🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 137 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. మానవజన్మము - విశిష్టత 🌻
జీవరాశులన్నింటిలోను తనది ఉత్తమ జన్మ అని మానవుడు భావిస్తూ ఉంటాడు. కారణమేమంటే వృక్షములను, జంతువులను కూడ తన అదుపులో పెట్టుకొని తనకు అనుకూలమైన విధంగా ఉపయోగించుకొనే మేధాశక్తి తనకున్నది. దీని వలన అన్ని జీవరాశులను తన వశంలో పెట్టుకోగలడు మానవుడు.
డార్విన్ మొదలైన శాస్ర్తజ్ఞులు కూడ మానవజన్మనే సర్వోత్తమమైనదిగా అభివర్ణించారు. కాని సనాతన ధర్మప్రవర్తకులైన ఋషులు మాత్రం మానవజన్మ అన్ని జీవులలోను దుర్లభమైనదని, అది చక్కని అవకాశమని చెప్పారు.
మొదట మానవజన్మ మనకెందుకు కలిగిందనే విషయాన్ని అవగతం చేసుకోవాలి.
కేవలం అన్నపానీయాదులు స్వీకరించడం, నిద్రించడం, స్ర్తీ పురుష సంయోగం ఇంతమాత్రమే అయితే జంతు జన్మకి మానవజన్మకి భేదమే లేదు. ఇన్ని లక్షల జీవరాశుల జన్మలు గడచి మానవ జన్మలోకి ప్రవేశించిన తరువాత తన జన్మకు ప్రత్యేక లక్ష్యమేది? దీనిని గుర్తించడం మానవుని మొదటి కర్తవ్యం.
ఈ శరీరం, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి మొదలైన ఉపకరణాలు మనకి ఇవ్వబడినవని తెలుసుకోవాలి.
వీటిని సద్వనియోగపరచి ఇతర జీవుల యందు తనకు గల కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించడం మానవుని ప్రధాన లక్ష్యం. కేవలం తన మేధాశక్తిని మాత్రమే ఆశ్రయించి తద్వారా ఇతర జీవులను తన వశంలో పెట్టుకునే ప్రయత్నం రాక్షసత్వమే అవుతుంది.
మానవ జన్మము చక్కని శిక్షణ శిబిరము. మొదట తన కుటుంబ సభ్యులతో మొదలై క్రమంగా వ్యాప్తి చెంది సామాజిక జీవనంలోకి ప్రవేశించి అనేక సన్నివేశముల రూపంలో ప్రకృతి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకుంటాడు మానవుడు.
అటుపైన తన కోసం తాను జీవించడమే కాకుండా లోకహితం కోరి పని చేయడం మొదలుపెట్టాలి. అప్పుడే వ్యక్తిగతమనే బంధం నుంచి విముక్తుడవుతాడు.
అప్పుడు అప్రయత్నంగానే లోకహితం కోసం పనిచేయగలిగే సామర్థ్యం ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాగ అయినప్పుడే మానవుడు ఉత్తమ మానవుడుగా ఆవర్భవిస్తాడు....
...✍ మాస్టర్ ఇ.కె.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె
26 Aug 2020
No comments:
Post a Comment