భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 241


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 241 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. యాజ్ఞవల్క్యమహర్షి - 5 🌻


31. ఈ యథార్థ సంసారజీవనవిధానం కర్మయొక్క రచన. దానిని విమర్శనాదృష్టితో చూడటం విమర్శకారిత్వం. తను అందులో ఎందుకు లీనంకావాలి? అది తనను అనుభవించటం లేదు. తనెందుకు దానిని అనుభవించాలి? తాను యథార్థస్థితిలో సాక్షివలె చూడాలి.

32. అప్పుడు అది బంధనహేతువు కాదు. అది ఈతడిని ఏమీ చేయలేదు. కీర్తి, అపకీర్తి, విమర్శ, ప్రశంశ, రావటం, పోవటం, ధనం రావటం, పోవటం ఇవన్నీ కూడా తాను అనుభవించేదికాదు. అనుభవించినా తాదాత్మ్యతతో కాదు. అది వేరి, తాను వేరు.

33. “నేను నేనే! నాతోనే నేనుంటాను. నేణు ఇంక దేనితోనూ ఉండను. దేనియందూ నాకు సంగబుద్ధి లేదు. నాకు నాయందే సంగబుద్ధి” అని ఉండాలి. ప్రకృతిని చూచి భయపడి పారిపోవలసిన అవసరంలేదు. సంసారానికి భయపడి ఎక్కడికి పారిపోయినా, మనస్సులో అనుసరిస్తూనే ఉంటుంది సంసారం. నమసు ఇక్కడే ఉంతుంది. ఇది మనసులోకి వచ్చి ప్రవేశిస్తుంది.

34. నిస్సంగత్వం, నిర్మోహత్వం ఈ సంసారంలో ఉండికూడా సాధ్యమే. ఏ వస్తువునందు తనకు ఉపరతి కలుగుతుందో – బ్రహ్మ కావచ్చు, శివుడు కావచ్చు, లేకపోతే నిర్గుణమైన బ్రహ్మవస్తువే కావచ్చు – దేనియందైతే అతడు శ్రద్ధ వహించి ఉంటాడో అక్కడికి వెళ్ళగలడు!

35. అట్టివారు (మహర్షులు) త్రిలోకసంచారులు అయ్యారు అంటే అర్థం, వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండి నిర్గుణమైన బ్రహ్మలో లయం పొందుతారు కొద్దిసేపు. మళ్ళీ వస్తారు. శివధ్యానం చేస్తారు. కైలాస ప్రాప్తి కలుగుతుంది. కాసేపు విష్ణులోకానికి వెళతారు. మళ్ళీ మనుష్యుల్లో కొంతసేపు తిరుగుతారు. అంటే స్వతంత్రులు అని అర్థం. ఆనందస్వరూపులై ఉంటారు.

36. తపోలోక జనోలోక మహర్లోకాదులన్నీ కూడా కర్మలోకములు కావు. స్వతంత్రమైన జీవలక్షణం కలిగినవాళ్ళు ఆత్మపరిధిని పొంది అక్కడే ఉండవచ్చును. వాళ్ళకు ఆ లోకంలో స్థానాలున్నాయి. వారు నిరాశ్రయులు కారు. లోకానుగ్రహకాంక్షతో ఇతరులను ఉద్ధరించే లక్షణం కలిగి ఉంటారు.

37. యాజ్ఞవల్క్యుని భార్యలు ఆయనను అంత్యకాలంలో “జరా మృత్యువులు లేని మోక్షమార్గాన్ని తెలియచెప్పమన్నారు”. అందుకు ఆయన, “భర్త భార్యకు ప్రియుడు అంటాముకాని, ఆత్మకొరకే ప్రియుడు. అంటే, తనకొరకే ప్రియుడు అవుతున్నాడు. అంటే, భార్యను భర్త ప్రేమించటం తన ఆనందం కోసమనే, ఎవరూ ఎవరినీ, నిస్వార్థంగా ప్రేమించరు. తమకొరకే వాళ్ళను ప్రేమిస్తారు.

38. పుత్రమిత్రాదులనే కాక, సంస్తాన్నీకూడా ఆత్మప్రయోజన్మ్ కోసమనే ఎవరైనా ప్రేమిస్తారు. ‘అందుచేత, నాకొరకే, నేనే అంటున్నావు కదా! ఎవరీ నేను!’ వినేది, మననం చేసేది అంతా ఆత్మయే అని (ఆత్మావా అరే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్యో).

39. పరమాత్మ సకలానికీ కారణం. ఈ వేదశాస్త్రాలన్నీ ఆ పరమాత్మయొక్క నిట్టూర్పులే!. అజ్ఞానం చేత ఆత్మకు దేహేంద్రియాత్మకమైన జీవభావం కలిగిందని చెప్పాడు. ఆత్మజ్ఞానమే అమృతత్వమని వారికి బోధించి, తాను సన్యసించి వెళ్ళిపోయాడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


27 Feb 2021

No comments:

Post a Comment