ఎరుకతోనే జ్ఞాన సిద్ధి


🌹. ఎరుకతోనే జ్ఞాన సిద్ధి 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ


విజయాలు కూడా పరాజయాలే అవుతాయి. కానీ, పరాజయాలు మాత్రం ఎప్పుడూ పరాజయాలే. అప్పుడప్పుడు లభించిన చిన్నచిన్న ఆనందాలు కేవలం మీరు పడ్డ బాధలకు లభించిన బహుమతులు మాత్రమే. మీకు లభించిన ఉల్లాసాలన్నీ కేవలం మీ కలల సామర్థ్య ఫలితమే.

మీరు వట్టి చేతులతో వెళ్ళిపోతున్నారు. జీవితం కేవలం ఒక విషవలయం లాంటిది. అందులో చిక్కుకున్న మీరు ఎక్కడికీ పోలేక అక్కడే గిరగిరా తిరుగుతున్నారు. ఎందుకంటే, వలయంలోని కేంద్రం అన్ని వైపులకు ఒకే దూరంలో ఉంటుంది. కాబట్టి, మీరు ఎక్కడున్నా వలయంలో ఉన్నట్లే. విజయాలు, పరాజయాలు, బాధలు, ఆనందాలు- ఇలా ఆ వలయంలో అన్నీ జరుగుతూ ఉంటాయి.

కానీ, అందులో మీ ఉనికి కేంద్రం ఎక్కడైనా, ఎప్పుడైనా వలయ కేంద్రానికి సమాన దూరంలోనే ఉంటుంది. ఆ వలయంలో తిరుగుతున్నప్పుడు మీకు ఏదీ కనిపించదు. ఎందుకంటే, అలా తిరగడంలో నిమగ్నమైన మీరు అందులో భాగమవుతారు. అలా తిరగడం ఆగిన వెంటనే మీరు రిక్తహస్తాలతో శూన్యంగా నిలబడతారు.

ఖలీల్ జిబ్రాన్ రచించిన ‘‘ది ప్రోఫెట్’’అనే పుస్తకంలో ‘‘ఆల్-ముస్త్ఫా’’ ప్రవక్త ‘‘ నాకు పిలుపువచ్చింది. నన్ను తీసుకెళ్ళేందుకు ఓడ కూడా సిద్ధంగా ఉంది. వెళ్ళే ముందు ఒకసారి మీ అందరినీ, మీతో గడిపిన ఇక్కడి పరిసరాలను చూడాలనిపించింది. అందుకే వచ్చాను’’ అంటాడు.

ఇంకా అందులో అతడు ‘‘నేను సముద్రంలో కలిసే నది లాంటి వాడిని. నది సముద్రంలో కలిసే ముందు తాను వచ్చిన దారిని- కొండలు, కోనలు, అడవులు, మైదానాలను- ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటుంది. ఎందుకంటే, ఒకసారి సముద్రంలో కలిసిన వెంటనే నది సముద్రమై పోతుంది. కాబట్టి, ఆ నదిలాగే నేను కూడా మిమ్మల్ని చూసేందుకు వచ్చాను’’ అంటాడు.

గతాన్ని పట్టుకుని వేలాడకుండా ఉన్నప్పుడే మీరు వెనక్కి తిరిగి చూడగలరు. లేకపోతే, గతాన్ని వదులుకునేందుకు మీరు చాలా భయపడతారు. పైగా, అప్పుడు మీ గత జీవిత చలనచిత్రాన్ని పూర్తిగా చూసే సమయముండదు. ఎందుకంటే, మీకున్న సమయం కేవలం అర క్షణం మాత్రమే.

పూర్తి ఎరుకతో మరణిస్తున్నప్పుడు మాత్రమే ఆ అర క్షణంలో మీ గత జీవిత చలనచిత్రాన్ని మీరు పూర్తిగా చూస్తారు. అది దానంతటదే జరిగిపోతుంది తప్ప, దాని కోసం మీరు ప్రత్యేకంగా చేసేది ఏమీ ఉండదు.

‘మీరు మీ చిన్నప్పటి నుంచే చాలా తెలివిగా, ధైర్యంగా ఉన్నారు. నేను ఇప్పటికీ మీలా ధైర్యంగా లేను’’ అని చాలామంది నాతో అంటూ ఉంటారు. దానికి కారణం గత జన్మలో మీరు మరణించిన దానికన్నా భిన్నంగా నేను మరణించాను. అందుకే మీకు, నాకు మధ్య అంత తేడా ఉంటుంది.

ఎందుకంటే, మీరు ఎలా మరణిస్తారో అలాగే జన్మిస్తారు. నాణేనికి ఒకవైపు మీ మరణం ఉంటే, అదే నాణేనికి మరొక వైపు మీ జననం ఉంటుంది. నాణేనికి ఒకవైపు దైన్యం, వేదన, గందరగోళం, కోరిక లాలసలుంటే, మరొకవైపు ధైర్యం, స్పష్టత, ఎరుక, తెలివితేటలుండే అవకాశముండదు. కాబట్టి, అలాంటి వాటిని ఆశించడం పూర్తిగా అసమంజసం.

అందువల్ల వాటిని మీరు ఆశించకూడదు. పైగా, మొదటి నుంచి చాలా తెలివితేటలతో, ధైర్యంగా ఉండేందుకు ఈ జీవితంలో నేను ప్రత్యేకంగా చేసినది ఏమీలేదు. అలాంటివి ఉంటాయని కూడా నాకు తెలియదు. అందుకే వాటి గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹


04 Feb 2021

No comments:

Post a Comment