భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 89

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 89 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పరాశర మహర్షి - 8 🌻

44. అంటే ఎవరియందూ ప్రేమ పెట్టుకోకూడదనికాదు ఇందులో అర్థం. తన ప్రేమ నిస్సంగంగా ప్రేమకొరకే ఉండాలి. ఇతరులు చూపించే ప్రేమ స్వార్థంతో కూడిఉంది కాబట్టి, దానిని తిరస్కరించమనీ కాదు. వాళ్ళు చూపించే ప్రేమవెనుక వాళ్ళేది కోరుతున్నారో, ప్రేమతోటే దానిని తాను ఇవ్వాలి. కాని, నిస్సంగమైన ప్రేమతో ఇవ్వాలి. సంగం(మోహబుద్ధి) వాళ్ళలో ఉన్నప్పటికీ, అది నీలో ఉండనక్కరలేదు.

45. వాళ్ళు స్వకార్యధురంధరులై నిన్ను ప్రేమిస్తున్నారనే కారణం తెలిసిన తరువాత కూడా, వాళ్ళను ద్వేషించనక్కరలేదు. ప్రేమతోటే వాళ్ళకు సేవచేసి, ఋణం తీర్చుకో! వాళ్ళు నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నారని అనుకోవడం మోహమన్నమాట.

46. ఇంకా గట్టిగా చెప్పాలంటే, వాళ్ళకు సేవచేయలసిందే! వాళ్ళను ప్రేమతో రక్షించు కోవలసిందే! నీవు వాళ్ళకు యావత్తూ ధారపోయాల్సిందే! నీ శక్తిసామర్థ్యాలు, ధనం అంతా కూడా వాళ్ళకు ఇచ్చేయాలి. అప్పుడే ఋణం తీరుతుంది.

47. వాళు మన దగ్గిరికి రావటానికి కారణం మనం ఋణగ్రస్తులం కావటమే! అయితే, ఆ ఋణంతీరే మార్గంలో ఉన్నప్పటికీ, దానిని నువ్వు మోహంతో చేస్తున్నావుకాని, ఋణం తీర్చుకోవటానికి చేయటం లేదు. నువ్వు మోహం లేకుండా ఇస్తే నీకు ఋణం తీరుతుంది.

48. శౌచాదిక అచారఫలంగా మనుష్యుడు బ్రహ్మలోకప్రాప్తి పొంది తిరిగివచ్చి యోగియై జన్మించి, తరువాత ముక్తినొందగలడు. శౌచమార్గంలో బ్రహ్మలోకానికి వెళ్ళితే అది ముక్తి అనబడదు. ఈ విషయంలో కార్యబ్రహ్మ ఎప్పుడూ కూడా ప్రవృత్తి మార్గమే చెపుతాడు. నివృత్తిమార్గం చెప్పడు.

49. కనుక సామాన్యుడికి ఈశ్వరారాధన శర్ణ్యమయింది. కోరికలు తీర్చుకోవటానికి ఎవరినయినా ఆరాధన చేయవచ్చు. ఏ భూతాన్నో, ప్రేతాన్నో ఆరాధన చేసినా, అవి డబ్బుపట్టుకొచ్చి ఇస్తాయి. అంటే మన క్షుద్రమైన కోరికలు ఓ పిశాచంకూడా తీర్చగలదు. అందుకై భగవంతుణ్ణే ఆరాధించనవసరంలేదు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


20.Aug.2020

No comments:

Post a Comment