🌹 . శ్రీ శివ మహా పురాణము - 313 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
77. అధ్యాయము - 32
🌻. వీరభద్రుడు - 3 🌻
హే శంభో !నా కుడి భాగములు మరల మరల అదరుచున్నవి. ఈనాడు విజయము నిశ్చితము. హే ప్రభో !కావున నన్ను పంపించుము (41). హే శంభో !నాకు వర్ణింపశక్యము గాని ఆనందము, ఉత్సాహము కలుగుచున్నవి. నా మనస్సు నీ పాదపద్మముల యందు లగ్నమై యున్నది (42).
నాకు ప్రతి అడుగునందు శుభములు ప్రవాహము వలె ఒకదాని తరువాత మరియొకటి లభించగలవు. మంగళములకు నిధానమగు శంభుని (నీ) యందు ఎవనికి దృఢమగు భక్తి ఉండునో, వానికి ప్రతి దినము విజయము, ప్రతి దినము శుభము కలుగుట నిశ్చయము (43).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఉమాపతి యగు శివుడు వీరభద్రుని ఈ పలుకులను విని సంతసించి, 'వీరభద్రా !నీకు జయమగుగాక!' అని ఆశీర్వదించి, మరల ఆతనితో నిట్లనెను (44).
మహేశ్వరుడిట్లు పలికెను -
వత్సా!వీరభద్రా! నా మాటను మనస్సు లగ్నము చేసి వినుము. నేను చెప్పబోవు కార్యమును ప్రయత్న పూర్వకముగా శీఘ్రమే చేసి, నాకు ఆనందమును కలిగించుము (45). బ్రహ్మకు పుత్రుడు, దుష్టుడు, విశేషించి నన్ను ద్వేషించువాడు, మహా గర్వితుడు, మూర్ఖుడునగు దక్షుడు ఈనాడు యజ్ఞమును చేయుటకు నడుము కట్టినాడు (46).
ఆ యజ్ఞమును, దాని పరికరములతో సహా భస్మము చేయుము. ఓ గణశ్రేష్ఠా! అట్లు చేసి వెంటనే నా వద్దకు మరలిరమ్ము. దేవతలను, గంధర్వులను, యక్షులను, ఇంకనూ అచటనున్నవారిని వెనువెంటనే ఈనాడే భస్మము చేయుము (48).
అచట విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు, యముడు కూడ ఉండవచ్చును (49). వారిని ఈనాడే ప్రయత్న పూర్వకముగా ఎవ్వరినీ విడువకుండగా పడగొట్టుము. దధీచి నా విషయములో చేసిన శపథమును ఉల్లంఘించి, ఎవరైతే (50) అక్కడ ఉన్నారో, వారిని ప్రయత్న పూర్వకముగా భస్మము చేయుము. సందేహించకుము. నీతో బాటు ప్రమథగణములు కూడ రాగలవు. విష్ణువు మొదలగు వారు భ్రమచే అక్కడనే ఉన్నారు (51).
వారిని వెంటనే నానాకర్షణ మంత్రముతో ఒక చోటకు జేర్చి భస్మము చేయుము. వారు నాకు సంబంధించిన శపథమును ఉల్లంఘించి అక్కడనే గర్వించియున్నారు (52). వారు నాకు ద్రోహము చేసిన వారే. కావున వారిని అగ్ని జ్వాలలతో దహించుము.
దక్షుని యజ్ఞమున జరిగే స్థలములో నున్న వారిని, వారి భార్యలను, వారి యజ్ఞోపకరణులతో సహా అగ్ని జ్వాలలో భస్మము చేసి, శీఘ్రమే మరలి రమ్ము (53).. నీవు అచటికి వెళ్లగానే విశ్వేదేవతలు మొదలగు వారు నిన్ను ఆదరముతో (54) స్తోత్రములను చేసెదరు. అయిననూ వారికి అగ్నికీలలలో భస్మము చేయుము. ద్రోహము చేసిన ఆ దేవతలను కూడా అగ్ని జ్వాలలతో చుట్టు ముట్టి (55), శీఘ్రముగా భస్మము చేయుము. హే వీర !దక్షుడు మొదలగు వారినందరినీ, వారి భార్యలను, బంధువులను కూడ అవలీలగా భస్మము చేసి నీటిని త్రాగుము. యజ్ఞములోని వేదవిధులను పరిరక్షించు బ్రహ్మ అనబడే ఋత్విక్కునైననూ లెక్క చేయ కుండగా సంహరించుము (56).
బ్రహ్మ ఇట్లు పలికెను -
వేద మర్యాదను రక్షించువాడు, మృత్యువునకు మృత్యువు, సర్వేశ్వరుడునగు శివుడు క్రోధముతో ఎరుపెక్కిన కన్నులు గలవాడై మహావీరుడగు వీర భద్రునితో నిట్లు పలికి విరమించెను (57,58).
శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితలో రెండవది యగు సతీఖండలో వీర భద్రోత్పత్తి వర్ణ నమనే ముప్పది రెండవ అధ్యాయము ముగిసినది (32).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
02 Jan 2021
No comments:
Post a Comment