శ్రీ శివ మహా పురాణము - 255


🌹 . శ్రీ శివ మహా పురాణము - 255 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
59. అధ్యాయము - 14


🌻. సతీజన్మ - బాల్యము - 3 🌻

దక్షుని కుమార్తెగా అవతరించిన జగన్మాతయగు పరమేశ్వరిని చూచి వరాందరు వినయముతో నమస్కరించి శుభస్తోత్రములతో స్తుతించిరి (46). వారందరు మిక్కిలి ఆనందించి జయజయ శబ్దములను పలికి, ప్రీతితో దక్షుని, ప్రత్యేకించి వీరిణిని ప్రశంసించిరి (47).

అపుడు దక్షుడు ఆమె ఆజ్ఞచే ఆమెకు ఉమయని పేరిడెను. ఆమె యొక్క ప్రశంసింప దగిన సర్వగుణములను చూచి ఆతడు ఆనందించెను (48). తరువాత ఆమెకు లోకములో ఇతరనామములు కలిగెను. ఆ నామములన్నియూ మహామంగళముల నిచ్చునవే. ఆ నామములు విశేషించి దుఃఖములను పోగొట్టును (49). అపుడు దక్షుడు విష్ణువునకు, నాకు, సర్వదేవతలకు, మునులకు చేతులు జోడించి నమస్కరించి స్తుతించి భక్తితో ఆరాధించెను (50). అపుడు విష్ణువు మొదలగు దేవతలందరు బ్రహ్మ కుమారుడగు దక్షుని ప్రశంసించి ఆనందముతో ఉమాపరమేశ్వరులను స్మరించుకుంటూ తమతమ ధామములకు వెళ్లిరి (51).

అపుడా తల్లి శిశువును యథాయోగ్యముగా సంస్కరించి ఆమెకు స్తన్యము నిచ్చి లాలించెను (52). మహాత్ముడగు దక్షుడు మరియు వీరిణి ఆమెను పెంచుచుండిరి. ఆమె శుక్ల పక్షములోని చంద్రరేఖ వలె దినదిన ప్రవర్థమానయై విలసిల్లెను (53).

ఓ బ్రాహ్మణశ్రేష్టా! ఆమెయందు సద్గుణములన్నియూ ప్రవేశించినవి. ఆమె బాల్యమునందే మనోహరమగు కళలన్నింటితో గూడిన చంద్రునివలె విరాజిల్లెను (54). ఆమె సఖురాండ్ర మధ్యలో నున్నప్పుడు తన మనస్సులోని భావమునకు అనురూపముగా ప్రతిదినము అనేక పర్యాయములు శివుని చిత్రమును లిఖించుచుండెడిది (55).

ఆమె బాల్యావస్థకు తగిన పాటలను పాడుతూ స్థాణువు, హరుడు, రుద్రుడు, స్మరశాసనుడు (మన్మథుని నియంత్రించిన వాడు) ఇత్యాది శివనామములను స్మరించెడిది (56).

ఆమె బాల్యము నుండియూ ప్రతి దినము భక్తురాలివలె ప్రవర్తించుటను గాంచిన ఆ తల్లిదండ్రులకు సాటిలేని కరుణ కలిగి వృద్ధి పొందజొచ్చెను (57). బాల్య గుణములన్నింటితో కూడియున్న ఆ సతి ప్రతిదినము ధ్యానమునందు నిమగ్నురాలగుచూ, అనేక పర్యాయములు తల్లిదండ్రులకు ఆనందమును కలిగించెను (58).

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహిత యందు సతీఖండములో సతీ జన్మ మరియు బాల లీలలు అనే పదునాల్గవ అధ్యాయము ముగిసినది (14).


సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


25 Oct 2020

No comments:

Post a Comment