ఞానముల ద్వారా వివేకమును, వైరాగ్యమును పొంది ఇంద్రియముల నధిగమించగలదు.
సాధకుడు క్రమపద్ధతిన యోగా
భ్యాసము చేయువాడైనచో, జ్ఞానమును ఆచరణమున పెట్టుటకు మొదట ప్రయత్నము చేయును.
దానివలన వివేక వైరాగ్యములు కలుగవలెను. అట్లు కలుగనంత వరకు ఇంద్రియములే జయించు చుండును. అట్లు జరిగినపుడెల్ల నిరుత్సాహపడక పునః ప్రయత్నము గావించు చుండవలెను.
నిత్య జీవితమును జ్ఞాన మాధారముగ నిర్వర్తించుటకు పూర్ణ ప్రయత్నము గావింపవలెను. ఇంద్రియములు క్రమముగ వశమగునే కాని, వాటిని వశము చేసుకొనుటకు తీవ్రమగు దీక్షలు పట్టరాదు. స్నేహమున లొంగినట్లు ఇతర మార్గము లలో ఇంద్రియములు లొంగవు.
దమించుట యోగమార్గమున నిషిద్ధము. ప్రేమతో, లాలనతో పిల్లలను ఉన్ముఖము చేసుకొనునట్లు, ఇంద్రియములను బాధించక స్నేహపూర్వకముగ నియమములోనికి తెచ్చుకొనవలెను. ఇట్టి కార్యములకు బలము జ్ఞానము నుండి లభించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
02 Mar 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment