శ్రీ శివ మహా పురాణము - 326


🌹 . శ్రీ శివ మహా పురాణము - 326 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

82. అధ్యాయము - 37

🌻. యజ్ఞ విధ్వంసము - 2 🌻


వేగముగా వచ్చుచున్న చక్రమును చూచి వీరుడు, బలశాలియగు క్షేత్రపాలుడు దానికి ఎదురేగి, దానిని వెంటనే మ్రింగివేసెను(19) శత్రు నగరమును జయించు విష్ణువు తన చక్రము నాతడు మ్రింగివేయుటను గనెను. ఇంతలో అతడు నోటిని అధికముగా విడదీసి ఆ చక్రమును బయటకు గ్రక్కెను(20) మహానుభవుడు, జగత్తునకు ఏకైక రక్షకుడునగు విష్ణువు తన చక్రమును స్వీకరించి మిక్కిలి కోపించెను. మహాబలుడగు విస్ణువు క్రుద్ధుడై అనేక ఆయుధములను, అస్త్రములను ధరించి వీరులగు ఆ గణములతో యుద్దమును చేసెను(21)

విష్ణవు భయంకరమగు పరాక్రమమును ప్రదర్శించుచూ, అనేక ఆయుధములను ప్రయోగించి, వారితో సంకులమగు మహా యుద్ధమును చేసెను(22) అపుడు భైరవుడు మొదలగు వారు మిక్కిలి కోపించి గొప్ప తేజస్సు గలవారై అనేక అస్త్రములను ప్రయోగించుచూ, ఆయనతో యుద్ధమును చేసిరి(23) ఇట్లు వారు యుద్దమును చేయుచుండుటను గాంచి సాటిలేని తేజస్సు గల విష్ణువు వెనుకకు మరలి వచ్చి వారిని ఎదుర్కొని స్వయముగా వరితో యుద్ధమును చేసెను(24) అపుడు మహా తేజశ్శాలి, లక్ష్మీపతి అగు విష్ణుభగవానుడు క్రోధమును పొంది చక్రమును చేతబట్టి ఆ వీరభద్రునితో యుద్ధమును చేసెను(25)

ఓ మహర్షీ! మహావీరుడగు వీరభద్రుడు, శేషశాయియగు విష్ణువు అనేక అస్త్రములను ధరించి, శరీరమునకు గగుర్పాటుకలిగించే అతి భయంకరమగు యుద్ధమునుచేసిరి(26) దేవదేవుడగు ఆ విష్ణువు యొక్క యోగబలముచే భయంకారాకారులు, శంఖుమును చక్రమును గదను చేతులయందు ధరించినవారునగు విష్ణుగణములు లెక్కలేనంతమంది పుట్టిరి(27).విష్ణువుతో సమమగు బలము గలవారు, అనక ఆయుధములను ధరించిన వారు అగు ఆ విష్ణువుగణములు కూడా తేజశ్శాలియగు ఆ వీరభద్రునితో యుద్ధమును చేసిరి(28). వీరుడగు వీరభద్రుడు శివప్రభుని స్మరించి, నారాయణునితో సమమగు తేజస్సుగల వారినందరినీ శూలముతో సంహరించి భస్మము చేసెను(29)

అపుడు మహాబలుడగు వీరభద్రుడు యుద్ధరంగమునందు త్రిశూలముతో ఆ విష్ణువును వక్షస్థ్సలమునందు లీలగా పొడిచెను(30). ఓ మహర్షీ! అపుడు పురుషోత్తముడగు విష్ణువు ఆ శూలఘాతముచే గాయపడినవాడై, వెనువెంటనే స్పృహను గోల్పోయి భూమిపై బడెను(31). అపుడు ప్రలయాకాలగ్నివలె ప్రకాశించునది, ముల్లోకములను తగలబెట్టునది, తీవ్రమైనది, వీరులకు గూడ భయమును గొల్పునది అగు తేజస్సు యజ్ఞము నుండి ఉద్భవించెను(32) పురుషోత్తముడు, లక్ష్మీపతి అగు ఆ విష్ణువు ప్రభుడు మరల లేచి, క్రోధముచే ఎర్రనైన నేత్రముల గలవాడై చక్రమును చేతబట్టి వీరభద్రునిపై దాడి చేయుటకు సంసిద్ధుడాయెను(33)

దైన్యములేని మనస్సు గలవాడు, శివప్రభునిస్వరూప భూతుడు అగు వీరభద్రుడు మిక్కిలి భయంకరమైనది, ప్రలయకాలయందలి సూర్యునితో సమమగు కాంతి గలది అగు ఆ విష్ణువ యొక్క చక్రమును స్తంభింపజేసెను(34) ఓ మహర్షీ! హరియెక్కచేతియందలిచక్రము మాయాధీశుడు, మహాప్రభువు అగు శంభుని ప్రభావముచే నిశ్చిత్తముగా స్తంభింప చేయబడి కదలకుండెను(35)

అపుడు తేజశ్శాలి, గణాధీశుడు అగు ఆ వీరభద్రునిచే స్తంభింపచేయబడిన విష్ణువు పర్వతము వలె కదలిక లేకుండగా నిలబడెను(36) ఓ నారద! వీరభద్రనిచే స్తభింపజేయబడిన విష్ణువు ఆ స్తంభన శక్తిన నిర్వీర్యము చేయుట కొరకై భృగు మహర్షిని పిలువగోరెను(37) ఓ మహర్షీ! ఇంతలో స్తంభననుండి విడుదలపొందిన లక్ష్మీపతి శార్‌ఙ్గమని ప్రసిద్ధిగాంచిన తన ధనస్సును , బాణములను క్రోథముతో చేబట్టెను(38)

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


17 Jan 2021

No comments:

Post a Comment