కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 150


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 150 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మను తెలుసుకొను విధము - 80 🌻


బోధించాలి అంటే మరి ఒక మెట్టు దిగి వచ్చి వాగ్రూపంగా, శబ్దాన్ని ఆశ్రయించి బోధించాలి, వ్యాఖ్యానించాలి. అట్లా వ్యాఖ్యానించినపుడు ఒక మెట్టు పరమాత్మ స్థితి నుండి క్రిందకి దిగి పోయి విరాడ్రూపంగా, హిరణ్యగర్భ స్థితినుండే బోధించవలసినటువంటి అగత్యం వస్తుంది.

హిరణ్యగర్భ స్థితి దాటిన తరువాత బోధించటానికి అవకాశం ఉండదు. అవ్యాకృత పరమాత్మలుగా బోధించేటటువంటి అవకాశం లేదు. ఎవరన్నా బోధిస్తున్నారు అన్నా కూడ అది వాచ్యార్ధం తెలియచెప్పటమే కాని, లక్ష్యార్ధం తెలియజెప్పటం కాదు. లక్ష్యార్ధమును మౌనవ్యాఖ్య ద్వారానే అందుకోవలసినటువంటి అవసరం ఉన్నది అనేటటువంటి స్పష్టతను ఇక్కడ అందిస్తున్నారు.

కారణం ఏమిటటా ?- దానికి రెండు లక్షణములు ఉన్నాయి. రూపరహితమైనటువంటిది, గుణ రహితమైనటువంటిది. అటువంటి నిర్గుణమైనటువంటి పరబ్రహ్మమును బోధించటానికి శబ్దము సమర్ధము కాదు. ఆకాశభూతకమైన శబ్దము పంచభూతాత్మకమైన పంచీకరించబడినటువంటి దానిని బోధించగలుగుతుందే కాని, అపంచీకృత భాగమైనటువంటి బ్రహ్మమును, అపంచీకృత భాగమైనటువంటి పరబ్రహ్మమును దానికి విలక్షణమైనటువంటి పరబ్రహ్మమును బోధించటానికి వీలుకాదు.

కాబట్టి “నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే” అనే సూత్రమును అనుసరించి ఏకాక్షరమైనటువంటి ప్రణవాతీతమైనటువంటి స్థితిని తెలుసుకోవాలి అంటే , నీవు తప్పక మౌనవ్యాఖ్యను ఆశ్రయించాలి అనేటువంటి నిర్ణయాన్ని తెలియజేస్తున్నారు.

అటువంటి నిర్గుణ పరబ్రహ్మము యొక్క వాస్తవ రూపమును తెలుసుకోవాలి అంటే తప్పక హిరణ్యగర్భ, విరాట్ రూపముల ద్వారానే నీవు తెలుసుకోగలుగుతావు. ఆ అనుభూతి ద్వారా, ఆ నిర్ణయం ద్వారా నీవు దానిని గ్రహించగలుగుతావు అని మరొకసారి తెలియజేస్తున్నారు. ఈ రకంగా నచికేతునికి యమధర్మరాజు బోధిస్తూఉన్నారు.

నచికేతా! ఎవని నుండి సూర్యుడు ఉదయించుచున్నాడో, ఎవని యందు అస్తమించుచున్నాడో, ఎవని నతిక్రమించుటకు దేవతలు కూడ సమర్ధులుకారో అతనిని బ్రహ్మమని తెలుసుకొనుము. ఇచట ఏది కలదో, అచటను అదియే కలదు. అచట ఏది కలదో ఇచటను అదియే కలదు. ఎవరు ఈ విషయమున అనేకముగా చూచుచున్నారో వారు మరల జనన మరణ రూప సంసారమును పొందుచున్నారు.

జనన మరణ చక్రం ఎలా జరుగుతుందో కూడ ఇక్కడ బోధిస్తున్నారు. ఎవరి ప్రభావం చేతైతే సూర్యుడు ప్రకాశిస్తూఉన్నాడో, ఎవరి ప్రభావం చేతైతే సూర్యుడు అస్తమిస్తూ విరమిస్తాడో ఆ స్థానం పేరు బ్రహ్మము. అందుకే సూర్యుడును ప్రత్యక్ష సాక్షియని, కర్మసాక్షియని, కర్తవ్యసాక్షియని, త్రిమూర్త్యాత్మకమని, త్రిశక్త్యాత్మకమని, బ్రహ్మమని పిలవబడుతూ ఉన్నది. ఏ బ్రాహ్మీభూత శక్తి చేత సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడో ఆ సూర్యస్థాన నిర్ణయం హిరణ్మయకోశ స్థానము కూడ అయి ఉన్నది. కాబట్టి అది బ్రహ్మము, అలా తెలుసుకోవాలి.

అలా తెలుసుకున్న తరువాత ఆ హిరణ్మయ స్థానం లో ఎలా అయితే సర్వజీవులు విరమిస్తూ, మరల సృష్టి పునః ప్రాదుర్భవించే కాలంలో ఎలా అయితే మరల పునఃసృష్టి జరుగుతుందో, అక్కడ సృష్టి యొక్క క్రమవిధానం ఎలా ఉన్నదో, ఇక్కడ పంచభూతాత్మకమైనటువంటి సృష్టి కూడ భూమి మీద జరిగేటటువంటి సృష్టికూడ అలాగే ఉన్నది. అక్కడ సూక్ష్మమైనటువంటి లోకాదుల సృష్టి ఎలా ఉన్నదో, ఇక్కడ స్థూలమైనటువంటి జీవుల సృష్టి కూడ అదే తీరుగా ఉన్నది.

కాబట్టి అక్కడ ఏది కలదో ఇక్కడ కూడ అదే కలదు. ఇక్కడ ఏది కలదో అక్కడ కూడ అదే ఉంది. అనగా ఆత్మనిష్టులు, బ్రహ్మనిష్టులు, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వారికి ఆ స్థితి నుంచి చూడటం చేత, అక్కడా, ఇక్కడా ఉన్నటువంటి ఏకాత్మతా భావన ఉన్నది. ప్రత్యక్ పరమాత్మలు అభిన్నులు అనేటటువంటి నిర్ణయాన్ని పొందుతూ ఉంటారు. జ్ఞాత, కూటస్థుడు బింబ ప్రతిబింబ సమానులు అనే నిర్ణయాన్ని పొందుతూఉంటారు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


02 Jan 2021

No comments:

Post a Comment