శ్రీ శివ మహా పురాణము - 359


🌹 . శ్రీ శివ మహా పురాణము - 359 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

93. అధ్యాయము - 05

🌻. మేనాదేవి వరములను పొందుట - 2 🌻


మేన ఇట్లు పలికెను -

ఓ దేవీ! నేనీనాడు నీ రూపమును ప్రత్యక్షముగా చూచితిని. నిన్ను నేను స్తుతింపగోరుచున్నాను. ఓ కాళీ! ప్రసన్నురాలవు కమ్ము (18).

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడు మేన ఇట్లు పలుకగా, సర్వులను మోహింపజేయు ఆ కాళీ దేవి మిక్కిలి ప్రసన్నమగు మనస్సు గలదై బాహువులతో ఆమెను కౌగిలించుకొనెను (19). అపుడు మేనకకు గొప్ప జ్ఞానము కలిగెను. ఆమె తన ఎదుట నున్న కాళికను, శివుని భక్తితో ప్రీతికరములగు వాక్కులతో స్తుతించెను (20).

మేన ఇట్లు పలికెను -

మహామాయ, జగత్తును పోషించు తల్లి, లోకములను తన సత్తచే ధరించునది, మహాదేవి, కోర్కెలనన్నిటినీ ఈడేర్చునది అగు చండికను నమస్కరించు చున్నాను (21).

శాశ్వతా నందమును ఇచ్చునది, యోగ నిద్రా స్వరూపిణి, జగత్తులను కన్నతల్లి, నిత్య సిద్ధురాలు, శుభకరములగు పుష్పముల మాలను ధరించునది అగు మహామాయకు నమస్కరించుచున్నాను (22).

తల్లులకు తల్లి, నిత్యానందరూపిణి, భక్తుల శోకముల నశింపజేయునది, కల్పక్షయము వరకు స్త్రీల మరియు ప్రాణుల బుద్ధి రూపములో ప్రకటమగునది అగు దేవికినమస్కరించుచున్నాను (23).

యతీశ్వరుల సంసార బంధమును ఛేదించు జ్ఞానము నీవే. నావంటి వారలు నీ ప్రభావము నెట్లు గానము చేయగలరు?అథర్వవేదములోని హింసా ప్రయోగము నీ స్వరూపమే. నీవు నిత్యము నాకు అభిష్టములగు కోర్కెల నీడేర్చుము (24).

ఆకారము లేనివి, కంటికి కనబడనివి, నిత్యానిత్యములు అగు భూతసూక్ష్మముల నుండి ఈ పాంచ భౌతిక జగత్తు కూర్చబడుచున్నది. నిత్యరూపిణి వగు నీవే వాటి యొక్క నిత్యశక్తివై ఉన్నావు. నీవు త్రిగుణ సంయోగముతో గూడి ఆయా కాలముల యందు సర్వసమర్థమగు స్త్రీరూపములో అవతరించెదవు (25).

జగత్తులు నీ నుండి యే పుట్టినవి. జగత్తు లను పోషించు తల్లివి నీవే. నీవు సనాతనురాలవు. నీవు ప్రకృతికంటె ఉత్కృష్టురాలవు. పరబ్రహ్మ స్వరూపము నీ అను గ్రహము చేతనే తెలియబడుచున్నది ఓ తల్లీ! అట్టి శాశ్వతురాలవగు నీవు నా యందీనాడు ప్రసన్నురాలవు కమ్ము (26). అగ్ని యందలి తీక్ణమగు ఉష్ణశక్తి నీవే. సూర్యకిరణముల యందలి తపింపచేయు శక్తి నీవే. సర్వత్ర వ్యాపించి ఆహ్లాదింప జేయు వెన్నెల నీవే. ఓ చండీ! అట్టి నిన్ను నేను నమస్కరించి స్తుతించుచున్నాను (27).

స్త్రీలు నిన్ను అధిక ప్రీతితో ఆరాంధిచెదరు. ఊర్ధ్వ రేతస్కులగు యోగుల నిత్యశక్తివి నీవే. సర్వప్రాణులలోని ఇచ్ఛాశక్తి నీవే. విష్ణువు యొక్క మాయ కూడా నీవే (28). ఓ దేవీ! నీవు స్వేచ్ఛచే వివిధ రూపములను ధరించి జగత్తు యొక్క సృష్టి స్థితిలయములను చేయు చున్నావు. బ్రహ్మ విష్ణు రుద్రుల శరీరములకు హేతువు. నీవే. నీకు అనేక నమస్కారములు. నీవీ నాడు నన్ను అను గ్రహించుము (29).

బ్రహ్మ ఇట్లు పలికెను -

దుఃఖముల నుండి తరింపజేయు ఆ కాలికా దేవి ఇట్లు స్తుతింపబడినదై మేనకా దేవితో'వరమును కోరుకొనుము' అని పలికెను (30).

ఉమాదేవి ఇట్లు పలికెను -

హిమవంతుని ప్రియురాలవగు నీవు నాకు ప్రాణ ప్రియురాలవు. నీవు దేనిని కోరినా నేను నిశ్చితముగా నీయగలను. నేను ఈయలేనిది ఏదీ లేదు (31). మహేశ్వరి యొక్క అమృత సమమగు ఈ మాటలను విని, హిమవంతుని ప్రియురాలగు ఆ మేన మిక్కిలి సంతసించి ఇట్లు పలికెను (32).

మేన ఇట్లు పలికెను-

హే శివే! నీకు జయమగు గాక! హే ప్రాజ్ఞే!హే మహేశ్వరీ! హే అంబికే! నేను నీచే ఈయబడే వరములకు యోగ్యురాలనైనచో, నేను ఒక శ్రేష్ఠమగు వరమును కోరెదను (33). ఓ జగన్మాతా! ముందుగా నాకు వందమంది పుత్రులు కలిగెదరు గాక! వారు దీర్గాయువులు, బలవంతులు, సంపన్నులు, జ్ఞానము గలవారు అగుదురు గాక! (34).

ఆ తరువాత సుందర రూపముతో, గుణములతో ఒప్పారునది, పుట్టిన ఇంటికి మెట్టిన ఇంటికి ఆనందమును కలిగించునది, ముల్లోకముల యందు పూజింపబడునది అగు కుమార్తెను నేను కోరుచున్నాను (35). హే శివే! దేవ కార్యము కొరకై నీవు నా కుమార్తె వై జన్మించి, రుద్రుని భార్యవు కమ్ము. ఓ అంబికా! నీ లీలలను ప్రదర్శించుము (36).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


27 Feb 2021

No comments:

Post a Comment