జ్ఞానాన్షేషణతో సత్యనిరూపణ


🌹. జ్ఞానాన్షేషణతో సత్యనిరూపణ 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఒంటె- సింహం- శిశువు: - 2 🌻


గతం, భవిష్యత్తుల నుంచి ఎవరూ ఏ మాత్రం స్పందించకుండా, అందరూ ఈ అస్తిత్వం పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఒంటె గతంలో జీవిస్తుంది. సింహం భవిష్యత్తులో జీవిస్తుంది.

శిశువు ‘‘ఇప్పుడు, ఇక్కడ’’ అనే వర్తమానంలో జీవిస్తాడు. ఒంటె, సింహాలది మనసు, ఆత్మల పూర్వస్థితి. శిశువుది మనసు, ఆత్మల తరువాత స్థితి. మనోరహిత స్థితి అంటే అదే. దానినే ‘‘అహంరహిత స్థితి’’ అంటే మనసు, ఆత్మలు లేని స్థితి అంటారు. అవి ఎప్పుడూ కలిసే ఉంటాయి.

మనసు లేని ఆత్మ, ఆత్మ లేని మనసు మీకు ఎప్పుడూ ఉండదు. ‘‘నీవు, నేను’’ అనేవి ఒకే శక్తిలోని భాగాలు. అవి కూడా అంతర్థానమవుతాయి. శిశువు మాటల కందని మార్మికమైన, అనిర్వచనీయమైన అద్భుతం. ఒంటెకు జ్ఞాపకశక్తి, సింహానికి తెలివితేటలు, శిశువుకు జ్ఞానం ఉంటాయి.

ఒంటె ఎప్పుడూ ఆస్తికుడే. కానీ, సింహం ఎప్పుడూ నాస్తికుడే. అయితే శిశువు మాత్రం ఎప్పుడూ ఆస్తికుడు కాదు, నాస్తికుడు కాదు. వాడు కేవలం ప్రేమ, అమాయకత్వాలతో నిండిన ధార్మికుడు మాత్రమే.

జ్ఞానము సాధించిన మానవుడు సింహంలా మారాడు. అతని తెలివితేటలు అంతరించి పోగానే అంటే తిరిగి వదలగానే శిశువుగా మారిపోతాడు. శిశువుగా మారిపోవడమంటే దైవంగా మారిపోవడమే. దానినే బుద్ధుడు ‘‘నిర్వాణ’’అని అంటాడు. దానినే మీరు ‘‘తావో, దమ్మ, మోక్ష’’అంటూ ఎలాగైనా అనవచ్చు. ఎందుకంటే, మాటలకు అక్కడ పెద్దగా అర్థాలుండవు. అది మాటలు లేని మోనం, ఆలోచన లేని అమాయకత్వం.


🌻. ప్రేమ నుంచి వాత్సల్యానికి: 🌻

ప్రేమకు రెండు విభిన్నమైన పరస్పర వ్యతిరేక అర్థాలున్నాయి. మొదటిది ‘బాంధవ్యం’, రెండవది ‘అస్తిత్వ స్థితి’. బాంధవ్యంతో కూడుకున్న ప్రేమ బానిసత్వంగా మారుతుంది. ఎందుకంటే, అక్కడ ఆశల కోరికలు, ఆశాభంగాల వేదనలు, పరస్పరం శాసించుకునే ప్రయత్నాలు ఉంటాయి. అందువల్ల అది అధికార పోరాటంగా మారుతుంది. కాబట్టి, బాంధవ్యంతో కూడుకున్న ప్రేమ సరియైనది కాదు.

రెండవది ‘‘అస్తిత్వస్థితి ప్రేమ’’. అది పూర్తి విభిన్నంగా ఉంటుంది. ఆ స్థితిలోని ప్రేమ ఎవరినుంచి ఏదీ ఆశించకుండా వ్యాపించే సుమ సుగంధంలా ఉంటుంది. కాబట్టి, ఆ స్థితిలో ఉన్న మీరు ఎలాంటి బాంధవ్యాన్ని సృష్టించకుండా, ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా, నిరంతరం ప్రేమిస్తూ, ఆ ప్రేమను అందరికీ పంచుతూ ఉంటారు. అదే మీకు లభించే బహుమతి.

ప్రేమ సుగంధంలా మారినప్పుడు అది మానవత్వాన్ని మించిన అద్భుత సౌందర్యంతో కూడుకున్న దివ్యత్వ శోభతో వెలిగిపోతూ అన్ని వైపులకు వ్యాపిస్తూ ఉంటుంది. దానిని మీరు ఆపలేరు. అంతేకాదు, అది ఎవరికి ఎలాంటి బంధనాలను సృష్టించదు, వాటిలో ఎవరినీ చిక్కుకోనివ్వదు.

కానీ, మీరు మీ పసితనం నుంచే బాంధవ్యాలను సృష్టించడానికి అలవాటుపడ్డారు. మీ జీవితమంతా అనేక రకాలైన బాంధవ్యాలతో ముడిపడి ఉంటుంది. అవి వాస్తవమైనవి కావచ్చు లేదా ఊహాత్మకమైనవి కావచ్చు. ఏదేమైనా, ఒక రకంగా ఆ బాంధవ్యాలన్నీ అతి సూక్ష్మమైన మానసిక బానిసత్వానికి సంబంధించినవే. మీరు వాటికి బానిస కావచ్చు లేదా మీకు మీరే బానిస కావచ్చు.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹


28 Feb 2021

No comments:

Post a Comment