✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 8
🍀 8 - 2. యోగ కారకములు - 1. జ్ఞాన విజ్ఞానములచే తృప్తి చెందుట (జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ): గురుబోధల ద్వారా బుద్ధిమంతుడగు సాధకుడు గ్రహింప వచ్చును. గ్రహించిన జ్ఞానమును దినచర్య యందు పూర్ణముగ అనుభూతి చెందుట విజ్ఞానము. అది సాధనతో కూడిన పని. తత్త్వజ్ఞానము స్థిరపడుటకు జీవుడు జీవితమున ఒక సోపానక్రమముగ యజ్ఞార్థ కర్మ లాచరించుచు, దైవము తెలిపిన పరహిత యజ్ఞమును నిర్వహించుచు, సన్యసించిన మనసు కలవాడై యుండవలెను. 🍀
జ్ఞానవిజ్ఞాన తృప్తాత్మా కూటస్థా విజితేంద్రియః |
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మ కాంచనః || 8
పై తెలిపిన శ్లోకమందు నాలుగు అంశములు గోచరించును. యోగమునకివి ప్రధానమైనవి. అవి ఈ విధముగ నున్నవి.
1. జ్ఞాన విజ్ఞానములచే తృప్తి చెందుట (జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ): జ్ఞానము శాస్త్రముల ద్వారా, ఇతిహాస పురాణముల ద్వారా, భగవద్గీతాది గీతల ద్వారా, వేదాంగముల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా, మరియు గురుబోధల ద్వారా బుద్ధిమంతుడగు సాధకుడు గ్రహింప వచ్చును. గ్రహించిన జ్ఞానమును దినచర్య యందు పూర్ణముగ అనుభూతి చెందుట విజ్ఞానము. అది సాధనతో కూడిన పని.
పాకశాస్త్రము నేర్చుకొనినంత మాత్రమున వంట వచ్చిన దన లేము కదా! అనుభవముననే జ్ఞానము వచ్చును. అట్లే తత్త్వజ్ఞానము స్థిరపడుటకు జీవుడు జీవితమున ఒక సోపానక్రమముగ యజ్ఞార్థ కర్మ లాచరించుచు, దైవము తెలిపిన పరహిత యజ్ఞమును నిర్వహించుచు, సన్యసించిన మనసు కలవాడై యుండవలెను.
కర్మయందలి స్వరూప స్వభావముల నెరిగి యజ్ఞార్థము కర్మ నిర్వర్తించుట ఎట్లో మూడవ అధ్యాయమున తెలుపబడినది. అట్టి యజ్ఞకర్మను పండ్రెండు విధములుగ జ్ఞాన యోగమున దైవము తెలిపెను. వానిని నిర్వర్తించుట వలన జ్ఞానముతో యోగించుట సంభవించును. అట్టి వానికి కాంక్ష, ద్వేషము లేని స్థితి అన్ని విషయములయందు ఏర్పడుట సన్యాస యోగమున తెలుపబడినది.
అటు పైన ఈ అధ్యాయమున సంకల్ప సన్యాసము కూడ తెలుపబడినది. ఇట్లు క్రమసోపాన మార్గమున రెండవ అధ్యాయమున తెలిపిన సాంఖ్యము 3, 4, 5 అధ్యాయములలో నిర్వర్తించుట వలన క్రమముగ తత్త్వజ్ఞానము విజ్ఞానముగ పరిణతి చెందును. అట్టి వానికి ఒకటవ అధ్యాయమున తెలిపిన విషాద ముండదు. ఈ క్రమమగు సాధన ఓర్పుతో నిర్వర్తింపని సాధకునకు మిడిమిడి జ్ఞానమే మిగులును. జీవితమున తృప్తి యుండదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
28 Feb 2021
No comments:
Post a Comment