🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 38 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మ విచారణ పద్ధతి - 2 🌻
బోధించేటటువంటి జ్ఞాని తత్వదర్శి అయినపుడు మాత్రమే ఆ రకమైనటువంటి దర్శన శాస్త్రాన్ని నీ అనుభూతి జ్ఞానం ద్వారా అందిస్తాడు.
ఈ రకమైనటువంటి లక్షణాలు ఆశ్రయించేటటువంటి శిష్యుడిలోనూ, బోధించేటటువంటి గురువులోనూ సుస్పష్టంగా వుండాలి అనేటటువంటి అధికారిత్వాన్ని గురించి సమదర్శి అయినటువంటి తత్వవేత్త అయినటువంటి వైవశ్వతుడు/యమధర్మరాజు నచికేతునియందు ప్రస్తావిస్తూ వున్నారు.
నచికేతా:
ఆత్మజ్ఞానములేని సామాన్య మానవుని చేత ఈ ఆత్మతత్వము ఉపదేశింపబడినను అట్టి ఉపదేశము పొందినవానికి ఎన్ని విధముల ఆలోచించినను ఈ ఆత్మతత్వము తెలియబడదు. ఆత్మ సూక్ష్మ పదార్ధములకన్న అతి సూక్ష్మమైనదగుట చేత శాస్త్ర జ్ఞానముచే తర్కించుటకు లేక ఊహించుటకు వీలుకానిది.
ఆత్మ సాక్షాత్కారము పొందిన ఆచార్యుని చేత బోధింపబడిన వ్యక్తికి ఆత్మ విషయమున ఉన్నదా లేదాయను సంశయములు నివృత్తియై ఆత్మజ్ఞానము కలుగును. అనుభవ జ్ఞానహీనులు ఆత్మను గురించి బోధించిన, గ్రుడ్డివారు ఏనుగును గురించి వర్ణన చేసినట్లుగానే యుండును.
ఆత్మ విషయక జ్ఞానము తర్కము చేత త్యజింపరాదు. వంట ఇంటినుండివచ్చు పొగను చూచి నిప్పు లేనిదే పొగ రాదనీ తర్కించి వంటఇంటిలో నిప్పున్నదని ఊహించుచున్నాము. కాని ఆత్మ అతిసూక్ష్మమగుట వలన ఆత్మ విషయక చిహ్నములు ప్రత్యక్షము గావు.
అందుచేత తర్కము మూలమున ఆత్మను తెలిసికొనలేము. అట్టే తర్కము వలన ఆత్మను నిరసింపరాదు. తర్కముకంటే భిన్నమైన ఆత్మవిదుల ఉపదేశము వలన కలిగిన జ్ఞానము సరియైనది.
ఇప్పుడు కొన్ని అంశాలని మరల ప్రస్తావిస్తున్నారు. ఏ ఉపనిషత్తైనా కూడా షట్ ప్రమాణ సహితంగా బోధించబడుతూ వుంటుంది. ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణాన్ని స్వీకరించారనమాట.
మనకి ప్రత్యక్షప్రమాణం అంటే అర్ధం ఏమిటంటే ఇంద్రియముల ద్వారా తెలుసుకొనగలిగినదంతా ప్రత్యక్ష ప్రమాణమే. చూడటం ద్వారా గాని, వినడం ద్వారా గాని, స్పృశించడం ద్వారా గాని, రుచి చూడటం ద్వారా గాని, లేదా వాసన చూడటం ద్వారా గాని ఈ రకమైనటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాత్మకమైనటువంటి జ్ఞానేంద్రియముల ద్వారా మనం గ్రహించేదంతా ప్రత్యక్ష ప్రమాణం. మరి ఆత్మని వీటితో నిర్ణయించవచ్చా? అంటే ఆ అవకాశం లేదు. - విద్యా సాగర్ స్వామి
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ
28 Aug 2020
No comments:
Post a Comment