గీతోపనిషత్తు -159
🌹. గీతోపనిషత్తు -159 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 8
🍀 8 - 1. యోగ కారకములు - ఇంద్రియములను జయించినవాడు, జ్ఞానమును గ్రహించినవాడు, నిత్య జీవితమున ఆ జ్ఞానమును నిర్వర్తించి విజ్ఞానముతో కూడి తృప్తుడైనవాడు, మట్టి బంగారము మొదలగు లౌకికములగు విలువలను దాటినవాడు- ఇట్టి సద్గుణములతో కూడినవాడు యోగి అని చెప్పబడుచున్నాడు. జ్ఞానము కేవలము శాస్త్ర జ్ఞానముగనే ఉండి పోరాదు. అది అనుభవజ్ఞానమై నిత్యజీవనమున భాసింపవలెను. 🍀
జ్ఞానవిజ్ఞాన తృప్తాత్మా కూటస్థా విజితేంద్రియః |
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మ కాంచనః || 8
జ్ఞాన సముపార్జన మానవునకు నిత్యా నిత్య వస్తు వివేకము కలిగించును. శాశ్వతము, తాత్కాలికము అగు విషయములను విశదపరచును. తాత్కాలికములతో కూడినవాడు తన నిజస్థితిని కోల్పోయి, అశాశ్వతుని వలె రకరకముల భ్రమలకు లోనగును. జనన మరణములు నిజమునకు జీవుని యాత్రలో ఘట్టములే గాని, ఆద్యంతములు కావు.
జ్ఞానము కలిగియున్నను అది దిన చర్య యందు విజ్ఞానముగ భాసింపనిచో తాను మరణించునని భయము కలుగును. జ్ఞానము కేవలము శాస్త్ర జ్ఞానముగనే ఉండి పోరాదు. అది అనుభవజ్ఞానమై నిత్యజీవనమున భాసింపవలెను. అట్టి వానికి శాశ్వత విలువలయందు ఆసక్తి, అశాశ్వతమగు విషయములందు అనాసక్తి సహజముగ ఏర్పడును.
అట్టివాడే తృప్తుడుగ జీవించగలడు. ఏ విషయమందు తృష్ణ యుండదు. నిత్య జీవితమున కాలమును, దేశమును బట్టి దరిచేరు సన్నివేశముల యందు కర్తవ్యము మేరకు నిర్వర్తించి తృప్తిగ జీవించు చుండును. యజ్ఞార్థముగ వర్తించు చుండును. అనగ పరుల హితము కొరకే ప్రధానముగ జీవించును.
నిత్యానిత్యములు తెలిసినవానికి, తమ కర్తవ్య నిర్వహణ మున నిలచినవానికి స్థిరత్వముండును. ఆకర్షణలు, వికర్షణలు అతనిని భ్రమ భ్రాంతులకు లోను చేయవు. ప్రజ్ఞ నిశ్చలముగ నుండును. ఇంద్రియములు కూడ అతని ననుసరించియే యుండును గాని, ఇంద్రియార్థముల వైపు పరుగిడవు. కర్తవ్యమునకు, పరహితమునకు, దివ్యారాధనమునకు ఇంద్రియములు, మనస్సు సహకరించును.
శరీరము, ఇంద్రియములు అతనిపై ప్రభావము చూపలేవు. అతడే వాని పై ప్రభావము చూపుచు, జ్ఞాన విజ్ఞానముల యందు నిలచియుండును. అట్టి స్థితప్రజ్ఞునకు మట్టి బెడ్డ, రాయి, బంగారమునందు ప్రధానముగ ప్రజ్ఞయే గోచరించును. లోకమంతయు ప్రజ్ఞా విలాసమే అను భావముండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
27 Feb 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment