కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 165
🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 165 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 95 🌻
కాబట్టి నిజానికి పురుషుడు త్రివిధంబులు. క్షర, అక్షర పురుషోత్తములు. ఏ స్థితిలో ఉన్నా పురుషుడే. పురుషుడన్న స్థితికి ఏం భేదంలేదు. పురము నందు ఉన్నవాడెవడో, అధిష్ఠానముగా వాడే పురుషుడు. ఇది పురుషునికి అర్థం. అంతే కానీ, స్త్రీ పురుషులని అర్థం కాదు.
పురము అంటే, అర్థం ఏమిటి, ఎనిమిది శరీరాలు పురములు. ఎనిమిది జగత్తులు పురములే. ఎనిమిది వ్యవహారములు పురములే. కాబట్టి, ఆయా వ్యవహారములయందు అధిష్ఠానముగా ఉన్నటువంటి, విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యక్ ఆత్మ విరాట్ హిరణ్యగర్భ పరమాత్మలనే సాక్షిస్వరూపములన్నీ పురుషుడే.
వీటినన్నింటినీ క్రోడీకరిస్తే క్షరపురుషుడు అనేటటుంవంటి జీవుడు, అక్షరపురుషుడు అనేటటుంవంటి బ్రహ్మము పురుషోత్తముడు అనేటటువంటి పరమాత్మగా మనం సిద్ధాంతీకరించాము.
కాబట్టి, ఈ స్థితి భేదాన్ని బట్టి, భావన భేదాన్ని బట్టి, నిర్ణయభేదాన్ని బట్టి, నిర్వచనం ఇచ్చారే తప్ప, ప్రత్యేకంగా దానివల్ల స్థూలంగా వచ్చేటటువంటి, మార్పేమీ లేదు.
జీవన శైలిలో వచ్చేటటుంవంటి మార్పేమీ లేదు. అంటే అన్నం తినేవాడు అన్నం మానేస్తేనో, అన్నం తింటేనో, లేదంటే కొండగుహలలో ఉన్నవాడు జనారణ్యంలోకి వస్తేనో, జనారణ్యంలో ఉన్నవాడు కొండగుహలలోకి వెళ్తేనో, లేదా నిరంతరాయంగా రోజుకి 16 సార్లు స్నానం చేయడం వల్లనో, ఇలా భౌతికమైనటువంటి విధులలో మార్పులు చేసినంత మాత్రమున ఈ వివేకము సాధించబడింది అని చెప్పడానికి అవకాశం లేదు.
కానీ ఇలాంటివి అన్నీ కూడా నీలో ఉన్నటువంటి మాలిన్య సంగ్రహాన్ని వదిలించుకోవడానికి ఉపయోగపడే సహకారి కాగలదు. అందుకని సాధనకి పరిమితులు చెప్పబడినాయి. యమనియమాది అష్టాంగ యోగ సాధనలో... యమం, నియమం చాలా ముఖ్యమైనది.
ఇవాళ ఎంతోమంది ఆత్మ జ్ఞానమనీ, బ్రహ్మజ్ఞానమనీ, విచారణ చేసేటటువంటి వారు కానీ, ఆత్మసిద్ధులని, ఆత్మనిష్ఠులనీ, ఆత్మోపరతులని, ఆత్మోపబ్ధిని పొందామని, తత్వదర్శిలమని పేరుపొందిన వారిలో ఇట్టి యమ నియమాలు గోచరించుట లేదు అనేది పెద్దల వ్యాక్యము. ఎందువల్ల? ఏ రకమైనటువంటి యమనియమాలను పాటించడు. ఏ రకమైన విధినియమాలను పాటించడు.
ఏ రకమైనటువంటి శాస్త్రోచిత కర్మలను చేయడు. ఏ రకమైన ధర్మార్థమైనటు వంటి, ప్రయోజన శీలమైనటువంటి, జీవనము చేయడు. కానీ, ఆత్మనిష్ఠుడు అని అంటాడు. ఉండకూడదా? ఉండవచ్చు...! కొండకచో.. ఇటువంటి జీవన్ముక్తులు కూడా ఉండవచ్చు. బ్రహ్మ నిష్ఠులు కూడా ఉండవచ్చు. కాని వారు అత్యంత అరుదుగా ఉన్నారు.
భగవాన్ రమణులు ఏమీ చేయలేదు కదండీ! అనేటటువంటి వాక్యాన్ని తరచుగా వింటూ ఉంటాము. కానీ, వారికున్నటువంటి సహజనిర్వికల్ప సమాధినిష్ఠ మరి అందరికీ లేదు కదండీ! వారి స్థితిననుసరించి, వారి వ్యవహారం ఉంటుంది. జీవన్ముక్తులు ఇలాగే ఉండాలి అనే నియమం లేదు. జగత్ వ్యవహార శైలిని బట్టి వారుండరు. వారు ఉండవలసిన రీతిగా వారుంటారు.
ఎట్లా ఉంటే, లోక కళ్యాణం సాధ్యమౌతుందో, అట్లా ఆ అవతారుడు, అట్లా ఆ జీవన్ముక్తుడు ఉంటాడు. ఆ స్థితికి వచ్చేవరకూ సర్వసామాన్య నియమములను సర్వసామాన్య ధర్మములను మొక్షార్దియై ఆచరించవలెను. ఇది చాలా ముఖ్యమైనటువంటిది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
17 Jan 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment