🌹. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 44 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. దొంగలకు చెప్పిన కాలజ్ఞానం 🌻
“దేశానికి ఆపదలు తప్పవు. ప్రళయానికి సూచనగా ఆకాశం ఎర్రగా మారుతుంది. ఆరు మతాలూ ఒక్కటవుతాయి. నిప్పుల వాన కురుస్తుంది. నెల్లూరు జలమయం అవుతుంది. నెత్తురు ఏరులై పారుతుంది.
ఏడు గ్రామాలకు ఒక గ్రామం, ఏడిళ్ళకు ఒక ఇల్లు మిగులుతాయి. ప్రజలు కత్తులతో పోట్లాడుకుంటారు. పార్వతి, బసవేశ్వరుల కంట నీరు కారుతుంది. కప్పలు కోడికూతలు కూస్తాయి. భూమి కంపిస్తుంది. అప్పుడు నేను సమాధిలో నుంచి వీర భోగ వసంతరాయులుగా మరల జన్మిస్తాను’’ అని వివరించారు.
🌻. సమాధి పొందే సమయం .... 🌻
కొన్ని సంవత్సరములు పూర్తయిన తర్వాత వీరబ్రహ్మేంద్రస్వామి ఇక తాను సమాధి పొందే సమయం దగ్గర పడిందని తెలుసుకున్నారు. తన వారసుడిగా పెద్ద కుమారుడు గోవిందాచార్య స్వామికి పట్టాభిషేకము చేయదలిచి, ఈ విషయమై తన భక్తులందరికీ కాల జ్ఞాన సౌజన్య పత్రికను పంపారు.
🌻. కాలజ్ఞాన సౌజన్య పత్రికలో ఈ విధంగా వుంది... 🌻
“మేం ఈ వైశాఖ శుద్ధ దశమి ఆదివారం 2.30 గంటలకు ఈ భౌతిక దేహాన్ని వదిలి జీవ సమాధి సిద్ధిని పొందదలచుకున్నాము.
కనుక ఈ పీఠాధిపత్యం నా పెద్ద కుమారుడైన గోవిందాచార్య వారికి అప్పగించుకోదలిచాను. అది తిలకించి నా దగ్గర మూడు రోజులుండి, నేను సమాధిగతుడనగుట చూడవలెనని ఆహ్వానము. నేను వివరించబోవు కాలజ్ఞాన విశేషాలను విని తరించవచ్చును.
అలా స్వయముగా వచ్చి కాలజ్ఞానాద్వైత తత్త్వబోధ వినలేని వారి కోసం ఈ పత్రికతో కొన్ని కాలజ్ఞాన విశేషాలను వివరించి యున్నాము. ఈ పత్రికనే వారు దీపారాధన, నైవేద్యములతో పూజించిన వారికి సకల శుభములు కలుగును.
నేను ఈ వీరబ్రహ్మేంద్రస్వామి అను పేరు ధరించి ఇప్పటికి 175 సంవత్సరములు గడిచాయి. ఇప్పుడు నేను సమాధి, నిష్టలో వుండాలని నిర్ణయించుకున్నాను. తిరిగి భూమి మీదకు వీరభోగవసంతరాయులుగా రాబోతున్నాను.
నేను వచ్చే సమయానికి ఈ కలి లోకంలో, ఎర్ర బొయీలు – శ్వేత ద్వీప వాసులు వస్తారు. శాలివాహన శకమునందే, వీరు మహ్మదీయులతో స్నేహం పొంది, భరతఖండం పాలిస్తారు.
హరిహరాదుల గుళ్ళల్లో పూజలు హరించి పోతాయి. ధనమధాందతచే సాధువులను, జ్ఞానులను, దూషణ చేస్తారు. భూమిపై వర్షములు కురిసినట్లుగానే వుంటాయి. కానీ పంటలు పండవు. పైరులు పండినట్లుగానే వుంటాయి. కానీ నిలవవు. బహు ధాన్య నామ సంవత్సరంలో, కనకదుర్గ మొదలయిన శక్తులు భూమి మీదకు వస్తాయి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
28 Aug 2020
No comments:
Post a Comment