రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
86. అధ్యాయము - 41
🌻. దేవతలు శివుని స్తుతించుట -2 🌻
మంగళస్వరూపుడు, భయంకరా కారుడు, శుభకరుడు అగు నీకు నమస్కారము. నీవు ఉగ్రుడవు, సర్వప్రాణులకు అధీశ్వరుడవు, మకు మంగలముల నిచ్చువాడవు (22). కళ్యాణ కరుడు, సర్వజగద్రూపుడు, పరబ్రహ్మ, ఆపదలను గట్టెక్కించువాడు, ఉమాపతి అగు నీకు నమస్కారము (23). ఈశ్వరుడు (హింసకుడు), సర్వజగద్రూపుడు, దేహమునందు ఆత్మరూపముగా నుండువాడు, పరమాత్మ కారణ కార్య భావమునకు అతీతుడు, మహత్తునకు కారణమైనవాడు అగు నీకొరకు నమస్కారము (24).
లోకములో అనేక రూపములుగా పుట్టి విస్తరించినవాడు, కంఠముందు నీలవర్ణము గలవాడు, ప్రశంసనీయుడు, ప్రకృష్ట జ్ఞానమేతుడు అగు రుద్రునకు అనేక నమస్కారములు (25). భక్తులకు కోర్కెలను వర్షించువాడు, ప్రకాశ స్వరూపుడు, జ్ఞానఘనుడు, పరబ్రహ్మ, దేవశత్రువులను సదా సంహరించువాడు అగు నీకు నమస్కారము (26).
ప్రణవప్రతిపాద్యుడు, ప్రాణులను తరింపజేయువాడు, నిత్య యువకుడు, గొప్ప తేజశ్శాలి, నల్లని కేశములు గలవాడు, ప్రకాశ స్వరూపుడు అగు మహేశ్వరునకు అనేక నమస్కారములు (27). దేవతలకు మంగళముల నిచ్చువాడు, సర్వవ్యాపి, పరమాత్మ సర్వోత్కృష్టుడు, నీలకంఠుడు అగు నీకు పునః పునః నమస్కారములు (28).
తేజోమయుడు, తేజోమయమగు దేహము గలవాడు, భయంకరుడు, భయంకరాకారుడు, భయంకరమగు కర్మలయందభిరుచి గలవాడునగు పరమేశ్వరునకు నమస్కారము (29). భస్మము పూయబడిన శరీరము గలవాడు, రుద్రాక్షలను ఆభరణములుగా ధరించినవాడు, పొట్టివాడు, పొడుగువాడు, వామనావతారుడు అగు నీకు నమస్కారములు (30).
ఓ దేవా! దూరమున నున్న శత్రువులను, మరియు ఎదుట నున్న శత్రువులను సంహరించువాడు, ధనస్సును శూలమును గదను నాగలిని ధరించినవాడు అగు నీకు అనేక నమస్కారములు (31).
అనేక ఆయుధములను ధరించి దైత్య దానవులను సంహరించువాడు, సత్పురుషులకు ఆశ్రయణీయుడు, సత్పురుషులచే ధ్యానింపబడు దివ్యరూపము గలవాడు, స్వయముగా అవ్యక్త స్థితి నుండి వ్యక్త జగత్తుగా ప్రకటమగువాడు అగు నీకు నమస్కారము (31).
తత్వమసీత్యాది మహా వాక్యములచే ప్రతిపాదింపబడు ఔపనిషద పురుషుడు, జగన్నాథుడు, సనాతనుడు, పురుషార్థములను ఇచ్చువాడు, వ్రతనిష్ఠుడు, పరమేష్ఠి స్వరూపుడునగు నీకు నమస్కారము (33). సుందరుడు, సుందరాకారుడు, సుందరమగు నేత్రములు గలవాడు, అఘోరుడు మరియు ఘోరుడు, పరమేశ్వరుడు అగు నీకు నమస్కారములు (34).
సర్వ జగన్నియంత, చతుర్ముఖ బ్రహ్మరూపుడు, పరబ్రహ్మ, సాక్షాత్ పరమాత్మ, ఈశానుడు అగు నీకు అనేక నమస్కారములు (35). నీవు ఉగ్రుడవై దుష్టులనందరినీ దండించెదవు. మాకు మంగలముల నిచ్చెదవు. కాల కూట విషమును భక్షించి దేవతలు మొదలగు వారిని రక్షించిన నీకు నమస్కారము (36).
వీరుడు, వీరభద్రస్వరూపుడు, శత్రువీరులను నశింపజేయువాడు, శూలధారి, మహాత్ముడు, పశు (జీవ) పతి అగు మహాదేవునకు నమస్కారము (37). వీరభద్ర స్వరూపుడు, సర్వవిద్యాప్రవర్తకుడు, విషకంఠుడు, పినాకమను ధనస్సును ధరించువాడు, అనంతుడు, సూక్ష్మ స్వరూపుడు, మృత్యురూపమగు క్రోధము గలవాడు అగు నీకు నమస్కారము (38).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
04 Feb 2021
No comments:
Post a Comment