🌹 . శ్రీ శివ మహా పురాణము - 269 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
64. అధ్యాయము - 19
🌻. సతీకల్యాణము - శివలీల -1 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
దక్షుడు కన్యాదానమును చేసి శివునకు అనేక వస్తువులను సారెగా నిచ్చి, మిక్కిలి ప్రసన్నుడై వివిధ సంపదలను బ్రాహ్మణులకు ఇచ్చెను (1). అపుడు గరుడధ్వజుడగు విష్ణువు లక్ష్మీదేవితో గూడి శివుని వద్దకు వచ్చి దోసిలియొగ్గి ఇట్లు పలికెను (2).
విష్ణువు ఇట్లు పలికెను -
దేవదేవా!మహాదేవా!కరుణా సముద్రా! హే ప్రభో! తండ్రీ! ఈ జగత్తులన్నిటికీ నీవు తండ్రివి. సతి తల్లి (3). మీరు సర్వదా సత్పురుషుల క్షేమము కొరకు, దుష్టుల నిగ్రహము కొరకు లీలచే అవతరించెదరని సనాతనమగు వేదము వక్కాణించుచున్నది (4). హే హరా! చిక్కని నల్లని కాటుక వలె శ్యామ వర్ణముతో శోభిల్లు సతితో గూడి యున్న గౌరవర్ణము గల నీవు, గౌరవర్ణము గల లక్ష్మితో శ్యామవర్ణముగల నేను వలె, శోభిల్లు చున్నావు (5).
హే శంభో! నీవు దేవతలలో, మరియు మానవులలో గల సత్పురుషులను ఈ సతీదేవితో గూడి రక్షింపుము. ఈ సంసారములో సారభూతులగు సత్పురుషులకు సర్వదా మంగళము గలుగు గాక! (6). హే సర్వభూతేశ్వరా! ఈమెను ఎవరైతే అభిలాషతో చూచునో,వానిని నీవు సంహరింపుము. ఇది నా విన్నపము (7).
బ్రహ్మ ఇట్లు పలికెను -
విష్ణువు యొక్క ఈ మాటను విని సర్వజ్ఞుడగు పరమేశ్వరుడు నవ్వి, 'అటులనే అగుగాక!' అని మధు సూదనునితో పలికెను (8). ఓ మహర్షీ! అపుడు విష్ణువు తన స్థానమునకు తిరిగి వచ్చి, ఉత్సవమును చేయించెను. మరియు ఆ వృత్తాంతమును రహస్యముగా నుంచెను (9).
నేను గృహ్య సూత్రములో చెప్పిన విధముగా హోమాది కార్యములనన్నిటినీ విస్తారముగా యథావిధిగా సతీశివులచే చేయించితిని (10). అపుడు సతీశివులు ఆనందించి, ఆచార్యుడనగు నేను, మరియు ఇతర బ్రాహ్మణులు ఆజ్ఞాపించగా యథావిధిగా అగ్ని ప్రదక్షిణమును చేరిసి (11).
ఓ ద్విజశ్రేష్ఠా! అపుడచట అద్భుతమగు మహోత్సవము ప్రవర్తిల్లెను. దానిలోని వాద్యములు, గీతములు, నృత్యములు సర్వులకు సుఖమును కలిగించెను (12). అపుడచట అత్యాశ్చర్యకమైన అద్భుత వృత్తాంతము ఘటిల్లెను వత్సా! దానిని నీకు చెప్పెదను వినుము (13).
శంభు మాయను తెలియట మిక్కిలి కష్టము. ఆ మాయ చే జగత్తు పూర్తిగా మోహింపబడి యున్నది. దేవతలు, రాక్షసులు, మనుష్యులుతో సహా చరాచరజగత్తు ఆ మాయచే మిక్కిలి మోహమును చెందియున్నది (14). పూర్వము నేను కపటో పాయముచే శంభుని మోహింపజేయ గోరితిని. వత్సా! అట్టి నన్ను శంకరుడు అవలీలగా మోహింపజేసెను (15).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
11 Nov 2020
No comments:
Post a Comment