దేవాపి మహర్షి బోధనలు - 5


🌹. దేవాపి మహర్షి బోధనలు - 5 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻 2. సుదర్శన చక్రము - 2 🌻


ఎన్నిమార్లు దర్శించిననూ దర్శింపబడు వస్తువు ఒకటే గనుక జ్ఞానము మరలనట్లే దర్శింపబడును. పుస్తకములు నశించిననూ, ఆ పుస్తకములను మొదట వ్రాసిన జ్ఞానము ఎన్ని మార్లెనను ఆ జ్ఞానము వ్రాయగలదు.

ఆ జ్ఞానమండలమే వేదము. దానికి నాశము లేదు. ఏ వస్తునైనను పరిపూర్ణతతో వృత్తాకారము వహించును. కాలము మండలాత్మకము. దూరము మండలాత్మకము. జ్ఞానమునకు శిశువు కాలము. కాలమునకు శిశువు దూరము.

ఈ రెండింటి జతయే బ్రహ్మాండము. అది సృష్టికి ముందు వృత్తాకారము (360 డిగ్రీలు), సృష్టి జరుగుటలో అండాకారము (365 డిగ్రీలు) సృష్టి బిడ్డలగు గోళములు అండాకారములు. వాని గమన మార్గములు కూడ అండాకారములు. గోళ మందలి జీవులు కూడా తొలుత అండాకారములే. పిదప దిస్వభావములైన అండాకారములు జనించినవి (బుధుడు - బుద్ధి).

తరువాత అండము నుండి రెండు భిన్న భావములైన డిప్పలు అవతరించినవి. (శుక్రుడు, కుజుడు), సాశనములు, అనశనములు. విడిపోయిన ఈ రెండు డిప్పలు. అండమును పూరించుటకు యత్నము జరుగుచుండును. సృష్టికాండ సాగుటకు సగభాగము నుండి ప్రాణశక్తి సూర్యకిరణముల రూపము లగును.

రెండవ సగభాగము చంద్ర కిరణముల రూపముగ వ్యక్తమగుచు గర్భధారణము నొనరించుచూ దేహములను కల్పించు చున్నవి. ఈ రెండు భాగములను స్త్రీ, పురుష అంశలుగా ఎంచబడు చున్నవి.

దేవలోకము, పితృలోకములుగ కూడ తెలియబడుచున్నవి. సూర్య చంద్రాదులుగ కూడ తెలియబడుచున్నవి. సూర్యుడు వృషభముగను, చంద్రుడు గోవుగను, భూమి దూడగను గుప్తవిద్యలలో వర్ణింప బడినవి.

ఈ సందర్భముననే ఒకటి మూడగుచున్నదని చెప్పబడినది. అందు ఒకటి నిత్యము. రెండవది అమృత మయము. మూడవది భ్రాంతి మూలకము. సూర్యుని చుట్టునూ భూమి తిరుగుదారి నిత్యము. భూమి చుట్టునూ సూర్యుడు తిరుగు చున్నట్లు కనిపించు దారి భ్రాంతి చక్రము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


17 Jan 2021

No comments:

Post a Comment