గీతోపనిషత్తు - 59


🌹. గీతోపనిషత్తు - 59 🌹

🍀 20. ఎంపిక - నీ కర్తవ్యము సరియైనది అగుచో అది నిన్ను బంధించదు. సరియగు నిర్ణయము చేసుకొన లేననిపించినచో, నా నిర్ణయమును పాటించుము. అప్పుడు నీ బాధ్యత నాదే. 🍀

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ



📚. కర్మయోగము - 32 📚



యే త్వేతదభ్య సూయంతో నానుతిష్ఠంతి మే మతమ్ |
సర్వఙ్ఞాన విమూఢాం స్తాన్విద్ధి నష్టానచేతసః || 32 ||


బుద్ధిమాంద్యులకు కర్తవ్యమేదో, కామమేదో తెలియదు. కామమే కర్తవ్యమని నిర్వర్తించుట వలన వారు బంధింప బడుచున్నారు. బుద్ధిమంతులకు కర్తవ్యము సూటిగ గోచరించును. వారు దానినే ఆచరింతురు.

కావున బుద్ధిమాంద్యుల కొరకు దైవము కరుణతో శరణాగతి మార్గమును వాగ్దానము చేసెను. బుద్ధి ననుసరింప లేనివారు దైవము నాశ్రయించ వచ్చునని తెలిపినాడు.

బుద్ధి ప్రచోదనము కాక, శరణాగతి నచ్చక బ్రతుకు జీవుల మాట యేమి?తమను తామైనా ఉద్ధరించుకొనవలెను లేదా సమస్తము నుండి ఉద్ధరించు వానిని ప్రార్థించుచూ శరణము పొందవలెను. రెండును చేయని వారిని ఎవరు రక్షింప గలరు? ఎవరునూ రక్షింపలేరు.

"కర్తవ్యమును నిర్ణయించుకొనుచు చేయుము లేదా నేను చెప్పినట్లు చేయుము.” అని అర్జునునితో శ్రీకృష్ణుడు పలికినాడు.

నీ కర్తవ్యము సరియైనది అగుచో అది నిన్ను బంధించదు. సరియగు నిర్ణయము చేసుకొనలేననిపించినచో, నా నిర్ణయమును పాటించుము. అప్పుడు నీ బాధ్యత నాదే. రెండింటిని కాదన్నచో నష్టపడుట తప్పదు. అటుపైన నీ యిష్టము అని దైవము అర్జునుని ద్వారా నరులకు తెలుపుచున్నాడు. ఎంపిక చేసుకొనవచ్చునని నరునికే నిర్ణయము వదలినాడు. (3-32)


సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


25 Oct 2020


No comments:

Post a Comment