శ్రీ శివ మహా పురాణము - 206



🌹 . శ్రీ శివ మహా పురాణము - 206  🌹 

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴 

45. అధ్యాయము - 20

🌻. శివుడు కైలాసమునకు వెళ్లుట - 5 🌻

శివ ఉవాచ |

హే హరే హే విధే తాతౌ యువాం ప్రియతరౌ మమ | సురోత్తమౌ త్రి జగతోsవనసర్గక రౌ సదా || 47

గచ్ఛతం నిర్భయాన్నిత్యం స్వస్థానం చ మదాజ్ఞయా | సుఖప్రదాతాహం వై వాం విశేషాత్ర్పేక్షకస్సదా || 48

ఇత్యాకర్ణ్య వచశ్శంభో స్సు ప్రణమ్య తదాజ్ఞయా | అహం హరిశ్చ స్వం ధామాగమావ ప్రీతమాన సౌ || 49

తాదనీమేవ సుప్రీతశ్శంకరో నిధిపం ముదా | ఉపవేశ్య గృహీత్వా తం కర ఆహ శుభం వచః || 50

శివుడు ఇట్లు పలికెను -

హే హరే! హే బ్రహ్మన్‌ ! వత్సలారా! మీరిద్దరు నాకు మిక్కిలి ప్రీతిపాత్రులు. మీరు దేవోత్తములు. మీరు జగత్తును సృష్టించి, సదా రక్షించుచుందురు (47). 

మీరు మీ స్థానమునకు వెళ్లుడు. నిత్యము నిర్భయముగా నుండుడు. ఇది నా యాన. నేను మీకు సుఖములనిచ్చెదను. సదా మీ బాగోగులను చూచెదను (48). 

శంభుని ఈ మాటలను విని, విష్ణువు మరియు నేను ఆయనకు నమస్కరించి, మిక్కిలి సంతసించిన వారమై, ఆయన ఆజ్ఞచే మా స్థానములకు తిరిగి వచ్చితిమి (49). 

అదే సమయములో మిక్కిలి సంతసించిన శంకరుడు ఆనందముతో కుబేరుని చేతిని పట్టుకొని కూర్చుండబెట్టి ఈ శుభకరముగ వాక్కులను పలికెను (50).


శివ ఉవాచ |

తవ ప్రేవ్ణూ వశీ భూతో మిత్రతాగమనం సఖే | స్వస్థానం గచ్చ విభయస్సహాయోsహం సదానఘ || 51

ఇత్యాకర్ణ్య వచశ్శంభోః కుబేరః ప్రీతమనసః | తదాజ్ఞయా స్వకం ధామ జగామ ప్రముదాన్వితః || 52

స ఉవాస గిరౌ శంభుః కైలాసే పర్వతోత్తమే | సగణో యోగనిరతస్స్వచ్ఛందో ధ్యానతత్పరః || 53

క్వచిద్దధ్యౌ స్వమాత్మానం క్వచిద్యోగరతోsభవత్‌ | ఇతి హాస గణాన్‌ ప్రీత్యాsవాదీత్స్వ చ్ఛందమానసః || 54

శివుడు ఇట్లు పలికెను -

ఓ మిత్రమా! నీ ప్రేమచే నేను నీకు వశ##మై మైత్రి కొరకై ఇచటకు వచ్చితిని. ఓ అనఘా! నీ స్థానమునకు వెళ్లుము. నీకు భయము లేదు. నేను నీకు సర్వదా సహాయుడను (51). 

కుబేరుడు శంభుని ఈ మాటను విని సంతసించినవాడై గొప్ప ఆనందముతో శివుని యాజ్ఞ ప్రకారముగా తన ధామకు వెళ్లెను (52). 

ఆ శివుడు గణములతో కూడిన వాడై, యోగమునందు లగ్నమైన వాడై, ధ్యానమునందు తత్పరుడై యథేచ్ఛగా ఆ పర్వత శ్రేష్ఠమగు కైలాసగిరి యందు నివసించెను (53). 

ఒకప్పుడు ఆయన ఆత్మరతుడై యుండెను. మరియొకప్పుడు యోగనిష్ఠుడై యుండెను. ఆయన మనసునకు నచ్చినపుడు ప్రీతితో అనేక ఇతిహాసములను చెప్పెడివాడు (54).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


26 Aug 2020


No comments:

Post a Comment