గీతోపనిషత్తు -140
🌹. గీతోపనిషత్తు -140 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚
శ్లోకము 25
🍀. 23. మోక్ష స్థితి - ఋషులు బ్రహ్మ నిర్వాణము అనుగ్రహముగ పొందినవారు. వారు చరించు బ్రహ్మములే. బ్రహ్మ నిర్వాణము పొందినవారికి కల్మషములు శాశ్వతముగ నశించి యుండును. మనోబుద్ధి యింద్రియములు యమింపబడి యుండును. వారు భూమిపై చరించుటకు కారణము సర్వభూతములకు హితము కలిగించుటకే. బ్రహ్మ నిర్వాణము చెందుట, బ్రహ్మ సాయుజ్యము పొందుట, బ్రహ్మమగుట ఊరక యుండుటకు కాదు. మోక్షమనగ ఏ బంధములు లేక, ఏ పనిలేక ఎక్కడో ఒక అద్భుతమగు లోకమున హాయిగ నుండుట అని సామాన్యు లందరు భావింతురు. వారికంతయు బ్రహ్మమే. అట్టివారు శరీరధారులై భూమిపై చరించుటకు ముఖ్యమగు కారణ మొకటియే సర్వభూతములకు హితము కలుగ జేయుటకు వారు అమితాసక్తులై యుందురు. 🍀
లభంతే బ్రహ్మనిర్వాణమ్ ఋషయః క్షీణకల్మషాః ।
ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః ।। 25 ।।
ఋషులు బ్రహ్మ నిర్వాణము అనుగ్రహముగ పొందినవారు. వారు చరించు బ్రహ్మములే. బ్రహ్మ నిర్వాణము పొందినవారికి కల్మషములు శాశ్వతముగ నశించి యుండును. మనోబుద్ధి యింద్రియములు యమింపబడి యుండును. వారు భూమిపై చరించుటకు కారణము సర్వభూతములకు హితము కలిగించుటకే.
బ్రహ్మమును ధ్యానించి సాలోక్య, సామీప్య, సాయుజ్య, సారూప్య సోపాన మార్గమున బ్రహ్మమైన వారు వశిష్ఠాది బ్రహ్మర్షులు. బ్రహ్మర్షులనగ స్ఫురించువారు అత్రి, భృగువు, అంగీరసుడు, వశిష్ఠుడు, అగస్త్యుడు, గౌతముడు ఆదిగా గల ఋషులు. వీరి యందు వెదకి చూచినను కల్మష ముండదు.
వారు కాలమును, దేశమును, దైవమును ఎరిగిన వారు. వారికి సంశయము లుండవు. వారు సమస్తమును బ్రహ్మముగనే దర్శింతురు. ద్వంద్వములగు మంచి చెడులు వారి పై ప్రభావము చూపవు. వారికంతయు బ్రహ్మమే. అట్టివారు శరీరధారులై భూమిపై చరించుటకు ముఖ్యమగు కారణ మొకటియే సర్వభూతములకు హితము కలుగ జేయుటకు వారు అమితాసక్తులై యుందురు.
కోరినవారికి హితము చేయుటయే పనిగ అహోరాత్రములు ఉన్ముఖులై యుందురు. పరులకు హితము చేయుట పరమాత్మకు చేయు ఆరాధనగ వారు భావించుచుందురు. బ్రహ్మ నిర్వాణము చెందుట, బ్రహ్మ సాయుజ్యము పొందుట, బ్రహ్మమగుట ఊరక యుండుటకు కాదు. మోక్షమనగ ఏ బంధములు లేక, ఏ పనిలేక ఎక్కడో ఒక అద్భుతమగు లోకమున హాయిగ నుండుట అని సామాన్యు లందరు భావింతురు.
కల్మషములు లేనిచోట బంధము లేదు. సంశయము లేనిచోట చిక్కు పడుటయు ఉండదు. బ్రహ్మమునందు మనసు నిలచుట చేత శరీరము, యింద్రియములు, మనసు వశమున నుండును. అహంకార భావము నశించి యుండును. చిత్తవృత్తులందు తనదైన స్వభావము చిందులాడక దైవీ స్వభావమే మిగులును.
అట్టి స్థితి యందు పరహిత మనునది పరమ ధర్మముగ నిర్వర్తింప బడును. అదియే మోక్ష స్థితి. శరీరము వదలిన వెనుక వచ్చునది మోక్షమని భావించుట అజ్ఞానము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
04 Feb 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment