🌹 . శ్రీ శివ మహా పురాణము - 493 🌹


*🌹 . శ్రీ శివ మహా పురాణము - 493 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 39

*🌻. శివుని యాత్ర - 3 🌻*

ఓ మునీ! ఆ సమయములో అచటకు విచ్చేసిన విష్ణువు మొదలగు దేవతలు అందరు శంభుని వివాహయాత్రను సంపన్నము చేయుటకై అచటనే నివసించి యుండిరి (34). అపుడు శివునిచే ఆజ్ఞాపించబడిన వారందరు శివకార్యము నంతనూ స్వీయకార్యముగా భావించి శివుని సేవించిరి (35).

కైలాసమునందు సప్తమాతృకలు శివునికి చక్కని యథోచితమైన అలంకార విధిని ఆనందముతో చేసిరి (36). ఓ మహర్షీ! పరమేశ్వరుడగు ఆ శివప్రభుని ఇచ్ఛచే ఆయన యొక్క సహజవేషము అలంకార విధిగా మారిపోయెను (37). చంద్రుడు కిరీటముగా రూపు దిద్దుకొనెను. సుందరమగు మూడవ కన్ను శుభతిలకముగా మారిపోయెను (38). ఓ మునీ! రెండు సర్పములు అనేక రత్నములతో గూడిన కర్ణకుండలములుగా రూపు దాల్చెను (39). 

ఇతరావయవముల యందుండే సర్పములు ఆయా అంగములకు మిక్కిలి రమ్యములు, అనేక రత్నములు పొదగబడినవి అగు ఆభరణములుగా రూపు దిద్దుకొనెను (40). విభూతి గంధాదులతో గూడిన అంగవిలేపనమాయెను. గజచర్మము దివ్యము, సుందరము అగు పట్టు వస్త్రమాయెను (41). 

ఆయన ఇట్టి వర్ణింప శక్యము గాని సుందర రూపమును పొందెను. ఈశ్వరుడే స్వయముగా ఐశ్వర్యమును పొందెను (42). అపుడు దేవతలు, రాక్షసులు, యక్షులు, నాగులు, పతంగములు, అప్సరసలు, మహర్షులు అందరు మహోత్సాహముతో శివుని సన్నిధికి వచ్చి, ఆనంద భరితులై ఆశ్చర్యముతో గూడిన వారై ఇట్లనిరి (43).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

No comments:

Post a Comment