🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 100 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము -30 🌻
ఎట్లా తెలుసుకోవచ్చు? ఈ తత్త్వ విచారణని ఎలా చేయవచ్చు? అనేటటువంటి సాంఖ్య విచారణకి పునాది కల్పిస్తున్నారు. ఈ పునాది చక్కగా రాబోయే దాంట్లో వివరిస్తున్నారు. అయితే మనం ఈ సాంఖ్య విచారణలో ప్రధానంగా పంచీకరణ ద్వారా పిండాండ పంచీకరణ ద్వారా ఇంద్రియ వ్యవహారం ఎలా జరుగుతోంది? అలానే గోళక వ్యవహారం ఎలా జరుగుతోంది? అలాగే శక్తి వ్యవహారం ఎలా జరుగుతోంది?
అలాగే వాటన్నిటికి సాక్షిగా ఉండడం ఎట్లాగా? వాటిని నిరసించడం ఎట్లాగా? అపంచీకృత భాగములను తెలుసుకోవడం ఎట్లాగా? వాటి వ్యవహార స్థితులు తెలుసుకోవడం ఎట్లాగా? అధిష్ఠాన దేవతా పద్ధతి తెలుసుకోవడం ఎట్లాగా? ఆశ్రయ పద్ధతిని తెలుసుకోవడం ఎట్లాగా? ఈ రకములైనటువంటి విచారణ క్రమములన్నీ పిండాండ, బ్రహ్మాండ పంచీకరణలలో స్పష్టముగా తెలియజేయబడుతాయి.
కాబట్టి, ప్రతి ఒక్కరూ ఈ సాంఖ్య విచారణ శైలిని అందిపుచ్చుకోవడం అవసరం. తద్వారా ప్రతి ఒక్కరూ ప్రత్యగాత్మను తెలుసుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా సాంఖ్యవిచారణ క్రమాన్ని యమధర్మరాజు గారు నచికేతునికి బోధించేటటువంటి ఒక క్రమాన్ని ప్రారంభిస్తూ వున్నారు.
మనకు కన్పించు శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణములు గోళకములుగాయున్నవి. ఈ గోళకములకు అంతరముగా ఇంద్రియములున్నవి. శ్రోత్రము శబ్దమును గ్రహించు పనిముట్టుగా యున్నది. శబ్దమును శ్రోత్రేంద్రియము మనస్సునకు చేర్చుచున్నది. ఆప్టిక్ నెర్వ్ [Optic nerve] శ్రోత్రేంద్రియము చెడినచో గోళకముగాయున్న చెవి బాగుగా యున్నప్పటికీ శబ్దమును గ్రహించుట లేదు. గోళకముల కన్న ఇంద్రియములు అంతరముగా యున్నవి. ఇంద్రియముల కన్న శబ్దాది తన్మాత్మలు అంతరముగా యున్నవి, తన్మాత్రలకన్నా మనస్సు అంతరముగా యున్నది. మనస్సుకన్నా బుద్ధి అంతరముగా యున్నది. బుద్ధి కన్న మహతత్త్వము, దానికన్న అవ్యక్తము అంతరంగా యున్నవి. అవ్యక్తమునకు అంతరముగా ప్రత్యగాత్మయున్నాడు. ప్రత్యగాత్మకన్న పరుడైనవాడు లేనందున అతడే పరాగతి అని అనబడుచున్నది. సర్వాంతర్యామి, సర్వవ్యాపియగు పరమాత్మను బుద్ధిగుహయందే, సాక్షాత్కారము చేసుకొనవలెనని ఇంతకు పూర్వమే చెప్పబడినది. అట్టి సాక్షాత్కారము ఈ విచారణ ద్వారా కలుగుచున్నది.
భూమిరాపో అనలో వాయుః, ఖంమనోబుద్దిరేవచ౹
అహంకారః ఇతీయంమే, భిన్నా ప్రకృతిః అష్టదా ౹౹
ఎనిమిది విధములైనటువంటి ప్రకృతి ఉన్నదని ప్రతిపాదిస్తూ, ఆ ఎనిమిది విధములైనటువంటి ప్రకృతి మనలో ఎలా పనిచేస్తుంది? ఒకదాని కంటే ఒకటి సూక్ష్మముగా ఎలా ఉన్నాయి? వాటి వ్యవహారము ఎలా ఉన్నది? వాటిని మనము విచారించి, విరమించడం ఎట్లాగా? అనేటటువంటి సూత్రాన్ని మనకు ఇప్పుడు తెలియజేస్తున్నారు.
ఇదే విషయం గురించి నిన్న కూడా మనం చర్చించడం జరిగింది. ఇప్పుడు మరింత వివరంగా చర్చిస్తున్నాము. ఏమిటీ అంటే, మనకు సాధారణంగా వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్ళను చూసినట్లయితే, వాళ్ళకి చెవులు బాగానే ఉన్నట్లుగానే కనబడుతుంది. కానీ, గ్రాహ్యక శక్తి లోపించింది. అంటే, అర్థం ఏమిటి? వాళ్లకి లోపల పనిచేసేటటువంటి, చెవి లోపల పనిచేసేటటువంటి శ్రవణనాడి ఏదైతే ఉన్నదో, ఆ నాడి యొక్క కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ అనుసంధాన ప్రక్రియ ఏదైతే ఉన్నదో, అక్కడ ఇబ్బంది కలిగిందన్నమాట. దానిని మనము వినికిడి యంత్రాల ద్వారా ఇతరత్రా ఆపరేషన్స్ ద్వారా ఇప్పుడు ఈ ఇంద్రియాలను కూడా సరిచేస్తున్నాము.
కానీ, అన్ని వేళలా ఇలా సరిచేసే అవకాశం లేదు. అంటే అర్థం మెదడులోపల ఉన్నటువంటి శ్రవణేంద్రియ కేంద్రం కనుక దెబ్బతిన్నట్లయితే, దానిని సరిచేయలేము. అయితే దానిని గూడా న్యూరోటిక్ సర్జరీ ద్వారా సరిచేసి, యాంత్రికమైనటువంటి వ్యవస్థను, అభివృద్ధి చేసి, శ్రవణేంద్రియములను పనిచేయించడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తు్న్నారు. కాబట్టి, దీనిని బట్టి ఏమి అర్థమయ్యింది? కేవలం చెవి అనేది, బయటకు కనపడుతున్నటువంటి ఏ చెవి అయితే మనకు నిర్మాణం కనబడుతుందో, ఇది పనిముట్టు మాత్రమే. ప్రపంచంలో ఎవరైనా సరే, పనిముట్టును నేనంటే ఒప్పుకుంటారా? అంటే, మీ ఇంట్లో చాలా వస్తువులున్నాయి.
ఉదాహరణకు, ఫ్లవర్‌వాజ్, టేబుల్స్, కుర్చీలు ఉన్నాయి. విగ్రహాలు, పూజామందిరాలు, మంచాలు, కుంచాలు, కంచాలు ఉన్నాయి. ఇందులో ఏవైనా సరే, నేను అని మీరు ఒప్పుకుంటారా? అది మీరేనా అంటే, ఇది నా కంచం, ఇది నా కుంచం, ఇది నా మంచం అంటాం. అంతేకానీ, నేను కంచాన్ని, నేను మంచాన్ని, నేను కుంచాన్ని అంటే ఒప్పుకోము.
కారణం ఏమిటి అంటే, వాటిని నేను ఉపయోగిస్తున్నాను. అవి నాకు పనిముట్లు అంటాం. ఇవి బాహ్యవ్యవహారంలో ఉన్నటువంటి పనిముట్లు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
11 Nov 2020
No comments:
Post a Comment