శ్రీ శివ మహా పురాణము - 362


🌹 . శ్రీ శివ మహా పురాణము - 362 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

94. అధ్యాయము - 06

🌻. పార్వతి పుట్టుట - 2 🌻



దేవతలిట్లు పలికిరి -

ఓ దుర్గా! నీకు జయము జయము. ఓ మహేశ్వరీ!నీవు జ్ఞానఘనవు, జగన్మాతవు. సత్యము నందు నీవు దృఢముగా ప్రతిష్ఠితవై సద్రూపవై ఉన్నావు. సత్యమే నీ స్వరూపము గనుక, నీవు త్రికాలములయందు సత్స్వరూపిణివి (19). నీవు సత్యమునందుండి సత్యము నుండి అవతరించి సత్యముచే సుప్రీతురాలగుదువు. వ్యావహారిక సత్యమగు జగత్తునకు అధిష్ఠాన సత్యము నీవే. నీది సత్యదర్శనము. నిన్ను మేము శరణు పొందుచున్నాము (20).

హే శివప్రియే!మహేశ్వరీ! నీవు దేవతల దుఃఖమును హరించెదవు. ముల్లోకములకు తల్లివి, శర్వుని పత్నివి అగు నీవు సర్వమును వ్యాపించియున్నావు. నీకు భక్తులయందు ప్రేమ మెండు (21). ఓ త్రిలోకములకు అధీశ్వరి యగు మహేశ్వరీ! నీవు అవతరించి దేవకార్యమును చేయుము. నీ దయచే మేము అందరము నాథవంతులమైతిమి (22).

ఉత్తమ సుఖములను పొందు వారందరూ ఆ సుఖములను నీనుండియే పొందుచున్నారు. ముల్లోకములలో నీవు లేనిదే ఏదియూ శోభించ జాలదు (23).


బ్రహ్మ ఇట్లు పలికెను -

దేవతలు ఈ తీరున గర్భమునందున్న మహేశ్వరిని పరి పరి విధముల స్తుతించి, ప్రసన్నమగు మనస్సు గలవారై, అపుడు తమ తమ ధామములకు వెళ్లిరి (24). తొమ్మిది మాసములు గడచి పదియవ మాసము పూర్తియగు నంతవరకు, జగన్మాతయగు కాళీదేవి గర్భస్థురాలై ఉండెను (25).

అపుడు ఒకనొక శుభముహూర్తమునందు, నక్షత్రములు గ్రహములు శాంతములై యుండగా, ఆకాశము ప్రసన్నమై దిక్కులన్నియు ప్రకాశించుచుండగా (26),వనములతో గ్రామములతో సముద్రములతో కూడిన భూమి మంగళములతో నిండియుండెను. సరస్సులలో, నదులలో, దిగుడు బావులలో పద్మములు వికసించియుండెను (27).

ఓ మహర్షీ! సుఖమగు స్పర్శ కలిగిన గాలులు అన్ని దిక్కుల యందు వీచినవి. సత్పురుషులందరు ఆనందించిరి. దుష్టులు శీఘ్రమే దుఃఖితులైరి (28). దేవతలు అంతరిక్షములోనికి దుందుభలను వాయించిరి. అపుడచట పుష్పవృష్టి కురిసెను. గంధర్వ శ్రేష్ఠులు గానమును చేసిరి (29). ఆకాశమునందు విద్యాధరస్త్రీలు, అప్సరసలు కూడ నాట్యమును చేసిరి. అపుడు దేవతలు మొదలగువారు అంతరిక్షములో గొప్ప ఉత్సవమును చేసుకొనిరి (30).

ఆ సమయములో పూర్వము సతీ రూపముగా అవతరించిన శివశక్తి స్వీయరూపముతో మేన యెదుట సాక్షాత్కరించెను (31). వసంత ఋతువులో చైత్రమాసములో నవమీ తిథినాడు మృగశిరా నక్షత్రమునందు అర్ధరాత్రి సమయమునందు చంద్రమండలము నుండి ఆకాశగంగవలె ఆ దేవి జన్మించెను (32).

ఆ సమయములో ఆ స్వరూపముతో ఉమాదేవి మేన యొక్క గర్భము నుండి, సముద్రము నుండి లక్ష్మీదేవి వలె జన్మించెను (33). అపుడామె జన్మించగానే జగత్తు ప్రసన్నమాయెను. అనుకూలము, శుభగంధముతో గూడినది అగు వాయువు మెల్లగా వీచెను (34).

జలవర్షముతో బాటు పుష్పవర్షము కూడ కురిసెను. అగ్నులు ప్రశాంతముగా ప్రజ్వరిల్లినవి. మేఘములు గర్జించెను (35). ఆమె జన్మించిన ఆ సమయములో హిమవంతుని రాజధాని యందు సర్వము సుసంపన్నమగుటయే గాక, సర్వదుఃఖములు క్షయమయ్యెను (36).

ఆ సమయములో విష్ణువు మొదలగు దేవతలందరు అచటకు వచ్చి ఆనందించి ప్రీతితో జగన్మాతను దర్శించిరి (37). జగన్మాత, శివునకు ప్రియురాలు, దివ్యమగు రూపము గలది, మహామాయ, శివలోకమునందు నివసించునది, శుభకరి అగు ఆ కాళికను వారు స్తుతించిరి (38).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


02 Mar 2021

No comments:

Post a Comment