🌹. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 42 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. తన గత జన్మల గురించి చెప్పిన వీరబ్రహ్మేంద్రస్వామి 🌻
ఒకరోజు సిద్దయ్య స్వామికి సేవ చేస్తూ “స్వామీ! మీకు గతంలో కొన్నిసార్లు త్రేతా, ద్వాపర యుగాలలో కూడా జన్మించారని నాకు తెలిపారు. మీ పూర్వ జన్మల వివరాలను గురించి నాకు వివరిస్తారా?’’ అని అడిగాడు.
“నా గతజన్మల గురించిన వివరములు రహస్యములే అయినా, నీకు మాత్రం వివరించగలను’’ అని తన పూర్వ జన్మల గురించి చెప్పటం ప్రారంభించారు బ్రహ్మేంద్రస్వామి.
“బ్రహ్మలోకంలో నేను భైరవుడనే పేరుతో అనేక బ్రహ్మకల్పాలు రాజ్యపాలన చేశాను. ఆ తరువాత వెండి కొండ మీదకి వెళ్ళి 54 బ్రహ్మకల్పములు రాజ్యపాలన చేశాను. అప్పుడే మూడు యోజనాల పొడవైన కూర్మసిహాసనమును నిర్మించి, 290 బ్రహ్మకల్పాలు విష్ణుసేవ చేశాను.
నేను చేసిన సేవలను గుర్తించిన మాధవుడు నాకు ‘పంచ విధ ముక్తి’ అనే వరం ఇచ్చారు. తర్వాత నేను సిద్ధాంత శిరోమణి ఆనందాశ్రితువు ఆశ్రమమ వద్ద అన్ని విద్యలూ అభ్యసించి, మూడేళ్ళ తరువాత అనేక యోగశాస్త్ర విద్యలను నేర్చుకున్నాను. 12000 గ్రంథములను పఠించి, అందులోని మర్మములన్నియూ గ్రహించాను.
వీటి ఫలితంగా నేను కాల అకాల మృత్యువులను జయించగలిగే శక్తిని సంపాదించాను. అనంతరం నా యోగబలం వల్ల దివ్య శరీరం ధరించి మూడువేల బ్రహ్మకల్పములు చిరంజీవిగా వున్నాను. ఆ తరువాత నా అవతారముల గురించి వివరముగా తెలుపుచున్నాను విను.
మొదట అవతారమెత్తి ఆనందాశ్రితులకు శిష్యుడిగా 99,662 బ్రహ్మకల్పాలు వున్నాను.
మూడవ అవతారంలో 1,09,00,000 వున్నాను. నాల్గవ అవతారంలో కోటి పదమూడు వందల పదిహేడు బ్రహ్మకల్పాలు వున్నాను.
అయిదో అవతారంలో నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల యాభై అయిదు వేల బ్రహ్మకల్పాలు వున్నాను.
ఆరవ అవతారంలో ఆరువందల బ్రహ్మకల్పాలు వున్నాను.
ఏడవ అవతారంలో 27,62,03,400 బ్రహ్మకల్పాలు బతికి వున్నాను.
ఎనిమిదో అవతారంలో 22,60,000 బ్రహ్మకల్పాలు వున్నాను.
పదవ అవతారంలో కనిగిరిలో జన్మించాను. ఆ జన్మలో 70 లక్షలకు పైగా బ్రహ్మకల్పములలో జీవించాను.
ఇప్పుడు బనగానపల్లెలో వీరప్పయాచార్యుడనై 125 సంవత్సరములు తపస్సు చేశాను. వీరబ్రహ్మేంద్రస్వామిగా మొత్తము 175 సంవత్సరములు జీవించి జీవసమాధి పొందుతాను’’
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కాలజ్ఞానం
26.Aug.2020
No comments:
Post a Comment