కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 36



🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 36 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


ఇక్కడ దీనికొక ఉదాహరణ చెప్తా. తల్లి పిల్లవాడికి ఆహారాన్ని అలవాటు చేసే విధానాన్ని మనం గనక చూస్తే మొట్టమొదట పిల్లవాడు ఆ పాలు తాగే దశ నుంచి ఘనమైన ఆహారం తినే దశకి మారలేడనమాట. ఎందుకంటే సులభంగా ఆహారాన్ని గ్రహించడం దగ్గరి నుండి కొద్దిగా కష్టపడుతూ ఆహారాన్ని గ్రహించేటటువంటి పద్ధతికి మారాలనమాట. జీవుడికి మొదటి నుంచీ ఈ దురభ్యాసం వుంటుందనమాట. కష్టమంటే చాలు వెనక్కి పారిపోతూ వుంటాడు. అన్నం తినడమైనా సరే అంతే.

కాబట్టి చాలామంది పెద్దవాళ్ళు అయిన తరువాత కూడా ఇంకా చాక్లేట్లు తింటూనే వుంటారు. కారణం ఏమిటంటే అవి సులభంగా తినొచ్చు కాబట్టి. కొద్దిగా కష్టతరమైన ఆహారాన్ని తినాల్సిన అగత్యం వచ్చినప్పుడు వెనుకంజవేస్తూ వుంటారనమాట. కష్టపడాలంటే జీవుడికి విముఖత కలుగుతుందనమాట.

తల్లి ఏం చేస్తుందంటే, మొట్టమొదట తాను తినునట్లు నటిస్తుంది. బాగున్నట్లుగా కూడా భావ వ్యక్తీకరణ చేస్తుంది. ఆ భావ వ్యక్తీకరణని పిల్లవాడు అందుకుంటాడు. ఎందుకంటే పిల్లవాడికి అప్పటికి భాషరాదు. ఆరునెలల వయసు దాటేటప్పటికి ఘనాహారం పెట్టాలి.

మరి ఘనాహారం పెట్టేటప్పుడు అది బావుంది అని ఆ పిల్లవాడికి అర్ధమయేటట్లు చెప్పాలి. మరి ఎట్లా చెప్తుంది అంటే భావవ్యక్తీకరణ ద్వారా, అనుభూతిని వ్యక్తీకరించడం ద్వారా అవసరం అయితే తాను తిని చూపిస్తుంది. తద్వారా.. ఓహో! వాడికి తెలుస్తుందనమాట - ఇది తినే వస్తువే అనేటటువంటి అర్ధం తెలుస్తుంది.

అట్లా ఒకటి రెండు మూడు నాలుగు అయిదు వస్తువులను పెంచుకుంటూ పోతుంది. ఆహారపదార్ధాలను మార్చుకుంటూ పోతుంది. ఆహార పదార్ధాలను మార్చినప్పుడల్లా ఈ సమస్య వస్తుంది. వాటిల్లో కొన్నిటికి అతను ఒప్పుకుంటాడు, కొన్నిటికి ఒప్పుకోడు.

కారణం ఏమిటీ అంటే స్వభావరీత్యా అతనికి కొన్ని రుచుల యెడల కలిగినటువంటి వైముఖ్యత, విముఖత. తత్ ప్రభావం చేత కొంతమంది పాలన్నం తింటారు. కొంతమంది మజ్జిగన్నం తింటారు. కొంతమంది ఆ రెండూ తినరు. కొంతమంది కేవలం పప్పన్నం మాత్రమే తింటారు. కొంతమంది పచ్చడన్నమే తింటారు - చిన్నపిల్లలు కూడా.

ఆరునెలలప్పుడు కూడా పచ్చడన్నం తినేస్తారు. మరి ఆ రకమైన స్వభావం వాడిలో బలంగా వుంటుందనమాట. సాత్వికమైన ఆహారాలని కొంతమంది ఇష్టపడేవారు వుంటారు. కొంతమంది రాజసికమైన ఆహారాలని ఇష్టపడేవారు వుంటారు. కొంతమంది తామసికమైన ఆహారాలని ఇష్టపడేవారు వుంటారు.

మరి వారికి ఏ రకమైనటువంటి బుద్ధి వికాసం లేకపోయినప్పటికీ ఆ యా ఆకర్షణల బలం వాడిలోపల ప్రజ్ఞ మీద, చైతన్యం మీద ఆచ్ఛాదితమై పనిచేస్తూ వుంటుంది. తత్ ప్రభావం చేత ఆ స్థాయి నుంచే ప్రియ అప్రియములేర్పడటం మొదలవుతాయి.

మరి ఆ ప్రియ అప్రియముల ప్రభావం చేత జీవితం అంతా ఎలా వుంటాడు? అవే బలవత్తరంగా మారిపోతాయి. ఎదిగినా కూడా మార్చుకోలేనంతగా ప్రతిబంధకములైపోతాయి. మరి అవి ప్రతిబంధకములైతే ఎనిమిదేళ్ళ వయసు దాటే వరకూ కూడా ఇక వాడిని మార్చలేం.

ఏమన్నా మారితే ఎనిమిదేళ్ళకు మారాలి. అప్పుడు కూడా మారలేదనుకోండి ఇక పదహారేళ్ళకు మారాల్సిందేవాడు. పదహారేళ్ళకు కూడా కొంతమంది మారనివాళ్ళు వుంటారు జీవితకాలంలో. అప్పుడు ఇక 24 ఏళ్ళకు మారాల్సిందే.

ఈ ఎనిమిది అనే సంఖ్యామానం మీద నడుస్తూ వుంటుంది అనమాట. కాబట్టి మరి ఈ ఆహారము యొక్క అనుభూతి ఈ తల్లి ఎట్లా అయితే అనుభూతి పొంది, ఆ అనుభూతిని వ్యక్తం చేస్తూ అందించేటటువంటి ప్రయత్నం చేసిందో - చిన్న ఆహారం విషయంలోనే ఇలా వుంటే మరి ఆత్మానుభూతి విషయంలో ఎలా వుండాలి. దానిని మాటలతో ఎలా చెప్తాం? - విద్యా సాగర్ స్వామి

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ #సద్గురువిద్యాసాగర్

26 Aug 2020

No comments:

Post a Comment