గీతోపనిషత్తు -126


🌹. గీతోపనిషత్తు -126 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚

శ్లోకము 11

🍀. 9. యోగి - కర్మ నిర్వహణము - ఆత్మశుద్ధి గల యోగులు సంగము లేక కర్మ నిర్వర్తింతురు. కర్మ నిర్వహణము శరీరము చేత, యింద్రియముల చేత, మనసు చేత నిర్వర్తింప చేయుచున్నను, యోగమున నిలచియే చేయుదురు. శరీరము, యింద్రియములు, మనసు ఈ మూడింటిని కలిపి దేహ మందురు. దానిని ధరించినవాడు మానవుడు. బుద్ధియందు దైవస్మరణమున నుండుటచే దైవముతో యోగము చెంది యుండును. దైవముతో యోగము చెందుట వలన కర్మల యందు సంగము లేక నిర్వర్తించుట ఏర్పడును. మననము వలన మానవుని బుద్ధి దైవముతో యోగము చెందియుండును. అట్టి వాడు యోగయుక్తుడు. 🍀

11. కాయేన మనసా బుద్ద్యా కేవలై రింద్రియై రపి |
యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్యా 2 2 త్మ శుద్ధయే || 11


ఆత్మశుద్ధి గల యోగులు సంగము లేక కర్మ నిర్వర్తింతురు. కర్మ నిర్వహణము శరీరము చేత, యింద్రియముల చేత, మనసు చేత నిర్వర్తింప చేయుచున్నను, యోగమున నిలచియే చేయుదురు. శరీరము, యింద్రియములు, మనసు ఈ మూడింటిని కలిపి దేహ మందురు. దానిని ధరించినవాడు మానవుడు.

మానవుడు, అతని దేహము అను వర్గీకరణము అవగాహన నిచ్చును. సదవగాహన గల మానవుడు బుద్ధియందుండి మనసు, యింద్రియములు, శరీరమును తన వాహనముగ వినియోగించుచు కర్మల నాచరించును.

అట్లాచరించు వాడు బుద్ధియందు దైవస్మరణమున నుండుటచే దైవముతో యోగము చెంది యుండును. దైవముతో యోగము చెందుట వలన కర్మల యందు

సంగము లేక నిర్వర్తించుట ఏర్పడును. కేవలము సంగము లేక కర్మలను నిర్వర్తించుట సాధ్యము కాదు.

బుద్ధి సంగము దైవముతో నున్నపుడు కర్మముతో నుండదు. అందులకే ముందు శ్లోకము నందు మననము తెలుపబడినది. బ్రహ్మమును స్మరించుచు యుండుటయే యిచ్చట తెలిపిన మననము. మననము వలన మానవుని బుద్ధి దైవముతో యోగము చెందియుండును.

అట్టి వాడు యోగయుక్తుడు. యోగయుక్తుడు క్రమముగ జితేంద్రియు డగునని, జయింపబడిన మనసు గల వాడగునని, కల్మషములు తొలగిన వాడగునని, సర్వభూతముల యందలి ఆత్మ తత్వము నెరిగిన వాడగునని, కర్మలయందు సంగమము కూడ తొలగిన వాడగునని 6,7,8,9 శ్లోకములందు తెలుపబడినది.

పాఠకులకు అదే విషయమును మరల మరల తెలియపర్చుట ముఖ్యము. 'చర్విత చర్వణము' అనునది సాధన మార్గమున అతిముఖ్యము. తెలిసిన దానినే మరల మరల తెలియ చెప్పుట బోధన మగును.

పై విధముగ నేర్పడుటకు కారణము కర్మ జ్ఞాన యోగ మందలి సూత్రములను క్రమముగ ఆచరించుటే. అట్లాచరించని వానికి ఈ స్థితి ఏర్పడదు. ఈ అధ్యాయమున ప్రత్యేకముగ తెలుప బడిన సూత్రము కోరిక, ద్వేషములను విసర్జించుట, మననము హృదయమున చేయుచు నుండుట, అందరి యందలి ఈశ్వరుని గుర్తించుట.

వీటికారణమున నీటి బిందువులు అంటని తామరాకు వలె కర్మఫలము లంటని యోగి ఏర్పడును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


17 Jan 2021

No comments:

Post a Comment