భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 157


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 157 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. నారద మహర్షి - 31
🌻

224. ‘పరిప్రశ్నేన సేవయా‘ అని గీతలో చెప్పినట్లు, సందేహం వచ్చినప్పుడు పెద్దలదగ్గరికివెళ్ళి, నమస్కరించి సవినయంగా, ‘అయ్యా! నాకీ సందేహం వచ్చింది. మీవల్ల అది తీరాలి’ అని అడగాలి. అంతేకాని దూరంగా ఉన్నవాడిని తన దగ్గరగా పిలిచి, ‘ఈ మాట చెప్పు’ అని అడగకూడదు.

225. బ్రహ్మమానస పుత్రుడై పుట్టకముందే ఈ జీవుడున్నాడనే కదా అర్థం. జీవుడు బ్రహ్మమానసపుత్రుడిగా బ్రహ్మలో నిక్షిప్తమయ్యాడన్నమాట. బ్రహ్మ నిర్గుణ వస్తువుకాదు, కార్యబ్రహ్మయే.

226. కార్యబ్రహ్మ యందు లయం పొందటంవంటిది. మళ్ళీ పునఃసృష్టి చేసేటటువంటి బ్రహ్మపుట్టాడు. తనయందు లయమైనటువంటి జీవులను పునఃసృష్టి చేసాడు. మొట్టమొదట తనుఎవరో తాను గుర్తెరిగి, సంకల్పంతో తనలో లయంచెందిన పూర్వజీవులను తొలిగా పుట్టించాడు. వాళ్ళే మానస పుత్రులు-బ్రహ్మమానసపుత్రులు – అనబడ్డారు.

227. మనకు త్రిమూర్తులున్నారు. బ్రహ్మ సృష్టిచేస్తాడనీ, విష్ణువు స్థితికి కారణమని, అంటే రక్షిస్తాడనీ, శివుడు లయకారకుడని మనం చెప్తాం. ఈ వేదములు సృష్టికి హేతువైనవి. సృష్టిలో సమస్తవిషయములనూ ధరించి చెప్పేటటువంటివి, యజ్ఞాది క్రతువులయందు మనుష్యులను ప్రేరణచేసి ఈ సృష్టిని సక్రమంగా పద్ధతిలో నడిపించేవి వేదములు. ఇందంతాకూడా కార్యబ్రహ్మ అయినటువంటి బ్రహ్మదేవుడియొక్క అధికారము – ఆయన క్రియ.

228. ఆయన ముఖంలోంచీ పుట్టిన వేదములయొక్క సారాన్ని తెలుసుకుని ఆ ప్రకారంగా వైదికమార్గంలో జీవించినవాడు, బ్రహ్మలో ప్రవేశించి ఉంటాడు. అని దాని తాత్పర్యం. జీవుడు ఆ వేదమార్గంలో జీవనంచేసి, క్రమంగా అభివృద్ధిపొంది స్వర్గాదిసౌఖ్యాలు పొంది, బ్రహ్మలోకందాకా వెళ్ళాలి. అది గమ్యస్థానం.

229. ప్రవృత్తిమార్గంలో ఉండే జీవుడు ఏది ధర్మమో అది తెలుసుకుని, అట్టి జీవనాన్ని అవలంబించాలి. అధర్మంవల్ల, అది చేసినవాడికేకాక, లోకంలో కూడా ఒక క్షోభ ప్రవేశిస్తుంది. ఇతరులను దుఃఖపెట్టేటటువంటి ఒకానొక దుష్టశక్తి ప్రవేశిస్తుంది. తద్వారా ఒకడుచేసిన పాపం అనేకమందికూడా అనుభవిస్తారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


11 Nov 2020



No comments:

Post a Comment