🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
✍️. భరత్, 📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఒంటె- సింహం- శిశువు: 🌻
ఒంటె అనుకూలమైతే, సింహం ప్రతికూలమైనది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చాలా పెద్దదే అయినప్పటికీ, అవి రెండూ ఒకే ప్రదేశంలో ఉంటాయి. పసిగుడ్డు ఒక ప్రదేశంలో స్థిరంగా ఉంటుంది. అదే ప్రదేశంలో గొంగళి పురుగు కదలడం ప్రారంభిస్తుంది. అంటే ఒకే ప్రదేశంలో కదలిక పుట్టినట్లే కదా!
మీరు ఒంటెలా ఉండడమనేది సమాజం మీకిచ్చిన బహుమతి అయితే, మీరు సింహంలా ఉండడమనేది మీరు మీకిచ్చుకునే బహుమతి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేకపోతే, మీరొక ప్రత్యేకమైన వ్యక్తిగా మారాలనుకోకపోతే, ప్రస్తుతం నడుస్తున్న దానికి వ్యతిరేకంగా వెళ్ళే ప్రమాదాన్ని స్వీకరించే సాహసం మీకు లేకపోతే మీరు ఆ పని చెయ్యలేరు.
కానీ, ఒంటె తత్వాన్ని సరిగా అర్థంచేసుకుంటే మీరు సింహంలా అవుతారు. ‘కాదు’అని చెప్పలేని మీరు ఎప్పుడూ ‘అవును’అని పదే పదే చెప్పడంవల్ల, ఏదో ఒకరోజు ‘అవును’అని చెప్పడం మీకు చాలా చిరాకు కలిగిస్తుంది. అందువల్ల ఏదో ఒక మార్పు కోసం ‘కాదు’అని చెప్పాలనిపిస్తుంది ఎవరికైనా.
అలా ఒంటె తొలిసారిగా సింహంలా మారినట్లు కలలుకనడం ప్రారంభిస్తుంది. ఒకసారి అపనమ్మకంతో సింహంలా సందేహిస్తూ ‘కాదు’అని చెప్పడంలోని రుచిమరిగిన తరువాత మళ్ళీ మీరు ఒంటెలా మారలేరు, ‘అవును’అని ఎప్పటికీ చెప్పలేరు. ఎందుకంటే, సింహంలా ‘కాదు’అని చెప్పడం మీకు ఎంతో స్వేచ్ఛను, స్వతంత్రాన్ని ఇస్తుంది.
అజ్ఞానులైన అనేకమంది ఒంటెస్థాయి వద్ద ఆగిపోతారు. వారికంటె చాలా మెరుగైన కవులు, కళాకారులు, భావుకులు, తత్వవేత్తలు, విప్లవకారులు, సంగీత విద్వాంసులు, చిత్రకారులు వంటి మేధావులు సింహం స్థాయివద్ద ఆగిపోతారు. అంతమాత్రాన గమ్యం చేరుకున్నట్లు కాదు. వారు ఇంకా ఇంటికి చేరుకోలేదు. అదే ‘శిశువు’స్థాయి అయిన మూడవ దశ.
జాగ్రత్తగా వినండి: తొలి దశ అయిన ఒంటె స్థాయిని మీకు సమాజమే ఇస్తుంది. రెండవ దశ అయిన సింహం స్థాయిని మీకు మీరే ఇచ్చుకుంటారు. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారినప్పుడే మూడవ దశ అయిన శిశువుస్థాయి మీకు లభిస్తుంది. లేకపోతే అది మీకు ఎప్పటికీ లభించదు.
కేవలం కదలడం మాత్రమే తెలిసిన గొంగళిపురుగు ఏమాత్రం అర్థంలేకుండా తనకు రెక్కలొస్తాయని, హాయిగా ఎగరగలనని, తర్కవిరుద్ధంగా ఎలా ఊహించగలదు? అది అసంభవం. కేవలం నేలపై కదలడం మాత్రమే తెలిసినవారు గాలిలో ఎగరగలమని ఎలా ఊహించగలరు? అదంతా వేరే కోణం- నిట్టనిలువు కోణం.
ఒంటె సింహంలా మారడం పరిణామం, సింహం శిశువుగా మారడం విప్లవం. సమాజం మిమ్మల్ని ఒంటెగా మార్చగలదు. మీకుమీరే సింహంలా మారగలరు. కానీ, సింహం శిశువుగా మారేందుకు మాత్రం సీతాకోకచిలుకలా పరిణామం చెందిన బుద్ధుడు, మహావీరుడు, రూమీ లాంటి గురువులు చాలా అవసరం. అప్పుడే మీరు వారిలా అవాలనే కలలుకనగలరు. లేకపోతే, మీకు తెలియని వాటి గురించి మీరు ఎలా కలలు కనగలరు?
హిమాలయాలలో నివసిస్తున్న అతి ప్రాచీన ఆదివాసీలు తాము ఎప్పుడూ చూడని ‘‘మోటారు వాహనం (కారు)’’ గురించి కల కనలేరుకదా! కాబట్టి, ఏదైనా చూసినప్పుడే దాని గురించి మీరు కల కనగలరు.
బుద్ధుడు, బోధి ధర్మలను చూసినప్పుడే అలాంటి మహానుభావులు ఉన్నారని మీకు తెలుస్తుంది. చూసేందుకు వారుకూడా మీలాగే మామూలు మనుషులుగా కనిపిస్తారు. కానీ, వారు మామూలు మనుషులు కారు. అనంత దిగంతాల ఆవలి తీరంలో ఉన్న ఏదో తెలియని శక్తి వారి ఉనికిలోకి ప్రవేశించినట్లు మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది.
మీరు ప్రేమతో, దయతో వారిని సమీపించినప్పుడు వారి అంతర్గత ఆకాశం మీకు లీలగా కనిపిస్తుంది. అప్పటినుంచి మీరు దానికోసం కలలుకంటూ ఎలాగైనా, ఎప్పటికైనా వారిలా అవ్వాలని ఆశిస్తూ ఉంటారు. గురువు నుంచి శిష్యునికి సంక్రమించే అంటురోగం అదే. అలా మూడవ దశ అయిన ‘శిశువు’దశ మీకు గురువునుంచి సంక్రమిస్తుంది. అదే పరస్పరాలంబనతో కూడుకున్న సృజనాత్మకత.
మొదటి దశ అయిన ఒంటె దశ పరాధీనమైనది. రెండవ దశ అయిన సింహం దశ స్వతంత్రమైనది. కానీ, మూడవ దశ అయిన శిశువు దశ పరాధీనమైనది కాదు, స్వతంత్రమైనది కాదు. అస్తిత్వమంతా పరస్పరాలంబనతో కూడుకున్నదే. అందులో ఉన్నవన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడ్డవే. అందుకే అవి అన్నీ ఈ అస్తిత్వంలో ఎప్పుడూ ఒకటిగా కలిసే ఉంటాయి.
‘‘నేను, నీవు’’అనేవి లేవు. అలాగే ‘‘అవును, కాదు’’అనేవి కూడా లేవు. ఎప్పుడూ విధేయతతో ‘అవును’అని, అవిధేయతతో ‘కాదు’అని చెప్పవలసిన అగత్యంకూడా ఏమాత్రంలేదు. సర్వస్వ జ్ఞానోదయమంటే అదే. కాబట్టి, అందరూ మరింత సమయస్ఫూర్తితో మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించే సమయం ఆసన్నమైంది.
- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
27 Feb 2021
No comments:
Post a Comment