✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 21 🌻
“యోగాత్ కర్మసుకౌశలం” అంటే అర్ధం ఏమిటంటే – ‘సుకౌశలం’ వట్టి కౌశలం కాదు అది. నీవు ఆత్మవిచారణా జ్ఞానముతో, సాక్షిత్వజ్ఞానంతో నిలబడి వుండి, నిష్ఠ కలిగి వుండి, చలించని వాడవై వుండి చేసేటటువంటి వ్యవహారం అని అర్ధం. అంతేగానీ వ్యవహారంలో బాగా కౌశలంగా చేయగలగడం అని కాదు.
అంటే అర్ధం ఏమిటంటే చాలామంది ఈ అర్ధాన్ని తప్పుగా స్వీకరించినప్పుడు బాగా వంట చెయ్యగలగడం కూడా ఆత్మనిష్ఠయే. బాగా ధనం సంపాదించడం కూడా ఆత్మనిష్ఠయే. బాగా వ్యాపారం చేయడం కూడా ఆత్మనిష్ఠయే. బాగా భోజనం చేయడం కూడా ఆత్మనిష్ఠయే. బాగా నిద్రపోవడం కూడా సుఖాలని అనుభవించడం కూడా ఆత్మనిష్ఠయే అనేటటువంటి అర్ధాన్ని అది సూచిస్తోంది.
కాబట్టి ‘కౌశలం’ అంటే అర్ధం ఏమిటంటే జగత్ సంబంధమైనటువంటి వ్యాపారములలో, జగత్ సంబంధమైనటువంటి వ్యవహారములలో, మోహ సంబంధమైనటువంటి ప్రతిబంధకములలో సుఖ దుఃఖరూప మిశ్రితమైనటువంటి కర్మలలో, సంగత్వ దోషాన్ని పోగొట్టేటటువంటి సాక్షిత్వమునందు నువ్వు నిలకడ చెందాలి.
ఆ సాక్షిత్వమునందు నిలకడచెందేటటువంటి నైపుణ్యాన్ని సంపాదించాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ నైపుణ్యాన్ని నువ్వు సంపాదించినపుడు మాత్రమే నువ్వు “బుద్ధిగ్రాహ్యమతీంద్రియం”. బుద్ధిని దాటగలుగుతావు. “బుద్ధికర్మానుసారిణీ” అన్న స్థితి నుంచి కర్మకి అతీతంగా బుద్ధిని పనిచేయించగలుగుతావు. ఇది కౌశలం అంటే. ఈ కుశలత్వాన్ని అందరూ సంపాదించలేరు.
ఎవరికైతే బుద్ధి వికాసం పూర్తవుతుందో, ఎవరికైతే జగత్ భ్రాంతిగతంగా కనబడుతుందో, ఎవరికైతే జ్ఞానం సత్యంగా కనబడుతుందో, ఎవరికైతే విజ్ఞానము, వివేకమే జీవితప్రాధమ్యాలుగా వుంటయ్యో.. వాళ్ళు మాత్రమే దీనిని సాధించగలుగుతారు. అందువలన ఏమంటున్నాడంటే, నాయనా! ఇటువంటివారు నూటికో కోటికో వుంటారు. కాబట్టి బోధించేవారూ అరుదుగా వుంటారు.
ఆశ్రయించేటటువంటి అధికారులైనటువంటి శిష్యులు కూడా అరుదుగా వుంటారు. యమధర్మరాజుని, సరాసరి యమధర్మరాజు దగ్గరికి పుట్టినటువంటి జీవులందరూ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళవలసిందే. కానీ ఏ ఒక్కరూ యమధర్మరాజుని ఆత్మతత్త్వ విచారణ గురించి ప్రశ్నించలేదు.
ఆయన యొక్క స్థితిని చూసి భయపడిపోయి, ఆయన యొక్క విధించేటటువంటి శిక్షలను అనుభవిస్తూ, క్షీణపుణ్యం అవ్వగానే మరల మర్త్యలోకంలోకి తిరిగి వచ్చేటటువంటి వారేగానీ, యమధర్మరాజుని గురువుగా భావించి, ఆచార్యుడుగా భావించి, ఆ ఆత్మతత్త్వ బోధ గురించి అడిగి - ప్రశ్నించేటటువంటి ఉత్తమమైనటువంటి వివేకాన్ని ప్రదర్శించినటువంటి నచికేతుని వలే ఉండేటటువంటివారు చాలా అరుదుగా వుంటారు. - విద్యా సాగర్ స్వామి
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ
20.Aug.2020
No comments:
Post a Comment