🌹. గీతోపనిషత్తు - 72 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀 10. ఆనందము - జీవుడనగా ఆనందము కొరకు నన్వేషించువాడని ఒక నిర్వచనము. ఈ ఆనందము ప్రాథమిక దశలో అజ్ఞాన పూరితముగను, అశాశ్వతముగను నుండును. శాశ్వత ఆనందము లభ్యమగు వరకు జీవుని అన్వేషణ సాగుచునే యుండును.🍀
📚. 4. జ్ఞానయోగము - 11 📚
🌻. యే యథా మాం ప్రపద్యంతే తాం స్తథైవ భజామ్యహమ్ |
మమ వర్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః | 11 🌻
“ఎవరెవరే విధముగ నన్ను ఆశ్రయించు చున్నారో వారిని ఆ యా విధములుగనే నేను ఎల్లప్పుడు అనుగ్రహించు చున్నాను. మానవులందరు సర్వ విధముల నా మార్గమునే అనుసరించు చున్నారు” అని భగవానుడు పలికెను. ఇది ఒక శాశ్వత సత్యము.
దైవము ఆనంద స్వరూపుడు. జీవులు ఆనందము కొరకే రకరకముల కార్యముల నాచరించుచున్నారు. రకరకముల అన్వేషణలను సాగించుచున్నారు. శాశ్వత ఆనందము లభ్యమగు వరకు జీవుని అన్వేషణ సాగుచునే యుండును. ఇన్ని రకముల అన్వేషణలును దైవమును జేరు మార్గములే. కారణము జీవుని యందు గల ఆనందాన్వేషణ. శాశ్వతానందము దైవము. శాశ్వతానందము కలుగనంతవరకు జీవుడు అన్వేషణ సాగించుచునే యుండును.
జీవుడనగా ఆనందము కొరకు నన్వేషించువాడని ఒక నిర్వచనము. ఈ ఆనందము ప్రాథమిక దశలో అజ్ఞానపూరితముగను, అశాశ్వతముగను నుండును. కొందరికి అన్నము తిన్నచో ఆనందము. కొందరికి నిద్రించినచో ఆనందము. కొందరికి తీరుబడిగ కూర్చుని వ్యర్థభాషణము చేయుట ఆనందము. కొందరికి తిరుగుట ఆనందము. కొందరికి పుణ్యక్షేత్ర దర్శన మానందము. కొందరికి ధనార్జన మానందము. ఇట్లనేకానేక ఆనందములు జీవుడు పొందుటకు ప్రయత్నించును.
ఇట్లే పదవి, కీర్తి, స్త్రీ పురుష వ్యామోహము ఆనందములుగ కొందరికి గోచరించును. జీవుడు దీని ననుసరించి అందలి ఆనందము అనుభవించి అది తాత్కాలికమని తెలుసుకొనును. ఒక ఆనందము తాత్కాలికమని తెలిసిన వెంటనే అంతకన్న మిక్కుటమగు ఆనందమునకు ప్రయత్నించును. ఇట్లు ఆనందానుభూతికే సర్వవిధముల మానవులు కోటానుకోట్ల మార్గముల ప్రయత్నించును. అందు శాశ్వతత్వము లేకపోగా బంధనములు, రోగములు ఏర్పడుట గమనించును.
అపుడు దుష్పలితములు లేని ఆనందమునకే అన్వేషించును. చిట్టచివరికి దైవస్మరణ, యజ్ఞార్థ జీవనము, స్వాధ్యాయము శాశ్వతానంద మార్గములని తెలిసి అందు తనను నియమించు కొనును. ఇట్లు జీవులు సర్వవిధముల ప్రయత్నించి చివరకు తననే అనుసరించి చేరుతున్నారను సత్యమును దైవము తెలిపెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
11 Nov 2020
No comments:
Post a Comment