✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము -14 🌻
అన్ని జీవుల యొక్క హృదయస్థానములో, పరమాత్మ అణు స్వరూపుడై ప్రకాశించుచున్నప్పటికీ, తెలుసుకోగలిగే శక్తి మానవుడికి ఒక్కడికే ఉంది. కారణము ఆ బుద్ధి వికాసము ఒక్కమానవుడికే ఉంది కాబట్టి. ఒకే స్థానములో జీవభావము, పరమాత్మ భావము రెండూ ఒక స్థానంలోనే ఉన్నాయి. అది హృదయస్థానము.
అది వ్యవహారగతమైనటువంటి శరీర, ఇంద్రియ సంఘాతము వైపు, జగత్తు వైపు తిరిగియున్నప్పుడు సుఖాపేక్షతో జీవాత్మగా నీడవలె ఉన్నది. అది స్వయం ప్రకాశము కాదు. అదే స్థానములో మరొకవైపు అంటే, అంతర్ముఖం వైపు పరమాత్మగా, స్వయం ప్రకాశకముగా ఉన్నది. ఈ రెండూ ఎట్లా ఉన్నాయయ్యా? అంటే, ఒక ఉపమానం చెప్పారు అన్నమాట.
సూర్యుని ముందు మనం నడుస్తూ ఉన్నామనుకోండి, మన నీడ పడుతూ ఉంటుంది. ఇప్పుడు నీడ ప్రకాశించడం వలన పడుతుందా? సూర్యప్రకాశము వలన నీడ ఏర్పడిందా? అట్లే, నీ సర్వేంద్రియ సంఘాతము, విషయ సంఘాతము, జగత్తు, అనేకత్వము అనుభూతమౌతున్నటువంటి భోగములు, సుఖదుఃఖములు సమస్త ద్వంద్వానుభూతులు ఇవన్నీ ఆ నీడలో భాగములు. అంతేకానీ, వాస్తవములు కావు.
అవన్నీ వెనకనున్నటువంటి స్వయం ప్రకాశకమైనటువంటి, సూర్యుని వంటి, పరమాత్మ ప్రకాశం వలన ఏర్పడుతూ వున్నాయి. అంతేగానీ, వాటంతట అవే ఏర్పడడం లేదు. మనము కూడా గ్రహిస్తే, ఈ భూమండలం మీద జరుగుతున్న సమస్తము కూడా కర్మ సాక్షి అయినటువంటి, సూర్యుని ఆధారంగానే జరుగుతూ వున్నట్లుగా మనము తెలుసుకోగలుగుతున్నాము.
రోజువారి నిత్యదైనందిన జీవకర్మ నీకు ఎప్పుడు ప్రారంభమౌతుంది అంటే, సూర్యోదయంతో ప్రారంభం అవుతోంది. ఉభయ సంధ్యలలో నీవు, ఆ సంధ్యా విధిని అనుసరించి నీవు సరియైనటువంటి కర్మను చేస్తూ ఉన్నావు. కానీ, అది ఎవరికి అర్పిస్తున్నావు అంటే, ఆ సర్వకర్మఫల త్యాగము చేసి, కర్మసాక్షి అయినటువంటి, ‘సూర్యుని వలె నీవుండాలి’ - అనేటటువంటి ప్రామాణికమైనటువంటి పద్ధతిని సూర్యోపాసన, ఆదిత్యోపాసన.
సూర్యుని త్రిమూర్త్యాత్మకంగా, సశక్త్యాత్మకంగా భావించి, కర్మ సాక్షిగా వారిని స్వీకరించి, ఆత్మస్వరూపంగా స్వీకరించి, అట్టి ఆదిత్యుని ఉపాసించేటటువంటి విధానము మన సనాతన ధర్మంలో చెప్పబడింది. కారణమేమిటంటే, నీడ - స్వయ ప్రకాశకము రెండూ ఒకే స్థానమునందు ఉన్నట్లు తోచుచున్నవి.
నీవు స్వయంప్రకాశమును అనుసరించి ఆశ్రయించి జీవిస్తావా? నీడ వలె ఉన్నటువంటి జీవాత్మ భావమును, నీడ వలె ఉన్నటువంటి జగద్భావమును, నీడవలె ఉన్నటువంటి కర్తృత్వ భోక్తృత్వాభిమానమును, నీడవలె ఉన్నటువంటి అహంకార భావమును, నీడవలె ఉన్నటువంటి సమస్త ఇంద్రియ విషయ సంయోజనీయతను ఆశ్రయిస్తావా? అనేది, నీవు విచక్షణతో గ్రహించవలసినటువంటి అవసరము వున్నది.
కాబట్టి, విచారణ ఎందుకు చేయాలి అంటే, వివేకము కొరకు చేయాలి. ఆ వివేకము ఎవరికైతే స్థిరమౌతుందో, ఈ వివేకములో ఎవరైతే స్థిరపడుతారో, వాళ్ళు మాత్రమే ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని, స్వస్వరూపజ్ఞాన అనుసంధానాన్ని, స్వయం ప్రకాశకత్వాన్ని, సర్వవిలక్షణత్వాన్ని, సర్వసాక్షిత్వాన్ని పొందగలుగుతారు. ఇది నీ హృదయస్థానంలోనే సాధ్యమౌతుంది. - విద్యా సాగర్ స్వామి
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
25 Oct 2020
No comments:
Post a Comment